ఇది నారెండవ కృతి. నా ప్రథమకృతి "అశ్రుమాల" అనే ఖండకావ్యం. అశ్రుమాల ఇప్పటికి 13 ఏండ్ల క్రితం ప్రచురితమైంది. కాని అశ్రుమాలకు సూర్యావలోకనభాగ్యం కల్గిన మఱునాడే నేనున్నతవిద్యార్థమై కెనడాదేశం చేరుకొన్నాను. అందుచేత అశ్రుమాలకు తగినంత వ్యాప్తి చేకూర్చటానికి నాకు శక్తి లేకపోయింది. అశ్రుమాల ముద్రణలో నుండగానే నేను "హనుమప్ప నాయక"కావ్యాన్ని ఆరంభించి ప్రథమాశ్వాసాన్ని పూర్తిచేసినాను. కాని కెనడాలో ఉన్నతవిద్య, ఆ తర్వాత ఖగోళశాస్త్రంలో పదవులకొఱకై ప్రపంచంలోని పలుదేశాల్లో పర్యటన, వీని మూలంగా రెండు సంవత్సరాల క్రిందటివఱకు మళ్లీ సాహిత్యం వైపు చూచే అవకాశం నాకు లేకపోయింది. రెండు సంవత్సరాల క్రితం నేను ఖగోళశాస్త్రంనుండి గణనశాస్త్రంలోనికి (Computer Scince) మారి, కెనడాదేశంలోని అణ్వింధనశాస్త్రపరిశోధనావిభాగంలో (Atomic Energy of Canada), ఉద్యోగస్థుడనైనాను. ఈ మార్పువల్ల నాకు కొంత మేలు జరిగింది. జీవితంలో నిలుకడ యేర్పడి, మళ్లీ సాహిత్యవ్యవసాయ మారంభించడానికి వీలేర్ప డింది. ఐతే నేను 13 సంవత్సరాల క్రిందట పూర్తి చేసిన హనుమప్పనాయకకావ్యభాగం నా లోకాటనంలో ఎక్కడో పడిపోయింది. అందుచేత ఆదినుండి కావ్యం మళ్లీ వ్రాయవలసిన పరిస్థితి యేర్పడింది. మొత్తానికి కడచిన రెండు సంవత్సరాల్లో తీరికవేళల్లో కూర్చొని ఆఱాశ్వాసాల కావ్యం పూర్తిచేసి పాఠకుల కందిస్తున్నాను. దీని బాగోగుల నిర్ణయానికి పాఠకులే ప్రాడ్వివాకులు.
నేను వనపర్తి హైస్కూల్లో (మహబూబునగరం జిల్లా) విద్యార్థిగా నున్నప్పుడు కీ||శే|| సురవరం ప్రతాప రెడ్డిగారు రచించిన హనుమప్పనాయకవృత్తాంతం నాకు పాఠ్యంగా ఉండింది. ఆ కథ చదివినప్పుడు నేనెంతో ఉత్తేజితుడనైనాను. ఇన్నినాళ్ల కా కథను కావ్యరూపంలో మలచగల్గినందులకు కృతార్థుడనైనట్లుగా తలంచు చున్నాను. కావ్యసౌందర్యం, ఔచిత్యాల దృష్ట్యా నేను కథలో కొన్ని చిన్న మార్పులు చేసినాను. ప్రథమ,ద్వితీ యాశ్వాసాలలో హనుమప్ప జననోదంతమును వివరించి నాను. హనుమప్పను హనుమత్ప్రసాదజనితుడుగా చిత్రించినాను. ఈ రెండాశ్వాసములలో హనుమప్ప మాతాపితరులకు సముచితమైన స్థానం కల్పించడంతోబాటు, హనుమప్ప తల్లికి అన్నమ అనే నామకరణం కూడ చేసినాను. హనుమప్ప కావ్యనాయకుడగుటచే అతని జన్మ వృత్తాంతం వివరించడం కథకు బలం చేకూర్చగలదని ఈ మార్పులు నేను చేసినాను. అట్లే హనుమప్ప మాఘ మాసంలో సోమనాద్రి సమక్షంలో జరిగే వీరవిద్యాప్రదర్శనలో పాల్గొని, అతని కొల్వులో ప్రవేశించినట్లుగా వ్రాసి నాను. ఇట్టి ప్రదర్శనలు మాఘమాసంలో