హనుమప్పనాయకుడు-పంచమాశ్వాసము ప్రాగ్దిశాస్యాన రక్తంపుబంతివోలె నపుడపుడె యుదయించు నబ్జాప్తబింబ మేలకో యగుపించె నొక్కింత విగత కాంతిమంతమై యానాటి కల్యమందు. అవని యనుపేరి సమరాంగణమునందు సప్తాశ్వుడను ఱేని సంప్రసరణమ్ము నరికట్ట గాలమను నభియాతి పన్ను వ్యూహమట్టుల బర్వె నీహార మపుడు. ధ్వాంతమను ధూర్తవర్తనుచేత దమినెల్ల బంధితములై పద్మబంధనగృహములందు ప్రత్యూషమందొక్క పరమలోకాప్తుండు స్వీయాతిశుష్మాప్తిచే వ్రక్కలింపంగ తచ్ఛదకవాటముల స్వేచ్ఛమై వెల్వడిన కాలాశ్వములబోలె కంజముఖనిర్గత భ్రమరవారంబు లా ప్రత్యూషముఖమందు. ఆతఱిం బ్రాభాతశీతవాతవ్రాత పరిచుంబితాంగుడై ప్రవిబోధముం బొంది కాల్యవిధులం దీర్చి, కంజాక్షు నర్చించి, సేనాధిపుల గూడి యానాటి యాహవ వ్యూహముల జర్చించుచున్నంత సోముండు. ఆలోన నవనీశ్వరాత్యుత్తమాశ్వంబు ప్రతిరోధివర్గాపహృతమయ్యెనని యెఱిగి విస్తారభయశోకవిహ్వలస్వాంతులై పరుగుపరుగున బోయి ప్రభుపాదముల వ్రాలి. ఆలాపించిరి తద్హయ పాలకు లీగతి, "జనపతి! పాలింపుము, మా మూలమునం గల్గె దగని స్ఖాలిత్యం బొండు గతనిశాంతమునందున్. తివిరితి మెంతో నిసి న ప్రవిమత్తత మన భవాశ్వపరిరక్షణ కైనన్ బవలెల్లం బవరంబున దవిలిన వ్రణముల వశమున దను లవశములయ్యెన్. వ్రాలెను ఱెప్పలు కన్నులపై సోలెను తనువులు నితాంతసుప్తిధురానమ్రములై వ్రీలెను భాగ్యం బాలో రిపు లాలానమునుండి వీతి నపహారించిరి కడకన్. గాసిజెందిన కాయము ల్గల్గ నేమి? మీదు వార్వంపు రక్షయే మాదు కార్య మగుట దప్పిదం బిది నిక్క మవనినాథ! యిచ్చ వచ్చిన రీతి దండింపు డింక." అను వారి పల్కులకు నాశ్చర్యవిభ్రాంతు లేపార జింతించి, యేర్పడిన నష్టమ్ము నాత్మ నొక్కింత అధ్యవసాయ మొనరించి ఆరూఢధైర్యుడై యనె సోమవిభు డిట్లు. "అరయన్వలె దత్కులహయ విరహితముగ బోరు గెల్చు వెరవొక్కటి గానీ సరియే మిము దండింపగ జెరువుం ద్రెంపిన కితవుని చేలము గొన్నటులన్. ఉండుడు జాగ్రత నికపై జెండాడుడు రిపుల నేడు స్థేమార్యములై నిండారెడు నుత్సుకతం బండింపుడు దెన్గులక్ష్మి బాగ్యము ననిలోన్. వంచనచే నొక వార్వము నపహా రించిన జిక్కుదు మనుకొనిరే యతులితహేమాహార్యా చంచలధీరులు శాత్రవవీరు, ల వంచితధృతి నిక గూల్చుడు వారల యాశాహర్మ్యములన్. నిర్ణిద్రాద్భుతనిశాతవజ్రోపములై చూర్ణము సేయుడు క్షుద్రద్వేషణగిరులన్ వర్ణితవిక్రమపాండుయశోగణదీప్తిన్ దూర్ణంబుగ నిండు జయేందిర కారతులన్." అని వీరుల బోరునకుం గొనకొల్పుచు, సోము డొక్క గోడిగపై దా నొనరుచు బెనగెం గానీ రణ మత్తఱి జాల దుస్తరంబయి తోచెన్. కఱ్ఱయులితోడ గ్రావంబు గత్తిరించు శిల్పి చందాన, పూరితో సింధురమ్ము బంధనము సేయగను నిభపాలువిధము, నిజకులీనాశ్వముం