ఆశీస్సులు

శ్రీమాన్ తిరుమల దేశికాచార్యులవారు రచించిన హనుమప్పనాయుడు కావ్యము నాద్యంతము నాదృతిమై పఠించి అమందానందభరితాంతఃకరణుడ నైతిని. వారు విదేశములలో నున్నప్పటికి మాతృభాషను విస్మరింపక పాండితీమండితము, వీరరసభరితము, సర్వాలంకారశోభితము, మహనీయవస్తుకము, షడాశ్వాససంపన్నమునైన మహాకావ్యమును రచించిరి. తురుష్కులు వంచనచే హరించిన గద్వాల సోమనాద్రిభూపాలుని విజయకారణమైన వాజిరాజమును చొప్ప అమ్మువాని వేషమున తురుష్కస్కంధావారమునకేగి తెచ్చి ప్రభుభక్తిపరాయణుడైన హనుమప్పనాయకుని సాహససంపన్నమైన యుదంత మిందలి వస్తువు. కీ.శే. సురవరము ప్రతాపరెడ్డిగారు హైందవధర్మవీరులను గ్రంథమున నీకథను సంగ్రహముగానైనను సరసముగా తెల్పియుండిరి. శ్రీమాన్ ఆచార్యులవారందుండి కథను గ్రహించి సముచితవర్ణనాదులతో పెంచి యీ మధురకావ్యమును రూపొందించిరి.

హనుమప్ప హనుమత్ప్రసాదసంజనితుడు. సార్థకనామధేయుడు. తొల్లి సముద్రమును లంఘించి అశోకవనమందున్న సీతామహా సాధ్విని దర్శించి యామె క్షేమవార్తను తెచ్చి రామచంద్రుని కృతజ్ఞతకు పాత్రుడైన హనుమంతునివలెనే హనుమప్పయు తురుష్కాపహృతమైన సోమనాద్రి హయరాజమును తెచ్చి ఆమహారాజు కృతజ్ఞతకు పాత్రుడయ్యెను. ఈవిషయమును కవిగారు మూడునాల్గుచోట్ల స్ఫురింపజేసిరి. సోమనాద్రి గద్వాల రాజ్యమును ధర్మమార్గమున పాలించుచు గద్వాలను కళాకేంద్రముగ ఆంధ్రభూమి కలంకారమునైన నగరలలామముగ నొనరించెను. అది చూచి ఉప్పేడు సరదారుడు సయ్యదు ఈర్ష్యాళువై గద్వాలపై దండెత్తెను. ఉక్కుతునుకలవంటి ఆంధ్రవీరులా తురుష్కసైన్యముల నోడించిరి. సయ్యదు సాటి నవాబుల సాయమునేగాక నైజాముప్రభువు సాహాయ్యమునుకూడ నర్థించెను. వారందఱుకూడ సోమనాద్రి నోడింపలేకపోయిరి. అప్పుడాతని విజయమున కాతని అశ్వమే మూలమని తురుష్కులు దానిని హరించి గూఢముగా నశ్వశాలలో కట్టివైచిరి. సోమనాద్రి వంతకంతము లేకపోయెను. ఆతడు నిండుకొలువులో తన అశ్వమును తెచ్చిన వానికి ఆ అశ్వమతివేగముగ నొకదినములో తిరిగినంత భూభాగమును బహూకరింతునని ప్రకటించెను. యోధులొండొరుల మొగములు చూచుకొనుచుండ హనుమప్ప ఆ సాహసకార్యమున కొడిగట్టి ప్రాణములకుగూడ తెగించి ఆ ఆజానేయమును గొనితెచ్చెను. దానిని తెచ్చుటలో నతడు ప్రదర్శించిన కౌశలమును, ధైర్యమును, రాజభక్తియు నాన్యతోదర్శనీయములైనట్టివి.

కవిగారు స్వల్పపరిమాణము గల కథను రమ్యములైన అనేకవర్ణనలతో పెంచియుండిరి. హనుమప్ప నాయకుడగుటచే నతని తల్లిదండ్రుల నియమవ్రతాదులను చక్కగా వర్ణించియుండిరి. చివరికి హనుమంతు డనుగ్రహించెను. భద్రగజతేజము హనుమప్ప తల్లిగర్భమున ప్రవేశించిన వృత్తాంతము మహనీయుడైన గౌతమబుద్ధుని జననోదంతమును స్మృతికి దెచ్చుచున్నది.

