మిత్రులు శ్రీ తిరుమల కృష్ణదేశికాచార్యులు రచించిన 'హనుమప్పనాయకుడు'కావ్యాన్ని వారు చదువుతుంటూనే మొదట విన్నాను. ఎంతో ఆసక్తిని పొందాను. ఆ తరువాత స్వయంగా చదివాను. ఆశ్చర్యాన్ని పొందాను. అలనాటి ప్రబంధకవి ఆధునికయుగంలో ప్రయోగశక్తితో ప్రభవించినట్లు తోచింది. ఆచార్యులవారు వృత్తిరీత్యా ఖగోళశాస్త్రసంబంధియైన ఉద్యోగాన్ని చేపట్టారు కొంతకాలం. ఆ తరువాత గణనశాస్త్రంలోకి మారారు. ఖగోళంవైపు చూచే శాస్త్రజ్ఞుడు భూగోళంతో పాటు బహుగోళాల ప్రవృత్తులను పరిశీలించి, వివేచించి, చెప్పవచ్చు. మరి ఖగోళశాస్త్రజ్ఞుడైన కవి ఖగోళంవైపు చూస్తే భావుకుడు, శాస్త్రకవి కాకతప్పదు. శ్రీ కృష్ణదేశికాచార్యులు ఖగోళాన్ని చూచినట్లే శబ్దగోళాన్నికూడ వ్యుత్పత్తితో , శాస్త్రదృష్టితో, అలంకృతమైన వాగ్వృత్తితో పరిశీలించారు. శబ్దార్థపుష్టిగల ప్రజాకవి వారిలో ప్రవృద్ధి చెందాడు; పండితకవిగా పరిపక్వతను సాధించాడు. గణనశాస్త్రం వారిలో అక్షరమాత్రాగణనంలో ఎన్నో వినూత్నధోరణులను మేల్కొల్పింది. గణనంలో మాత్రమే గురుతులుగా నిలిచి గణనలోనికి రాని ఎన్నోరకాలైన ఛందాలను దేశికాచారిగారి మనోనేత్రం దర్శింపగలిగింది. సందర్బోచితంగా వాటిని ప్రయోగించే ప్రజ్ఞ వారిలో పరిణతి చెందింది. కోకొల్లలుగా క్రొత్త ఛందస్సులు ఈకృతిలో లాస్యంచేస్తూ రంగప్రవేశం చేశాయి. తెలుగు పద్యరంగంలో 'డయానా'వృత్తం ఈకృతిలోనే మొదట డాబుగా నడుస్తున్నది; 'నయాగరా'వృత్తం జలపాతంలా జాలువారుతున్నది; 'ఓల్గా'వృత్తం వల్గనం చేస్తున్నది. ఇక ఖండ,చతురస్ర, మిశ్ర, త్ర్యస్రగతుల్లో వివిధమాత్రా ఛందాలు మనోవిలాసాలను వెలారుస్తున్నవి. సీసతుల్యాలు, కందతుల్యాలు, ద్విపదతుల్యాలు అయిన పద్యాలు క్రొత్తవేషాలతో, నూత్నగతులతో సహృదయులను సమ్మోహపరుస్తున్నవి. ఆచార్యులవారిని ఖగోళశాస్త్రం భావుకుడైన శాస్త్రకవిగా తీర్చింది; గణనశాస్త్రం ప్రయోగవాదియైన ఛందోమర్మజ్ఞునిగా దిద్దింది. ఈ ఉభయవ్యక్తిత్వాల సంగమతీర్థం 'హనుమప్పనాయక'కావ్యం.