బాసి నృపవరుండు వ్యర్థయత్నంబు గావించె వైరి గెల్వ. భిదురముం బాసిన త్రిదశవిభుని పగిది, అరణి మథియింగాలేని యజ్వ కరణి, నిజకులీనాశ్వముం బాసి నృపవరుండు జన్యరంగాన రాణింపజాల డయ్యె. ఎంచ హైమంతరవివోలె గించిదల్ప శక్తియుతుడైన సోమన్న చంద మరసి రిక్కలంబోలె జృభించి యుక్కడంచి యరుల, నోటమిం దప్పించి రతని భటులు. అంతలో భువనాప్తు డస్తాద్రికిం జేరె ప్రాంతయుద్ధాంగణప్రస్రుతక్షతజప్ర వాహానుషక్తిచే పరిశోణితంబైన తుంగభద్రాకాంతి నింగికిం బర్వెనో యన సాంధ్యరాగంబు వ్యాపించె సాంద్రమై. తమ నెలవులం దరియు పతగముల కరణి క్లమకసమరాంతసంశ్రాంతగాత్రులైన యవనవీరులు, దెన్గుయోధవరు లంత విశ్రమింపగ జనిరి తమిస్రయందు. ఆనిశాముఖమందు నాహవవ్యూహముల దర్కింప స్వీయయోధాగ్రణుల రావించి గద్వాలభూజాని ఘనమాన దేశాభి మాన మానితమైన వాణితో నిట్లనియె. "కౌక్షేయకబలదీప్తిం గార్యము సాధింపగలే కక్షీణోపధులై రిపు లశ్వము గొని యాంధ్రధరా ధ్యక్షత గెలువం బూనిరి; తద్వంచన కాత్మేక్షిక నీక్షించిన బ్రతివంచనయే యౌషధమగు గాదా! కాలిలో ముల్లు దీయంగ గాదొకింత అర్హమసి; ముల్లు దీయంగ నర్హమగును ముల్లె కాని; ఈ న్యాయమే చెల్లు భండ నమ్ములందును, రాజకీయమ్ములందు. ఈవిధి బ్రతివంచనచే మావార్వము బ్రత్యుషస్సు మలసెడు లోగా లావుంగడకయు దగ దే గా వే దొడరెడు మగండు గలిగిన నేనిన్. వానికి నిచ్చెద నా యా జానేయం బొకదినమున ఝంఝాత్వరితం బోనేర్చిన యంతటిదగు క్షోణీఖండము నుపదగ సుప్రియతాప్తిన్. లేడా మీలో తీవ్ర క్ష్వేడాకంపితసపత్నసింహుడు, విజయో ఢాడోలీకృతనిజధై ర్యాడంబరుడగు మహాబలార్కుం డొకడున్? వానిది భాగ్యవైభవము, వానిది సార్థకజీవనంబు, లో కాన నశాశ్వతంబు, క్షణికంబగు సౌఖ్యము నుజ్జగించి, శౌ ర్యానలదీప్తి మ్లేచ్ఛకుటిలాహవగర్వము వమ్ముసేసి, స్వ క్షోణిని గావ బ్రాణములగూడ నెవండు పణంబు వెట్టెడిన్. పుట్టువొందుదు రెందఱో పుడమియందు కాని వారిలో నెవ్వండొ ఘనుడొకండు త్యాగశౌర్యాభిరతిచేత దరతరమ్ము లకు ఖిలముగాని జాడల రచనసేయు కాలనిమ్నగాకూలసైకతములందు. విశ్వజ్ఞేయంబుగ నేవీరుడు మాతృధ రాశ్వశ్శ్రేయససిద్ధికి బ్రతుకు వ్యయించున్ శాశ్వతముగ ధ్రువతారాసంకాశంబుగ విశ్వచరిత్రాంబరమున వెల్గు నతండే. వచ్చుంగావుత వైరుల పాలిటి వి వ్వచ్చుండిక నీ పరిషన్ముఖమునకున్ ప్రోచ్చండసహోయుక్తినియుక్తిన్ వే దెచ్చుంగావుత దేజిన్ ఱేపటిలోన్. ఉత్తారింతుముగాక రి పూత్తమగళముల నవారితోద్ధతి ఱేపనిలోన్, ఇత్తుము గాకద్భుతవిజ యోత్తమహారతి దెనుంగునుదధిసముద్భవకున్." అను సోము మేఘనిర్హ్రాదవాక్యంబు లాలించి సభ కొంతవడి నిస్తరంగాబ్ధిచందమ్ము నిశ్శబ్దమయ్యె. ఉద్వేలమై పర్వు నుత్సుకత నంత నాసభయె