ఇందలి బహువర్ణనములను వివరించుటలో కవిగారు ప్రదర్శించిన లోకపరిశీలనయు, కవిసమయపరిజ్ఞానమును, పూర్వకావ్యపరిచయమును విస్మయావహములుగా నున్నవి. వసంతహేమంతర్తువులు, హనుమంతుడు, కృష్ణాతుంగభద్రాతరంగిణులు, గద్వాలయందలి విద్వద్వతంసులు, సోమనాద్రి కళావైదుషీపోషణము, కేశవస్వామి ఆలయనిర్మాణము, తురుష్కయోధుల బీరములు, మద్యపానాసక్తి, వారితో హనుమప్ప చేసిన బేరము, హనుమప్పను గుర్తించిన పిమ్మట హయమొనరించిన ఉత్సాహపూరితమైన యలజడి, యుద్ధము - యిందలి వర్ణ్యవస్తువులలో ముఖ్యమైనవి. కవిగారు పైవానిని వర్ణించిన తెఱగు వానిని పఠితల కన్నులయెదుట సాక్షాత్కరింపజేయుచున్నది. వర్ణన లన్నియు సహజసుందరములై, ప్రౌఢములై, శబ్దార్థాలంకారశోభితములై కవిగారి పాండితీప్రతిభలను పట్టిచూపుచున్నవి. వారిందు భక్తిని, వీరరౌద్రములను, కరుణమును, ఆయాసందర్భములందు హృద్యముగా పోషించియుండిరి. రసపాత్రపోషణమునందు వారు చూపిన నేర్పు అప్రతిమానప్రతిభా పరిణతమైనట్టిది. వారుపమోత్ప్రేక్షారూపకాలంకారములను, అంత్యానుప్రాసలను వాడిన తీరు వారి అపారపాండిత్యప్రాభవమును చెప్పక చెప్పుచున్నది.

కవిగారిందు సీసములను, కందములను, గీతములను బోలిన మాత్రాచ్ఛందమును వాడియుండిరి. కొన్నియెడల స్వకల్పితనూత్నవృత్తములు, సుప్రసిద్ధమైన చంపకోత్పలమత్తేభాదివృత్తములు నున్నవి.

ఏ ఛందమును వాడినను వారు యతినో ప్రాసనో విడిచియుండలేదు. ఇంక నాంధ్రసంస్కృతపదములను ప్రయోగించుటలో వారు ప్రదర్శించిన పాటవము వర్ణనాతీతము. కొన్నిచోట్ల దీర్ఘసంస్కృతసమాసములను వాడిరి. కొన్నిచోట్ల తియ్యని తెలుగుపల్కుల పొలుపు నొల్కించిరి. వారి రచన చూచిన పిమ్మట "ఈ పాండిత్యము నీకుదక్క మఱి యెందేగంటిమే" అని అభిజ్ఞులనక మానరు. వారి భాష నిర్దుష్టము. పూర్వకవిమహావాక్యస్మారకము.

కవిగారీ కావ్యమును తమ తల్లిదండ్రుల కంకితము కావించి తమ మాతాపితృభక్తిని చాటియుండిరి. దవిష్ఠమైన కెనడాదేశముననున్న కారణమున వారు వారికి తగినంత శుశ్రూష చేయలేకపోవుచున్నందుకు చింతించుచు నిరంతరన్మానసానందసంధాత్రిగా నీ కావ్యపౌత్రిని పంపి యున్నారు. వయసున పిన్నవారైనను శ్రీమాన్ దేశికాచార్యులవారు రచనచే, సద్గుణసంపదచే తమ నామధేయమును సార్థకమొనరించుచున్నారు. ఆంధ్రులు కెనడాదేశమునుండియైనను వారినుండీమహాకావ్యము నపేక్షింతురని సాదరముగా విన్నవించుచున్నాను.

						-- దివాకర్ల వేంకటావధాని