మామాట - హనుమప్పనాయకుడు

ఉత్తమలక్ష్యాన్ని సాధించడానికి, ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఉత్కటమైన ఉత్సాహంతో ఉద్యమించడం ఇతివృత్తంగా ఉన్న కావ్యమే నాటికి నేటికి ఆదర్శప్రాయంగా ఉంటున్నది. పురాణగాథలు, రామాయణభారతేతిహాసాలు ధర్మరక్షణకోసం, దేశరక్షణకోసం, మాతృదేశదాస్యవిముక్తికోసం, తమ జీవితసర్వస్వాన్ని ధారవోసిన మహితాత్ముల వీరరసాత్మకములే. ధర్మవీరరససంభరితములే. ఈ ధర్మవీరుల భవ్యచరిత్రలు రచయితలకు ఉపాదేయాలైనప్పుడే రచనలకు సార్థకత చేకూరుతుంది. పఠితల హృదయాల్లో ధర్మాభిరతి అంకురిస్తుంది. పురాభారతీయుల్లో దైవత్వమర్యాదల నందుకున్న మహనీయుల పవిత్రజీవితాలు అజరామరకావ్యాలుగా అవతరించి, సర్వభారతీయుల రసనాగ్రాలపై లాస్యం చేస్తున్నవి. సర్వభారతీయ హృదంతరాళాలలో వాసనారూపంలో పదిలంగా ఉంటూనే ఉన్నవి. నిన్నమొన్నటి భారతేతిహాసంలో అధర్మప్రభంజనాన్ని అడ్డుకున్న మేరునగధీరులు రాణాప్రతాప్, శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ చెన్నమ్మ, వీరపాండ్య కట్టబొమ్మన్, భగత్‌సింగ్, వీరసావర్కార్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి ప్రకాశంవంటి వారెందరో! చరిత్రకెక్కని చరితార్థు లెందరో! మనకింకా తెలియని అజ్ఞాతవీరు లెందరో!

చిలకమర్తి లక్ష్మీనరసింహం, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మవంటి సాహిత్యవేత్తలు, పరిశోధకులు దేశచరిత్రను తమ వీరగంధంతో సురభిళం చేసిన ధీరుల గాథలను రాతిపలకలనుంచి, రాగిరేకులనుంచి వెలికితీసి మనకందించిన మనీషులు. శ్రీసురవరం ప్రతాపరెడ్డిగారి "హైందవధర్మవీరులు" అనే గ్రంథంలో ఒక పతిహిత ఆంజనేయుడైన వీరుడు హనుమప్పనాయకుని సాహసగాథ ఉన్నది. ఈ "హనుమప్పనాయకుడు" కావ్యానికి అది మూలమైంది.

ఇప్పుడు పాలమూరు (మహబూబ్‌నగరం) జిల్లాలో ఒక తాలూకాగా ఉన్న గద్వాల స్వాతంత్ర్యానికి పూర్వం హైద్రాబాదు సంస్థానాధీశుడైన నిజాంకు లోబడిఉన్న తెలుగు సంస్థానంగా ఉండేది. విజయనగరసామ్రాజ్యకాలంనుంచి గద్వాలసంస్థానానికి చరిత్ర వుంది. హైందవసంస్కృతి పరిరక్షణలో గద్వాలప్రభువులుకూడా శక్తివంచనలేకుండా పాటుపడినవారే. హైద్రాబాదు నిజాం ఆంధ్రదేశంలో నిలద్రొక్కుకుంటున్న కాలంలో గద్వాలప్రభువులు స్వతంత్రప్రతిపత్తికోసం, ధర్మరక్షణకోసం, తెలుగు సాహిత్యంకోసం ఆదరాభిమానాలతో కృషిచేసిన చరితార్థులు. ఆ గద్వాలరాజుల్లో పెదసోమభూపాలుని కాలంలో జరిగిన గాథ ఈ "హనుమప్పనాయకుడు" ఇతివృత్తం.

ఈ కావ్యాన్ని అందమైన ఛందస్సుల్లో పొదిగి, చక్కని తెనుగు నుడికారంతో కైసేసి, ప్రబంధకవితాపథంలో నడిపించి తమ కావ్యరచనానైపుణ్యాన్ని ప్రదర్శించినారు మిత్రులు శ్రీతిరుమల కృష్ణదేశికాచార్యులుగారు. ఆయన చదివింది సాంకేతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్. కాని సాహిత్యంపట్ల అభిరుచినే గుండెల్లో పదిలపరచుకోగలిగిన ధన్యులు. సుదూరదేశం కెనడాలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. కంప్యూటర్ ద్వారా తెలుగులిపి సంస్కరించి తెలుగుముద్రణను నిర్దుష్టంగా, సుందరంగా తీర్చిదిద్దడానికి పరిశోధనలూ, ప్రయోగాలూ చేస్తున్నారు తీరికవేళల్లో.

పాలమూరు జిల్లాలో అచ్చంపేట తాలూకాలో బల్మూరు గ్రామానికి చెందినవారు శ్రీ దేశికాచార్యులు. సత్సంప్రదాయాలకూ, వైదుష్యానికీ అంకితమైన పండితవంశం ఆయనది. శ్రీ దేశికాచార్యుల సౌమనస్యం, పాండిత్యం, భారతీయసంస్కృతిపట్ల ఆయన అలవరచుకున్న శ్రద్ధాసక్తులు మా "యువభారతీయుల" నెంతో ముగ్ధుల్ని చేసినవి. ఆయన వ్రాసిన ఈ కావ్యాన్ని మా ప్రచురణగా వెలయించాలనుకున్నాము. ఈ పట్టున మాతో హార్దికంగా, ఆర్థికంగా పరిపూర్ణసహకారం అందించిన శ్రీ దేశికాచార్యులుగారికి, ఆయన బంధుబృందానికి మా ధన్యవాదపరంపరలు.

శ్రీ దేశికాచార్యులకు ఆశీస్సులందించిన ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారికి మా అభివందనములు. కావ్యాన్ని పరిచయం చేసిన మా ప్రధానసంపాదకులు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారికి వందనములు. కావ్యకర్తను అభినందించిన శ్రీ శ్రీరంగాచార్యులుగారికి మా కృతజ్ఞతలు.

	
ఇరివెంటి కృష్ణమూర్తి
అధ్యక్షులు - యువభారతి
హైదరాబాదు:  18-1-1986