పర్వాంతవేలాసముత్సేధవార్ధికోలాహలంబయ్యె. పాల్కడలిలోనుండి పైకుబికి లేచు తారాధిపతివోలె దరుణుం డొకండు లేచి నిలుచుండి యొనరించె వందనము ప్రభునకున్, సభ్యవర్గంబులకు నంత. చనలేదు పాతిక వసంతమ్ములేని ఆంధ్రసర్వంసహోద్యానవనమందు చక్కనౌ లేమావిమొక్కయై యాత డేనాడు జనియించె నానాటినుండి. ప్రతిపక్షదుర్గారరస్ఫుటనపాండితీ భాసురం బావీరు బాహుయుగళి, ప్రథనాంగణప్రాప్తబహుకిణాంకిత మతి కర్కశం బావీరు కాయయష్టి, శత్రునృపధైర్యద్రుసంప్లోషకదవార్చి యావీరు తీక్ష్ణవీక్షాతపంబు, ఆంధ్రరాజ్యేందిరాహాససమ్మోదర సోత్సేక మావీరు నుత్స్మయంబు, దేశసంరక్షణవ్రతదీక్షితుండు, స్వామిసేవాంకితాంగవాఙ్మానసుండు, గంధవాహాత్మజనిభుండు, కాదెవండొ శ్రీయుతు డతండు హనుమప్పనాయకుండు. మిన్నంటుసభాస్తారజ యోన్నతరావములమధ్య నుద్భటధృతిమా నోన్నమితచిత్తుడయి యనె సన్నుతముగ నిట్లతండు క్ష్మాకాంతునకున్. "ఆర్యా! నిరతభవాభిహితార్థసు కార్యాऽప్రసితంబు యోధకాయంబేలా? భూర్యాడంబరపూర్ణంబయ్యు గ దర్యత వర్షము గురియని స్తనయిత్నువటుల్. మీదు నాస్థానంపుదోట మీకటాక్ష సేచనంబున బెరిగిన చిన్నిలతల మేము; మాశౌర్యగంధసమృద్ధిచేత నెమ్మదిం గూర్చుటయె మీకు నిశ్చయముగ ఫలితమగుగదా! మాబోంట్ల ప్రభవమునకు! ఆజ్ఞాపింపుడు దేవా! అరుణోదయ మొదవెడులోగా స ర్వజ్ఞాద్భుతశౌర్యాప్తిన్ బరిపంథిపురాబ్ధిని జొత్తున్, వి శ్వజ్ఞేయంబుగ దెత్తున్ వార్వంబున్, నావిజ్ఞాపనమున్ ప్రాజ్ఞు ల్మీరలు భావింపరుగాతన్ గర్వాలాపముగన్. ఆతపంబున జృంభించు నగ్ని పగిది మీదు కార్యంపు గాఠిన్యమేదురాత పస్ఫురణచేత మచ్ఛౌర్యవహ్నిరేఖ కెరల దలకొంటి నీ కార్యభరణమునకు. అల పరమాత్ముండగు రఘుకులతిలకునకుం జెలువుగ దోడై చెలగిన పావని భవమటులన్ జెలువారుత మీ శ్రేయోలక్షితమగు నీ యలఘూత్తమకార్యాసక్తి న్నాప్రభవంబున్. దుర్దాంతవైరిశుద్ధాంతదోషాకరాస్యద్యుతిన్ దోర్దండరాహుసంగ్రస్తి దూరించు యోధాగ్రణుల్ వేర్దన్ని యిందు గొల్వుండ, బ్రీతి న్ననీ యర్థమై నిర్దిష్టు జేయుట ల్నాదు నిశ్శ్రేయసార్థంబెకా! పలుమాటలతో బని యేలా? తలదాలిచి మీదునాజ్ఞ ద్రచ్చెద వైర్యర్ణవమున్, తెలవాఱకముందే తెచ్చెద గులహయమున్ నన్ననుపుడు గూర్మిం దీవించి యికన్." అని పల్కి, ప్రభుదీవనలు దాల్చి హనుమప్ప కార్యోన్ముఖుండయ్యె, జనకజాన్వేషణాసక్తి జను హనుమప్పవలె నతడు గననయ్యె. యవనసైన్యంబునం దలరారుచుండు వాజివారణవృషకదంబములు మెండు, వానికై కొనసాగె నవ్వారిగాను యవనసైన్యంబు గ్రాసంబు ననుదినంబు. ప్రాంతమున గల్గు పల్లెల పట్టునుండి జానపదులెందఱో యిదె సమయమనుచు దెచ్చి చొప్పయు గడ్డియు బెచ్చుగాను విక్రయింపంగ జూతురు విత్తమునకు. భీమపాఠీన, విషసర్ప ధామమయ్యు కంధి