జరిగేవి అనడానికి కొన్ని చారిత్రకాధారాలున్నాయి. గద్వాలసంస్థాన వైభవాన్నీ, కార్తీకమాఘమాసాలలో గద్వాలలో జరిగే గోష్ఠులను గుఱించి శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రులవారు "సంస్థాన ముల సాహిత్యసేవ" అనే లఘుగ్రంథంలో కొంతవఱకు విపులంగానే వ్రాసినారు. వారు తెల్పిన పండిత, నటక, గాయకగోష్ఠులతో బాటు వీర,మల్లవిద్యాప్రదర్శనలు కూడ ఉండేవి అనే నమ్మకంతో నేనిట్లా వ్రాసినాను. పంచమాశ్వాసంలో హనుమప్ప శత్రువుల స్కంధావారమునుండి హయమును తెచ్చే సందర్భంలోగూడ ఔచిత్య దృష్టితో చిన్న మార్పును చేసినాను. హనుమప్ప చొప్పమోపును అమ్మి, దాని మూల్యము తనకు ముట్టలేదనే సాకుతో చీకటిపడువఱకును హయశాలాంతికమున నున్నట్లు ప్రతాపరెడ్డిగారు వ్రాసినారు. కాని ఎవడోయొక డా మూల్యము నిచ్చివేసిన అతని కక్కడ ఉండుట కవకాశ ముండదు గదా! అందుచేత నేనాతడు లభించిన మూల్య మును హయశాలాంతికమందలి యిసుకలో పోగొట్టుకొన్నట్లు, దానికై అన్వేషిస్తున్నట్లు నటిస్తూ కాలయాపన చేసినాడని వ్రాసినాను. ఈ సాకు ప్రతాపరెడ్డిగారు వ్రాసినదానికంటె ఔచితీసమంచితంగా ఉంటుందనే నమ్మకంతో నేనీ చిన్నమార్పును చేసినాను. అట్లే ఔచితీదృష్ట్యా ఆఱవ ఆశ్వాసంలో లింగమరాణి భటులకు పంపిన పసుపు కుంకుమ వృత్తాంతాన్ని తొలగించి, దాని స్థానంలో హనుమప్పనాయకుడు యుక్తకార్యోద్యుక్తులగునట్లుగా తోడి భటులను ప్రేరేచినట్లు, వారుత్తేజితులై గజాఘాతములతో తలుపులు బ్రద్దలు గొట్టి, దుర్గాంతరమున ఆపన్నుడైన సోమనాద్రికి తోడైనట్లు వ్రాసినాను. చారిత్రకంగా లింగమరాణి వృత్తాంతం నాకంత విశ్వసనీయంగా తోచలేదు. అందుచేత ఈమార్పు చేసినాను.
ఈ కావ్యంలో నేనధికంగా మాత్రాచ్ఛందస్సును వాడినాను. ఈ ఛందోబీజములు నా తొలికావ్యమైన అశ్రు మాలలో పుష్కలంగా ఉన్నాయి. ఈ కావ్యంలో నవి ప్రరోహమానములైనవి. నవ్యుల కిందులోని కొన్ని ఛందో రీతులు వింతగా దోచవచ్చును. అందుచేత ఈ కావ్యంలోని ఛందస్సును గుఱించి నేను కొంత విపులంగా చర్చి స్తాను. ముఖ్యమైన త్ర్యస్ర, చతురస్ర, మిశ్ర, ఖండగతులనే నేనిందులో వాడినాను. ఒకే గతిలో కొన్నియెడల మాత్రలు తగ్గించి, హెచ్చించి వ్రాసినాను. ప్రతిచ్ఛందమందును యతినో, ప్రాసయతినో నియతంగా పాటించినాను. నేను వ్రాసిన మాత్రాఛందాలను బహుళంగా I. సీసతుల్య ములు, II. కందతుల్యములు, III. ద్విపదతుల్యములు, IV. ఇతరములు అను నాల్గు తరగతుల క్రింద విభజింపవచ్చును. వీనికి చెందిన కొన్ని ఉదాహరణముల నీక్రింద పేర్కొంటాను. యతిమైత్రిని అధోరేఖలతో సూచించినాను.