"సంచలత్ఖురచతుష్కసముత్థితోత్కట క్షోదంబు సూర్యునకు గూడు గట్ట" (చూ. పుట 98)వంటి సీసపద్యాలను చదివితే కృష్ణదేశికాచార్యు లేప్రబంధకవికీ తీసిపోరనిపిస్తుంది. అశ్వవర్ణనం ఇంత నిపుణంగా చేసి పింగళి సూరనను మరపింపజేశారు. ఆచార్యులవారిలో మరొక విశేషం వుంది. ఆయనకు శబ్దం వశవర్తి. ఆయన పాండిత్యం అటువంటిది. అమరంనుండి ఆంధ్రనామసంగ్రహంవఱకు పద్యనిఘంటువులు ఆయన జిహ్వాగ్రం మీద నేటికీ జీవిస్తున్నాయి. అంతేకాదు, ఆయనకు ప్రతిశబ్దానికీ వ్యుత్పత్తి తెలుసు. అందుచే ఆయన కవితలోని శబ్దం అర్థశక్తి తెలిసి ప్రయోగించింది; పఠితకూడ అటువంటి వ్యుత్పత్తితోనే చదువుకొని ఆనందింపదగింది. ఈ కావ్యంలో గద్వాలసోమనాద్రి యెక్కే గుఱ్ఱానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గుఱ్ఱాన్ని సూచించే శబ్దాలెన్నో ఉన్నాయి.
"ఘోటకే వీతి తురగ తురంగాశ్వతురంగమాః వాజి వాహార్వ గన్ధర్వ హయ సైన్ధవ సప్తయః"అని అమరం. ఈకవి దాదాపు ఈ శబ్దాలన్నీ ఆయాసందర్భాల్లో వాడారు. ఊరక వాడటం కాదు. సార్థకంగా, సప్రయోజనంగా, సరసంగా వాడారు.
"ఆయుత్తమాశ్వంబు నధిరోహ మొనరించి ఉచ్చైశ్రవంబును వియచ్చరుల పతియట్లు"ఇందులో సోమనాద్రిభూపాలుణ్ణి ఆకాశయానం చేయగలిగిన దేవతలకు పతియైన ఇంద్రునితో పోల్చడం జరిగింది. ఈ ఉపమానానికి తగినట్లు ఉపమేయాన్ని సముచితంగా చెప్పాలి. అందుకే అశ్వశబ్దాన్ని వాడుతారు ఆచార్యులవారు. 'అశ్నుతే గమనేనేత్యశ్వః, అశూ వ్యాప్తౌ- గమనముచేత వ్యాపించునది' - అని అశ్వమునకు వ్యుత్పత్తిని చెపుతున్నది గురుబాలప్రబోధిక. వియచ్చరులపతివంటి రాజెక్కే గుఱ్ఱం గమనంచేత వ్యాపించేదిగానే ఉండాలి- ఆగుఱ్ఱం నేలమీద నడుస్తూ గాలిలో ప్రాకుతున్నట్లుంటుంది. ఇక్కడ ఉన్నట్లే ఉండి అన్నిచోట్ల చకచ్చకితంగా వెలుగొందుతున్నట్లు వ్యాపిస్తుంది- అనే భావన ఆ శబ్దశక్తివలన పఠితహృదయంలో స్ఫురింపజేయడం కవి ధ్యేయం. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ కావ్యంలో చాల పద్యాలకు విపులమైన వ్యాఖ్య వ్రాయవలసివస్తుంది. వీరి పద్యవిద్య 'విద్వానేవ విజానాతి విద్వజ్జనపరిశ్రమమ్' అన్న సూక్తికి విలువైన ఉదాహరణం.
శ్రీదేశికాచార్యులు కథకు కల్పనలను ఆమ్రేడితాలుగా చేయగలరు; సందర్భానికి చక్కని వర్ణనలను సార్థకంగా సంవదింపగలరు. హనుమప్పనాయకు డీకావ్యంలో ప్రధానపాత్ర. ఆయన కాపేరు ఎందుకు వచ్చిందో చరిత్ర చెప్పదు. సురవరం ప్రతాపరెడ్డిగారు తమకథలో చెప్పలేదు. దేశికాచార్యులు వ్రాస్తున్నది కావ్యం. కార్యకారణసంబంధమైన కల్పన కవి కార్యం. అందువలన హనుమత్ప్రసాదసంజనితునిగా నాయకుణ్ణి చెప్పారు. అలాగే ఎన్నో కల్పన లీకథలో ఉన్నాయి. మూలకథ 'ఖాళీలు పూరించండి' అని ఇచ్చిన ప్రశ్నలాగా ఉంది. కావ్యకథేమో ఖాళీలు పూరించి కమనీయంగా కూర్చిన వాక్యంలా ఉంది. అంతేకాదు 'వాక్యం రసాత్మకం కావ్యం' కూడా.