రత్నాకరంబౌట గామ్యమయ్యె, క్రూరమయ్యును దౌరుష్కవార మపుడు కామ్యమయ్యెను ధనసమాకర్షణమున. తొడదాక దొడిగిన తురకలా గొకయింత కనరానియట్లు పంచెను ధరించి, వెడదయురమ్ముపై విశదంపు పొట్టిచొ క్కా నొక్కదాని జొక్కముగ దాల్చి, ఉత్తమాంగమ్ముపై నెత్తైన క్రొత్త చుం గుల తలపాగ నేర్పలర జుట్టి, తలపాగపై దిమింగిలమంత పొడవు, లా వును గల్గు చొప్పమోపును వహించి, ముంజేతి కడియంబు మురువొప్పు కెంజేత దరళాతిశాతదాత్రంబు బట్టి, వక్కాకు సున్నంబు, జొక్కమైన పొగాకు గల సంచి మొలత్రాట గట్టియుంచి, చప్పుడింతయు జేయని చెప్పు లంఘ్రు లం దొడిగి హనుమప్ప యా సందెవేళ చొప్పనమ్మెడు బేహారి చొప్పు దోప తురకశిబిరంపు దారులం దిరుగసాగె. అటునిటు బోవక యొక హయ కుటీరనికటమున నతడు గ్రుమ్మరసాగెన్ దటుకున నాతని తలపై బటువగు మోపుం గని హయవాటీపతులున్. దరికి నతని రావించి, యీకరణి బల్కి "రోయి భాయి! ప్రొద్దయ్యె మాకోయి! జల్ది చెప్పగావలెనోయి నీ చొప్పమోపు నెంత ధరకిత్తువో భయమింత లేక." అన నాతండిట్లనె "నో జనాబులారా! భవాశ్వసంతతికొఱకు గొనివచ్చితి నిది కాదా! కొనుడిక గాదందున తమకోర్కెను నేనున్. అయ్య! జ్యేష్ఠమాసంబునం దంకురించి సరిగ నిలువెత్తు పెరిగిన సజ్జ, జొన్న చొప్ప యిది, దీని మనసొప్ప జప్పరించి చెంగలించు నెలమి నే తురంగమైన! ముదరుదంటులు లేవిందు, ముద్దులొలుకు వెడదయాకుల మవ్వంపు నిడుదదంట్లె కాని, కాన సాయబులార! దీని దిను మి ఠాయివలె నెట్టి గడ్డుపటాణి యైన! ఇంతింత యననేల? ఇత్తురా పదివేలు చొప్పదంటుల కేను జెప్పికొన్నంగాని? ఇప్పింపుడయ్య నా కేడురూకలు చాలు! ప్రొద్దయ్యె నింటికిం బోదునింక బిరాన!" అమరగ నామూల్యంబున కమితాశ్చార్యం బెడదల హయవాటీశుల్ భ్రమితభ్రుకుటీయుతులై అమర్షపథులై పలికిరి యాతని కిటులన్. "ఏమి కొనివచ్చినది హేమభూమిధరమొ? కాక రజతాద్రియో లేక కమ్రరత్న నిధియొ? నీయాశ కింతైన నియతి లేదె? నీదు దారిద్ర్యముం దీర్చుకోదలంతొ? యీ రవంతబేరంబుతో నీక్షణాన? పూరి నమ్మవొ మున్నెప్పు డోరి నీవు? గ్రుడ్డివారమె? మేము నీగడ్డి కేడు రూక లివ్వంగ, దీవాన రూపు దోచె దీవు; జావొరే బద్మాషు జావుజావు!" అనుచుం గొల్లున దురకలు హనుమప్పం గని రుసరుసలాడిన నాతం డనువొప్పగ శాంతుండై యనె నీగతి నా తురుష్కహయపాలురకున్. "కోపమెందుకు బాబు! కోటి దండాలు మీకు; నేనన్న ధర మీరిత్తురా యేమి? మీయిచ్చ యేదియో మీరడుగరయ్య! అమ్ముకొనుటకె కదా! ఆయాసపడుచుంటి! కట్టెండ, పైపెచ్చు బెట్టిదంపుబవరంబు, మట్టముగ నశియించె మణిపూసవంటి గడ్డి, ఎట్టెట్టొ యీకట్ట గట్టితెచ్చితిని బాబు! చెట్ట దలపక తమరు చింతసేయంగవలయు బిట్టైన నాకస్తి బేరమాడుటకు ముందు!" అనినం బల్కిరి తుర్కలు "మునుకొని నీవా జముపురమునకుం జని తె చ్చినగానీ నీ వడిగెడు ఘనమూల్యం బీగ మేము కడుదేబెలమే? మాల్ ఖరీదెఱుంగక నీదు మదికి వచ్చి నట్లు వాగిన బేరమెట్లాడవచ్చు? ఏడువీసాల మాలున కేడు రూక లిచ్చి కొందురెవ్వారు నీ పిచ్చిగాని! ఇచ్చిన నిమ్మీ చొప్పను బొచ్చెములే కేడువీసములకున్, లేదా వచ్చిన దారిం బట్టుము చెచ్చెర నీవిందు నుండ జెల్లదు సుమ్మీ!" అను హుంకారంబులకున్ హనుమప్పోత్కటభయవినయమ్ములు నటనం బొనరించుచు మంద్రరవ ప్రణుతంబుగ బల్కె వీతిపాలుర కిటులన్. "సర్వముం దెల్సియుండియు సాయబయ్య లార! ఈరీతి నడుగ న్యాయంబె మీకు? పేదవానిని, కలదు గంపెడు కుటుంబ భరము; దీన రావలదె మాబాబు కొక్క గ్రుక్కెడంబలి యీ ప్రొద్దు గ్రుంకువేళ? కొండంత మోపయ్య! కండలన్నియు బిండి కట్టి తెచ్చితినయ్య! అట్టిట్టు లనబోక రెండురూకలనైన నిండయ్య! నీరెండ వెలుగులో జల్ది నే నిలుజేరుకొందయ్య!" అనుచుం బల్కుచునుండగ ఘనగర్వోన్మత్తులు, ప్రతిఘామయచిత్తుల్, వినయనివృత్తుల్ తురకలు హనుమప్పం గని కపటహాసోన్ముఖులై. "జావొరే హర్రాము జావొరే" యనె నొకడు, "లేవొరే ముఫ్తుమే లేవొరే గడ్డి" ననె నొకడు, "బేవకూఫ్ వీనితో బేరమేల"నె నొకడు, "పోవురే తుమ్హారె గాఁవుకో" యని త్రోసె నొకడు. వారీగతి జెలరేగగ వారల సౌమ్యుం డొకరుడు భాయీ! వీనిన్ హైరాన్ జేయగ వలదని వారించి యితరతురుష్కవర్గము కనియెన్. "వీడు దీవాన! పోనిండు వీని నురక, బలిమి వీని మోపును గొన్న గలుగు మనకె కీడు! ఈ వార్త విన్నచో రాడెవండు గడ్డినమ్మంగ నిటకు నేకరణినైన. ముందె హిందూలు రాకుందు రిందు భీతి, పైని నీవార్త ప్రాకెనా ప్రాణమేని బుచ్చి యుపవసింతురుగాని పూరిపుల్ల నైన దెత్తురా మన వృషభాశ్వతతికి? ఇదె పోనిండిక నీ దీవానన్ అదె భానుం డపరాంబుధిలో బడియెన్ మదిరాశాలలు మనకై వేచెన్ పదండి బిరబిర దదీయవాటికి నిపుడేన్" మదిర పేరు విన్నంతనే మదులు చెమ్మ గిల్ల బానశాలకు జేరి రెల్లవారు, మధువునకు, మదిరాక్షుల యధరసుధకు బట్టువడుగదా! భువినెట్టి జెట్టియైన! అట్లు వారలేగిన బీడ పెట్లిపోయె ననుచు హర్షించి హనుమప్ప యశ్వశాల నంత గాలించె గాని, యం దరయడయ్యె నేమి పాపమొ యకట! సోమేశుహయము! వైరిభటు లెవరైన ప్రాంతమున నీక్షించు చుండిరో యంచు దా సూక్ష్మముగ బరికించు, కనరాదు, హయము నేకడ దాచిరో యంచు మందురాంతరమంత మఱిమఱిం గాలించు, ఇనుడబ్ధి బడసాగె, నింక గనకున్న ఘోటకము నే ప్రభున కొనరించియున్న ప్రతిన నేరీతిసార్థకము నొనరింతు? అనృతవైతరణి నేయటులం దరింతు? అనుచు జింతించు, పరమాత్మానుకంప కొఱ వడిన గూడునె కార్యభరమంచు వాపోవు నాది సీతాన్వేషణాతురస్వాంతుడౌ హనుమప్పవలె నప్డు హనుమప్పనాయండు. "పలికితి బీరంబులు ప్రభు