I. సీసతుల్యములు: సీసతుల్యములన్నీ ఖండగతికి చెందిన ఛందములు. వీనిలో నీక్రింది భేదము లున్నవి.
a) ప్రతిపాదపూర్వార్ధంలో 4 ఇంద్రగణాలు, ఉత్తరార్ధంలో 2 ఇంద్రగణాలపై రెండు సూర్యగణాలుండే ప్రాచీనసీస పద్యం. ఇట్టి వనేకము లున్నవి..
b) పై పద్యంలోని భ,నల గణాలను భల, నలల గణాలతో ప్రతిక్షేపిస్తే ఏర్పడే పద్యం. అంటే మొదటి ఆఱు గణాలు పరిపూర్ణంగా ఖండజాతికి చెందినవిగా ఉండేటట్లు వ్రాసిన పద్యం.
ఉదా: మీద గజవాజితతి మీద విస్ఫురితాస్త్ర పాణులై బహువీరవరులు వోవ
c) పాదపూర్వార్ధంలో 4 ఖండగతిగణాలు, ఉత్తరార్ధంలో 3 ఖండగతిగణాలపై ఒక సూర్యగణం చేరిస్తే ఏర్పడే పద్యం. అంటే పాదంలోని ఉత్తరార్ధం ద్విపదపాదంలాగా సాగుతుంది.
ఉదా: తుంగభద్రానదీ తోయవల్లికలట్టు లుల్లమున విజిగీష వెల్లువగు గాక!
d) పాదపూర్వార్ధంలో 4 ఖండగతిగణాలు, ఉత్తరార్ధంలో 3 ఖండగతిగణాలపై రెండు సూర్యగణాలు గల పద్యం.
ఉదా: పాటలీపురి నాంధ్రపాలనమ్మును నిల్పు శాతకర్ణుల నాటి సంగ్రామపాటవంబు
e) పాదపూర్వోత్తరార్ధాలలో నాల్గేసి ఖండగతిగణాలు గల పద్యం.
ఉదా: ఒక మహీధ్రము చుట్టు నూర్మికోపమమౌచు వలమానమగు చైత్రవల్లరీవిధమౌచు
f) పాదపూర్వార్ధంలో 4 ఖండగతిగణాలు, ఉత్తరార్ధంలో 4 ఖండగతిగణాలపై ఒక సూర్యగణం చేరిస్తే ఏర్పడే పద్యం.
ఉదా: అవనిలోపల బుణ్యమార్జించుకొన్నట్టి అనఘులెవ్వరొ కందురట్టి విభవంబు ద్రిదివాన
g) పై పద్యానికి విలోమంగా ఉండే పద్యం. అంటే పూర్వార్ధంలో 4 ఖండగతిగణాలపై ఒక సూర్యగణం, ఉత్తరార్ధంలో 4 ఖండజాతి గణాలుండే పద్యం.
ఉదా: చలదూర్మికాసంఘసంఘట్టనోదితమృదంగ లలితసంరావానులాస్యన్మయూరంబు
h) ప్రతిపాదంలోను 4 ఖండగతిగణాలపై ఒక సూర్యగణం ఉండే పద్యం.
ఉదా: దాంపత్యవల్లరిం దళుకొత్తు చిన్నారిపూవు పున్నామనరకంపు బులివాతి దప్పించు జోదు
i) పాదపూర్వార్ధంలో 4 ఖండగతిగణాలు, ఉత్తరార్ధంలో 5 ఖండగతి గణాలుండే పద్యం.
ఉదా: చివురుగొమ్మల డాగి, యెవరికిం గనరాక భువినెల్ల మృదుగానవివశత్వమున ముంచె బరభృతము
j) ప్రతిపాదంలోను ఐదేసి ఖండగతిగణాలుండే పద్యం.