శ్రీదేశికాచార్యులు పిల్లగాలిని సైతం అల్లరిగా వీవనీయరు. కావ్యార్థనందనంలో సాభిప్రాయంగా సాగవలసిందే -
"తుంగభద్రానదీతోయమ్ములన్ మంగ ళాభ్యంగనస్నాన మాచరించి, వలమానసంపతితపత్త్రసంవ్రాతమున్ మేల్పట్టుపుట్టముగ మేన గట్టి, నవజాతకంజాతనివహమ్ము నందముగ నవరత్నమాలగా సవదరించి, పరిఫుల్లసురభిళప్రసవపాంసూత్కరము భద్రాతపత్రముగ బాదుకొల్పి, కల్యకల్యాణసుముహూర్తకాలమందు సర్వసర్వంసహారాజ్యసార్వభౌమ పదవి నభిషిక్తుడౌ రాచపట్టి మాడ్కి గర్వయుతుడౌచు గమియించె గంధవహుడు." (పు. 151)మలయానిలుడు అభిషిక్తుడైన యువరాజులాగా రాణిస్తూ గంధవహు డయ్యాడు. అభిషేకోత్సావానికి వచ్చే రాచపట్టి అభ్యంగనస్నానంనుండి ఆచరించే మంగళకార్యాలను ఇందులో పొందుపరచడమే కాకుండా, భావికథార్థవ్యంజకంగా వర్ణనను నిబంధించడం విశేషం. శిల్పం తెలిసిన కవి చేసే జిలుగుపని యిది. ఆచార్యులవారికి ఈవిద్య కరతలామలకం.
'హనుమప్పనాయకుడు'కావ్యంలోని శైలినిగుఱించి ఒకమాట చెప్పాలి. మొదట్లో కృష్ణదేశికాచార్యుల కలం సంస్కృతశబ్దాలను, సమాసాలను ఎక్కువగా వరించింది. కావ్యం చివరిభాగానికి వచ్చేసరికి క్రమంగా ఆచ్ఛికపదాలను ఎక్కువగా వాడటం అలవాటు చేసికొన్నది. మార్పు సహజం.
"మాటలు పెక్కులేటికి? అమానుషవీరుడు సోమనాద్రి, మో మోటలు మాని యావిభుని మ్రోలకు నిప్పుడె పంపగాదగున్ మాటలపొంకముం గలుగు మానిసి నొక్కని సంధిసేయ, సం స్ఫోటము మాన్పి యస్మదసువుల్ పరిరక్షణ సేయగా నొగిన్"తత్సమబహుళంగా వ్రాసినా, ఆచ్ఛికపదబహుళంగా వ్రాసినా దేశికాచార్యులు 'మాటలపొంకముం గలుగు మానసి!' మాటలపొంకమే ఈకవి కైతకు జీవం.
పాశ్చాత్యదేశంలో నివసిస్తున్నా మాతృభారతిమాధుర్యాన్ని మరచిపోని మనస్వి శ్రీమాన్ తిరుమల కృష్ణదేశికాచార్యులు. తాను విన్న భాషలు, నేర్చిన భాషలు, వారికి తెలుగుమీద గౌరవాన్ని మరీ మరీ పెంచాయి. తెలుగుకు ప్రపంచభాషలలోనే గణనీయమైన ఒక ప్రత్యేకత ఉన్నదని చాటుతున్నారు ఆచార్యులవారు.
"అత్యమోఘమౌ విశ్వసాహిత్యవనము లోన దెల్గుపూలకు సరిలేని వింత సౌరభంబుల, రంగుల నేరి కూర్చి తమ్మ! నీకెంత ప్రియమమ్మయాంధ్రులన్న!"అని భారతిని ప్రశంసించారు. దేశదేశాలూ తిరిగిన దేశికాచార్యులు చెప్పింది అనుభవసత్యం. విశ్వసాహిత్యవనంలో తెలుగుపూల రంగు లొకవింత, వాసనలు మఱొక వింత. విశ్వభాషలందు వెలుగు తెలుగు.