కెలనన్, ఘోటకమును గొన కేమొగమిడి యా యిలపతిముఖముం జూడం గల, నేగతి నా విఫలత గథనముసేతున్? ఈ కార్యము వహింప జేకూరు నాకు నవయశోమణిమయోన్నతమకుటమంచు నేనిందులకు నిచ్చగింపంగ లేదు; తురగమ్ము భూకాంతుతో జేర్పకున్న విరుగు నాంధ్రోద్యమము; వెస నంతరించు దురకప్రభుత్వంపు ద్రొక్కిడుల నలిగి ఆంధ్రమాభాగ్యసుమమంచు దలకొంటి, నైన దైవఘటనం బఱిన కార్యంబు లమరునే వట్టి పురుషార్థంబువలన?" అని చింతించును; ఈ నా వను దరిజేర్చెడు భరమిక పావని! నీదే యని కులదైవము బ్రార్థిం చును; కఠినస్వామికార్యసుధురానతుడై. కరుగబోసిన యినుమట్లు స్థిరత నుడిగి యిట్లు కొన్నిక్షణములు యోచించె నతడు; పైని ఘనమైన యినుమట్లు బూని స్థిరత మెఱయగా మదియందొక్క మెఱుపుటూహ సాగిపోయెను శిబిరంపు సరణులందు. అతిభారమగు మోపు నౌదలం ధరియించెగాని అతడు గమియించె బృషదశ్వసంస్పర్థిజవనాప్తి చతురబ్ధిసంపూర్ణజలపూరముం బూనియైన అతిజవాప్తి జరించు నంబుదశ్రేష్ఠంబు రీతి. బిరబిర నిటుజని యాతం డరసెనొక రహస్యరాజహయమందిరమున్ వరలును నైజాముప్రము ఖరసాధిపహయము లందు గడురక్షితమై. అందుం గన్గొనె నాతడు బృందారకహయనిభంబు, విశదాభంబున్, సుందరశుభచిహ్నాభి ష్యందంబున్ సోమభూపహయరాజంబున్. ఆ తురగము గని యాతం డమితప్రమదో ద్భూతప్రతినవపులకాంకితతనుడయ్యెన్ బ్రాతి నశోకోపవనిన్ సీతం గాంచిన వాతజువైనం బాతనిలో గననయ్యెన్. దుర్దినంబున బొడసూపు ద్యుమణి రీతి నతని యతికాతరితహృదయాంతరమ్ము నతినవాశాతపప్రభాసితము జేసె నతులభద్రాంకితంబౌ దదశ్వమూర్తి. అటులన్ సంహృష్టాంతరుడై యత డటునిటు గని చొప్పో యమ్మా! చొప్పని యఱచెన్, స్ఫుటమగు నా యఱపు న్విని తద్హయ కుటీరపాలుడు చెంతకు గుతుకంబున జేరన్. ఆ సందడికిం దలకుచు శ్రీసోమాధిపహయంబు చిట్టాడుచు బి ట్టాసన్నధరం గన్గొనె గ్రాసధురావహుని, దెన్గురాడ్భటవరునిన్. హనుమప్పనాయకుని ఆహయము గుర్తించి ఎనలేని యెలమిచే నెంతకాలానికో జనకునిం గన్గొన్న చంటిపాపని పగిది కనులకాంతులు నిగుడ, గర్ణములు నిక్కించి గొనబొప్ప గట్టుకొయ్యను జుట్టి చిట్టాడు చును, బిట్టు సకిలించుచును సందడింపంగ గని యా తురంగమున్ హనుమప్ప నేకముగ ననుమానపడె నిట్లు యవనాశ్వపాలుండు. భాళారే! ఘోటకమిది బాల్యమునుండియు రేగడి నేలల నెండినదంటుల నెప్పుడు మెసవుచునుండుటచే దాళక యీతని గని కడు దత్తరమందుచు నున్నది యీలాగెందుం గందుమె యిల నాజానేయములందున్! ఎండుపుల్లల జూచి యిగిలించుచున్నయది, కొండకోతింబోలె గుప్పించుచున్నయది, చండవాతాహతిం జదలంటగా నెగయు నెండుటాకుంబోలె నెగసిపడుచున్నయది. ఈయశ్వము నిటులే సందడి చేయగ నిచ్చిన గూల్చునుబో ఈయశ్వాలయమున్ సాంతముగన్. కావున నీయెండిన దంటుల వావిరిగా గొని యిడి దీనిం