ఉదా: తొల్లి శ్రీరామునకు దోడైన హనుమదాదుల బోలి అండయై పోరి రాంధ్రావనీపతి కాహవమునందు
పై ఉదాహరణాలలోని రెండు పంక్తులను ఏకపాదపూర్వోత్తరభాగములుగా గాక, రెండు ప్రత్యేకపాదములుగా గ్రహించి సామాన్యమైన చతుష్పాదిఛందాలను సృజింపవచ్చు. ఇట్టి వీ కావ్యంలో కొల్లలుగా నున్నవి. శాస్త్రరీత్యా వీనిని సీసతుల్యాల ప్రత్యేకోదహరణాలుగా (Special cases) గ్రహింపవచ్చును.
II. కందతుల్యములు: కందతుల్యములన్నీ చతురస్రగతికి జెందిన ఛందములు. వీనిలో నీక్రింది భేదము లున్నవి.a) ప్రాచీన కందపద్యం. ఇట్టి వీ కావ్యంలో కొల్లలుగా నున్నవి.
b) ప్రాచీనకందాన్ని కేవలం మాత్రావృత్తంగా పరిలక్షించి గణస్థాననిర్బంధాన్ని విస్మరించి వ్రాసినవి. ఇట్టివి క్వాచిత్కంగా ఉన్నాయి.
ఉదా: ఈ యేడొదవెడు సంతతి ఆ యేడొదవెడు నని వారాశాయతి దశ హాయనము ల్వేచిరి; కా నీ యది నీఱున నిడు పన్నీరే యయ్యెన్.
c) బేసి సంఖ్యగల పాదాల్లో 3, సరిసంఖ్య గల పాదాల్లో 4 చతుర్మాత్రాగణాలుండే పద్యం.
ఉదా: రథచక్రంబుల క్రమమున రాత్రులుపవళులు రయమున దిరిగెన్ పరిణయమాదిగ బది వ త్సరములు కాలోదధిలో గలసెన్.
ఇందులో ఐచ్ఛికంగా 1,3 పాదాల్లోను యతి పాటింపబడింది.
d) బేసిసంఖ్య గల పాదాల్లో 3, సరిసంఖ్య గల పాదాల్లో 5 చతుర్మాత్రాగణాలపై నొక గురువు గల పద్యం.
ఉదా: అరయన్వలె దత్కులహయ విరహితముగ బోరు గెల్చు వెరవొక్కటి గానీ సరియే మిము శిక్షింపగ జెరువుం ద్రెంపిన కితవుని చేలము గొన్నటులన్.
e) ప్రతిపాదంలోను 4 చతుర్మాత్రాగణాలుండే పద్యం.
ఉదా: ఖండితవృక్షకకాండాంచితమై, క్రందననినదంకరదిక్తటమై, శారదనీరద, చందనసుందర సితసింధురమై చెలువొందినదది.
f) బేసి పాదాలలో 4, సరిపాదాలలో 5 చతుర్మాత్రాగణాలుండే పద్యం.
ఉదా: కందుము కౌశలమందిరులన్, ము న్నెందఱినో యాశ్వికకులహిమమందిరులన్ కందుమె వారలయం దీ చంద మ మందాద్భుతమగు నైపుణి మందునకైనన్.
g) బేసి పాదాలలో 4, సరి పాదాలలో 6 చతుర్మాత్రాగణాల పై నొక గరువుండే పద్యం.
ఉదా: వంచనచే నొక వార్వము నపహా రించిన జిక్కుదు మనుకొనిరే యతులితహేమాహార్యా చంచలధీరులు శాత్రవవీరు ల వంచితధృతి నిక గూల్చుడు వారల యాశాహర్మ్యములన్.
ఇవే కాకుండా ప్రతిపాదానికి 5, 6, 7, 8 చతుర్మాత్రాగణాలుండే ఛందాలు కూడ ఉన్నాయి. వీనిలో కొన్నియెడల మాత్రలు లోపించడం, వృద్ధికావడంవల్ల కించిద్భిన్నమైన ఛందా లేర్పడుతాయి. ఇట్టివి కూడ తరచుగా కనిపిస్తాయి.