విద్యార్థిదశలో చదువుకొన్న ఒక వీరగాథ విద్వత్కవిహృదయంలో బీజం మహావృక్షమైనట్లు ఒక ప్రౌఢకావ్యంగా రూపుదాల్చింది. సురవరంవారి కథలోని శక్తి తిరుమలవారి ఉక్తిలో కావ్యకల్పకంగా మారింది. ప్రతాపరెడ్డిగారి హనుమప్పనాయుడు వీరుడైన యోధుడు; కృష్ణదేశికాచార్యులవారి నాయకుడు వీరరసమూర్తియైన కావ్యనాయకుడు. వస్తువునుబట్టి ఈకృతి చారిత్రకకావ్యం. కవితనుబట్టి ఈకృతి ప్రబంధం. ఛందఃప్రయోగాలనుబట్టి ఈకృతి విలక్షణప్రయోగకావ్యం. ప్రబోధకవితాచ్ఛాయ లిందులో ఉండటంచేత కొంత నవీనకావ్యం. కాలానికి సంబంధించి ఇది ఆధునికకావ్యం.
కావ్యంలోని వస్తువు ఎంత ప్రాతదైనా అందులో కవియొక్క ఆత్మీయత కొంత ప్రతిబింబింపకపోదు. గద్వాల ఆస్థానంలో ప్రతిమాఘమాసం లోను విద్వద్గోష్ఠులు జరుగుతుండేవట. వాటిని కథలో కల్పన కనుగుణంగా దేశికాచార్యులవారు చేర్చి వర్ణించారు. మూలంలో ఈ వివరాలు లేవు. కవి వాటిని కల్పించి కథలో చొప్పించారు. ఆకవులలో ఆచార్యులవారి ఆత్మీయతకూడా ప్రతిఫలించింది.
"విరులతో మాలకరి వివిధమౌ హారముల విరచించుగతి సుధావిమలమధురోక్తులను విరచింతు రాశువుగ వరకావ్యముల వారు; కురిపింత్రు నవపద్యకుసుమమ్ములను వారు."వారి సంగతి తెలియదు కాని, వారి గుణములన్నీ తిరుమల దేశికాచార్యుల కున్నాయని మాత్రం మనకు తెలుస్తుందీ కావ్యం చదివితే. పదముల కూర్పు ఆచార్యులవారి నేర్పు; మాధుర్యగుణం వీరి కవితాసౌందర్యం.; కొన్ని కవితలు ఆశులక్షణాలను, కావ్యకవితాలక్షణాలనూ సంతరించుకొని ఉండటం ఈకవి ఉభయకావ్యకళాకౌశల్యం. నవపద్యాలనే కాక నవపద్యప్రయోగాలనుకూడా అందించడం ఆచార్యులవారి ప్రతిభాపాటవం.
ఈకావ్యం చదువుతూ ఉంటే మెదడుకూ, మనసుకూ ఏతాం వేసినట్లుంటుంది. పాండిత్యస్ఫూర్తితో పదాలు రాజసంగా నడుస్తూ రాణిస్తాయి. సౌజన్యస్ఫూర్తితో అర్థాలు సరళంగా స్రవిస్తూ సమ్మోదాన్ని కలిగిస్తాయి. ఈకావ్యం ఒక చిత్రమైన సృష్టి. ప్రబంధంలాగా ఉండే పసందైన కావ్యం. గేయకావ్యస్వభావాన్ని సంవదించుకొన్న పద్యకావ్యం. చారిత్రకసత్యాన్ని ఆధారంగా చేసికొని వెలసిన మిశ్రకావ్యం. ఛందఃప్రయోగప్రదర్శనకు ప్రాముఖ్యమున్నా భావస్పందనకు ఛందాన్ని ప్రయోగాత్మకంగా వాడుకున్న హృద్యమైన పద్యకావ్యం. దీనిని రచించిన కవి "భారతీకృపా వరవిదితాంధ్రవాక్సరణి వైభవుడు". ఆయనకు ఆంధ్రావళి పక్షాన అభినందనలు!
-- జి.వి. సుబ్రహ్మణ్యం