గావింపంగా దగు శాంతముగన్. అనుచు దలపోసి హయపాలు డనియె నిట్లు "నీదు మోపు నెంతఖరీదు కీదలంతొ నుడువగా దగునోయి బీతుడిగి, పెక్కు మాటలాడక మా కొక్కమాటలోన". అన నిదె సమయంబనుచున్ ఘనమోదంబున నతడనె "ఖానూ! ఆశిం పను హెచ్చుగ నేనొక కా సునుగానీ సతతధర్మసుస్థిరమతినై. ఐదువీసాలు దయసేయుడయ్య చాలు! గబ్బిగుబ్బలిబోలు నీగడ్డిమోపు నిప్పుడే మీదు ఘోడాల యెదుట వైచి చల్లగా బట్టిపోదు మాపల్లె బాట! పొట్టగడవని పేదపుట్టుకలు ఖానయ్య! మీరొసగు కాసులం బిరబిరం గొంచు నే బోవకుండిన లేవబోదయ్య ప్రొయ్యిలో పిల్లి, వలదయ్య యీపీడ వైరులకైన!" అనెడు హనుమప్ప నుడులకు యవనభటుడు "ఎంత వెఱ్ఱియొ, లేకున్న నింత చౌక ధరకు నిచ్చునా యెవడైన ధాత్రి నింత మోపు" ననుచు హర్షించి ఆమోపు విలిచె. హనుమప్పయుం దాని నాంధ్రవిభునశ్వంబు ముందటన్ విదలించి ముదమారగా వైచె ఆవేళ నావీరు నాత్మఫలకమ్ముపై ఆ మందురాంతరమె ఆముద్రితంబయ్యె. ఈ లీలన్ మోపును హయ పాలునకున్ విక్రయించి, పాయక యట వీ త్యాలయసవిధస్థలి సిక తేలన్ వెదకంగసాగె నెదియో కడకన్. కాల నిసుకను దున్నును; కేల నిసుక నెత్తిపోయును; కొంగయ ట్లిలకు వంగి సూక్ష్మముగ బరీక్షించును; జుట్టు దిరుగు నతులపర్యేషణాసక్తి నపు డతండు. ఇటులత డుండగ నొక భటు డట కేతెంచి యమితాగ్రహంబున "హర్రాం! ఇట నీవేలుంటివి?" యని కటువుగ దిట్టిన నిటులనె కలగుచు నతడున్. "గడ్డి నమ్మితి నిప్పుడే ఖానుసాబు! కాని యాసొమ్ము నేపాపకారణమ్ము చేతనో కోల్పడితి నిందు, జెడితి, నయ్యొ కేలజిక్కిన నజరాన నేల జిక్కె. ఱెక్కలాడిన డొక్కాడు, లేదొకింత అన్యవిధమగు నార్జితం బందుచేత గోలుపోయిన సొమ్ము నీనేలలోన నెమకికొనుచుంటి దాము మన్నింపవలయు!" అనిన యవనుండు జల్దీగ నరసికొనుము; ఎల్లకాలము నీవుండ జెల్లదిందు అనుచు నేగెను; ఆపైని నన్యుడొకడు వచ్చి యడిగెనట్లె, యతడు వల్కెనట్లె. "ప్రాప్తముండిన నేల బడిపోవునా పైస? ప్రాప్తముండని పైస పదివేల యేండ్లీవు బిజిలీ లగాయించి వెదకినం దొరుకునా" యంచు బల్కుచు నేగె నతడు వేదాంతివలె. ఇట్టులెందఱో భటులట కేగుదెంచి పృచ్ఛగావించి యేగిరా వీరవరుని ఒకడు నగె; నొకడు గినిసె; నొక్క డపహ సించె; నింకొక్క డనుకంప నించి కాంచె. వారేమి యనిన వనటం గూరక, ధ్వాం తారంభంబగువఱ కాతండటులే జుణుగుచునుండెన్, బారులుగొని యార్భాటించిన గానీ ఫేరవముల్ వెఱపించునె ద్విపభీదంబు మృగేంద్రంబున్? పదపడి ధ్వాంతం బంతట నదనను కంసాలి విశ్వమను పాత్రంబునకున్ గుదురుగ మసితో బట్టిన ముదురుకళాయియొ యనంగ బొదలెను రోదసిలోన్. కొందఱు కల్లుద్రావ, మఱికొందఱు గూడి నమాజుసేయగన్, కొందఱు పచ్చిమాంసమునె కోరకమీరగ మెక్కి త్రేన్చగన్, కొందఱు సానికూటముల గుల్కగ, నందఱు