III. ద్విపదతుల్యములు: ద్విపదతుల్యములను ఖండగతికి చెందిన ఛందములుగనే ఎంచవచ్చును. వీనిలో నీక్రింది భేదము లున్నవి.
a) ప్రాచీన ద్విపదసమములు: అంటే పరిపూర్ణఖండగతి సిద్ధించడానికి భ,నల గణములకు మాఱుగా భల, నలల గణముల నుపయోగించి వ్రాసినవి. ఇట్టివనేకంగా ఉన్నాయి.
b) బేసి పాదాలలో 4 ఖండగతిగణాలు, సరి పాదాలలో 3 ఖండగతిగణాలపై నొక సూర్యగణం. వీని ప్రస్తావన సీసతుల్యాలలో ఇదివఱకే వచ్చింది.
c) బేసి పాదాలలో 3 ఖండగతి గణాలపై నొక సూర్యగణం, సరి పాదాల్లో 4 ఖండగతి గణాలుండే పద్యం.ఉదా: నూనూగుమీసాల నూత్నయౌవనము నాటికే వీరుల న్మేటియై యతడొప్పె
d) బేసి పాదాలలో 3 ఖండగతి గణాలు, సరి పాదాల్లో 4 ఖండగతి గణాలుండే పద్యం.
ఉదా: అని సోమభూపాలు డంతటన్ ఘనధరాఖండమున్ కాన్కగా నొసగుచున్
e) బేసి పాదాలలో 2 ఖండగతి గణాలు, సరి పాదాల్లో 3 ఖండగతి గణాలపై నొక సూర్యగణముండే ఛందం.
ఉదా: ముంగిట్ల రంగారు రంగవల్లుల దీర్చు నంగనల నీలి ముంగురులతో గూర్మి చెంగలింపగ గొంతసే పాడి యాడి.
f) బేసి పాదాలలో 2 ఖండగతిగణాలు, సరి పాదాల్లో 4 ఖండగతిగణాలుండే పద్యం.
ఉదా: రేయెండకుం గుమిలి మే యుంచి పాన్పునన్ మిక్కిలిం బొఱలు విర హాయతల నిట్టూర్పు వాయువులతో స్నేహభావంబు వహియించి.
పైని పేర్కొన్న ఛందాలలోని పాదాలలో మాత్రావృద్ధి, లోపాలవల్ల ఏర్పడిన కించిద్భిన్నమైన ఛందాలు గూడ ఇందులో పొడసూపవచ్చును.
III. ఇతరములు: పై మూడు తరగతులను చెందని మాత్రాఛందా లనేకంగా ఉన్నాయి. వీటన్నిటినీ ఇతరముల క్రింద చేర్చినాను. వీనిలో ముఖ్యమైన వీవిధంగా ఉన్నాయి. a) త్రిగణసంయుతములై, ఖండ,చతురస్రగతులకు చెందిన ఛందములుఉదా: ఏమో కావుగదా యివి యెల్లయు నలలన్ వ్రాసిన వ్రాలే? మృగతృష్ణం బరి భాసించెడు నీరములే? (చతురస్రగతి) నాయకున కీవార్త సుమనోజ్ఞ గేయమునకన్న బ్రియమయ్యెను; నాయకుని డెందమం దొకటియా వేయి హరిచాపములు పూచెను. (ఖండగతి)
పై ఛందాలలో మాత్రావృద్ధి,లోపాలవల్ల కించిద్భిన్నమైన చాందాలేర్పడుతాయి. ఇట్టివి కూడ కావ్యంలో నుండ వచ్చును.
ఉదా: విజయేందిరతో విచ్చేసెడు విభుమార్గములో వెలయించిన శుభహారతులన బ్రభసూపెన్ కెందమ్ముల బహుబృందమ్ములు. (చతురస్రగతి)
b) ఏవో కొన్ని నిర్ణీతసంఖ్య గల త్ర్యస్ర,మిశ్రగతి గణాలు గల ఛందాలు. వీనిలో కూడ మాత్రావృద్ధి, లోపము లుండవచ్చును.
ఉదా: కాంచి నాయం డంచితప్రమ దార్ణవప్లవనాప్తి మించున్, కాంచి నాయడు మంచుగుబ్బలి మించు ముదమెద నించి మించున్. (మిశ్రగతి) సాగి, సాగి ఇటుల కడకు నాగిపోయె జనగణమ్ము; సాగి,సాగి తటము నొరసి ఆగిపోవు నల విధమ్ము. (త్ర్యస్రగతి) అచట బొల్చె గేశవాలయమ్ము, అచలయందు స్వర్గమదియె సుమ్ము; హస్తి డిగ్గి సోము డచట నిల్చె, పరిజనమ్ము లతని పిరుద బొల్చె. (త్ర్యస్రగతి)
c) గీతపద్యాలు. ఇట్టివనేకంగా ఉన్నాయి.
ఇవి నేనీ కావ్యంలో ననుసరించిన ముఖ్యమైన మాత్రాచ్ఛందోరీతులు. పై ఉదాహరణాలలో నేను వీటిని సమగ్రంగా కాకపోయినా, స్థూలంగా స్పర్శించినాను. మాత్రాఛందస్సులే కాక, రసభావానుకూలంగా నేనక్షర ఛందస్సులను కూడ ఇందులో వాడియున్నాను. మన కనూచానంగా వస్తూవున్న చంపకోత్పలమత్తేభవృత్తాలనే కాక, స్వకల్పితనూత్నవృత్తాలను కూడ వ్రాసినాను. ఈ నూత్నవృత్తాల లక్షణా లీక్రిందివిధంగా ఉన్నవి.1. మసజతతగ గణాలు గల్గి, 10వ అక్షరం యతిగా గల్గి, 16వ అష్టిచ్ఛందస్సులో పుట్టిన 18776వ వృత్తం. నడకలో నిది ఒక సగణం లోపించిన శార్దూలంవలె ఉంటుంది. దీనికి 'డయానా'వృత్తమని పేరిడినాను. ఉదా: వాచాతీతము నీ మనీష, వంద్యంబు నీ జ్ఞానమున్
2. మసజసరర గణాలు గల్గి, 12వ అక్షరం యతిగా గలట్టి ఒక అక్షరం తక్కువైన శార్దూలం . ఇది 18వ ధృతి చ్ఛందస్సులో పుట్టిన 75608వ వృత్తం. దీనికి 'నయాగరా'వృత్తమని పేరిడినాను. ఉదా: కోశాగారము గుల్ల వాఱినను, ఘోరాపదల్ గూడినన్.
3. భరనమగగ గణాలు గల్గి, 8వ అక్షరం యతిగా గల్గి, 14వ శక్వరీఛందస్సులో పుట్టిన 470వృత్తం. దీనికి 'మార్గరీటా' వృత్తమని పేరిడినాను. ఉదా: ప్రత్యయమున్ ఘటించి పరిపూతుం డల్లాపై
4. తరరరర గణాలు గల్గి, 9వ అక్షరం యతిగా గల్గి, 15వ అతిశక్వరీఛందస్సులో పుట్టిన 9394వ వృత్తం. దీనికి 'ఓల్గా' వృత్తమని పేరిడినాను. ఉదా: దుర్దాంత వైరిశుద్ధాంత దోషాకరాస్యప్రభన్
ఇవి నేను కల్పించిన నూత్నాక్షరవృత్తములు. భావం ఛందస్సులో నిముడాలనే బదులు ఛందస్సు భావంలో నిముడాలనే అభిప్రాయం గల వాణ్ణి నేను. అట్లని ఛందాలలో వ్యర్థపదాలు చోటు చేసికొనరాదు. అందు చేత నొక అపూర్వమైన ఛందస్సు భావంలో స్ఫురించినప్పుడు కాదనక దానినట్లే స్వీకరించినాను. అందుచేత నీ కావ్యంలో బహుళమైన ఛందోవైవిధ్యం చోటుచేసికొన్నది.
యతులు: యతి విషయంలో కొన్నియెడల నేను కొంత స్వేచ్ఛను పాటించినాను. సాధారణంగా నేను పెట్టు కొన్న నియమాలివి: 1. పాదమునకు మూడేసి గణాలున్న ఛందములలో యతిని తృతీయగణారంభంలో గాని, ఉత్తరపాదప్రథమాక్షరంలో గాని నిల్పినాను. 2. పాదమునకు నాల్గేసి గణాలున్న ఛందములలో యతిని తృతీయ గణప్రథమాక్షరంలో నిల్పినాను. ఒకటి రెండు చోట్ల మాత్రమిందుకు భిన్నంగా ఉత్తరపాదప్రథమాక్షరంలో నిల్పి నాను. 3. పాదమునకు రెండేసి మిశ్రగతిగణాలున్న ఛందాలలో యతిని ద్వితీయగణారంభంలో నిల్పినాను. కాని ఒకటి రెండు చోట్ల మాత్రమిందుకు భిన్నంగా ఉత్తరపాదప్రథమాక్షరంలో యతిని నిల్పినాను. 4. పాదమున కైదేసి గణాలున్న ఛందాలలో కొన్నియెడల తృతీయగణారంభంలోను, కొన్నియెడల చతుర్థగణారంభంలోను యతిని నిల్పినాను. 5. ఐదింటికంటె ఎక్కువ గణాలున్న ఛందాలలో సౌష్ఠవము (Symmetry) చెడని రీతిగా , తగుచోట యతిని నిల్పినాను. నూటికి 90 పాళ్లు నేను ప్రసిద్ధమైన యతిమైత్రులనే పాటించినాను. కాని కొన్నియెడల (ఇది అతి విరళంగానే జరిగింది) నాతి ప్రసిద్ధములైన ర-ల, ట-ద, ఉ-ఋ, ఉ-వు యతులనూ, అఖండయతులనూ వాడి నాను. ఈ అప్రసిద్ధయతుల విషయంలో నేను మహాకవి పోతనామాత్యుని ఒరవడిగా పెట్టుకొన్నాను. అన్వయో చ్చారణసౌలభ్యమునకై కొన్నిచోట్ల విసంధి చేసినాను. బహుళజనప్రచారంలో నున్న 'సంధిషరతుల' వంటి పదాలను వాడినాను. పంచమాశ్వాసంలోని సంభాషణలలో పాత్రౌచిత్యానికై అటనట వ్యావహారికభాషాపదాలను వాడినాను.
ఇక నీ కావ్యప్రకాశనమునకు సహాయభూతులైన వారికి కృతజ్ఞతలు తెల్పుకుంటాను. అసమగ్రమైన వ్రాత ప్రతిని చదివి నన్ను ప్రోత్సహించినవారు డా. ముదిగొండ శివప్రసాదుగారు మఱియు శ్రీరంగాచార్యులుగారు (పాలెం). తమకు తలమునకలుగా పనులున్నా తీరించుకొని ఈ కావ్యము నామూలాగ్రంగా చదివి తమ అమూ ల్యాభిప్రాయాన్ని వ్రాసియిచ్చినవారు వాక్ప్రపంచదివాకరులైన డాక్టరు దివాకర్ల వేంకటావధానిగారు. వారింత శ్రమకోర్చి నా కావ్యపఠనం చేయడం వారికి నాయందు గల వాత్సల్యానికి దార్కాణం. అట్లే డాక్టరు జి.వి. సుబ్రహ్మణ్యంగారు నాపై ఆదరంతో ఈ కావ్యంపై విమర్శనాత్మకమైన పీఠికను వెలయించినారు. మిత్రులు షణ్ముఖాచారిగారు ముఖచిత్రమును తీర్చిదిద్దినారు. ఔదార్యంతో డా|| ఇరివెంటి కృష్ణమూర్తిగారు యువభారతి ద్వారా దీనిని ప్రచురించడానికి అవకాశం కల్పించినారు. వీరందఱికీ నా హృదయపూర్వకకృతజ్ఞతలు తెల్పుకొంటున్నాను.
ఇట్లు బుధజనవిధేయుడు తిరుమల కృష్ణదేశికాచార్యుడు