నందఱై ద్విష ద్బృందము లేగ నాస్థలము వే విజనంబయి పొల్చె నత్తఱిన్. ఆతం డదియే యదనని ఓతువురీతిం బదరుతి యొక్కింతయు లేకుండన్ జక్కులశాలం దరిసి త దంతరమున లేడితరుం డని నిర్ధారణమొనరిచి యందున జొచ్చెన్ సంహృ ష్టాంతరుడై త్వరతోడన్. "సద్దుమనిగి శాత్రవాళి నిద్దురించుదాక నిందె డాగియుండెదన్, ఒద్దికం దెనుంగుఱేని ముద్దుతేజి గొంచు ముదముమీర నేగెదన్." అని నిశ్చయము సేసి ఆవీరు డాంధ్రేశు ఘోటకము ముందు గల గాటిలోనం జొచ్చి గడ్డియుం జొప్పయుం గప్పికొని నిలువెల్ల నాన్యోపలక్షితం బగురీతి శయనించె. నివురుగప్పిన నిప్పువోలెం బొదను డాగిన పులినిబోలెన్ జలదనిహ్నుతసవితవోలెన్ అతడు డాగెను అశ్వశాలను. ఊపిరాడదు సుంత; ఉరుఘర్మవారిలో దనువెల్లనుం దోగె; తనుకీటకమ్ముల బె డద తాళరాదయ్యె; కదలాడ కింతయున్ శయనించె నతడట్లె; చలియించునా ధీర చిత్తమ్ము లిలనెట్టి చేడ్పాటు లెదురైన! అతడట్టుల మఱగైనన్ మతిసెడి ఘోటకమంతన్ బహుళశ్వాసస్పందిత వక్షఃప్రోథంబగుచున్, సూచీకృతకర్ణంబగు చున్, సంఘూర్ణితవదనం బగుచున్, తీవ్రహ్రేషా ప్రతినిదత్ప్రాతంబగు చున్, చలితాలంబంబగు చున్, సంచాలితవాలం బగుచున్, శ్రంథితకేసర మగుచున్, సంక్షోభింపన్. కట్టుత్రాడుతోడ మూల ముట్టుగాను లేచివచ్చె నట్టె పుడమి జీల్చికొంచు బిట్టు వాడిమొన గలట్టి కట్టు నినుపగూట మంతటన్. - అట్లు విడివడి యదృచ్ఛ నశ్వసదన సవిధదేశాన జరియింపసాగె హయము; గుఱ్ఱ మేగెను గూటముం గొంచు ననెడు నానుడియె సార్థకంబై పొనర్చుచుండ. అంత నొక యామికుం డాహయము నీక్షించి రభసంబునం దాని రజ్జువున గ్రహియించి గాటికడ గ్రమ్మరం గట్టంగ నుంకించి గూటమున్ భూమిలో నాట నారంభించె. వేయిహయములు శక్తితో విక్రమించి ఊడబెఱికిన రాకుండ యుండవలయు గూట మిదియంచు బలిమిమై నాటజొచ్చె పుడమిలోపల నాతండు పూన్కితోడ. కాని సూచ్యగ్రతీక్ష్ణంబు తద్ఘనకీలకాగ్రంబు యోగనిద్రం దేలు నాగేంద్రపర్యంకు చందంబు గాటిలో నిదురించు గద్వాలభటదక్షిణకరంబు సూటిగా జీల్చికొని క్షోణిలో దిగజొచ్చెను గరంబు. ఏవేళ బూనెనో ఈకార్యభరణంబు ఆపదలె యెదురయ్యె హనుమప్ప కనిశంబు ఆపన్నులకె చాల నాపదల గల్పించి ఆడుకొను నాటకం బబ్జాక్షు డిలలోన! చేతిలో గల యస్తికల్ చిట్లిపోయె, క్షతజనిమ్నగ నవని సంస్నాత యయ్యె, కృచ్ఛ్రసందష్టమై మేను క్రుంగిపోయె, హస్త మవనికిం దిరముగా నతికికొనియె. గరళంబు కాల్వలై కాఱంగ గోఱలం గాలాహు లేకమై కఱచినట్లు, కొండ్లలో నిండార కుండెడంత విషంబు కోటితేళ్లేకమై కుట్టినట్లు, పలువాడి ములుకులం బలలంబు వెలివడం దనువులో బలిమిమై జొనిపినట్లు, లోహకారుని కొల్మిలో కాయముం బెట్టి సుత్తెతో బలుమార్లు మొత్తినట్లు, వాగతీతంబగు వనట వాని పాణి నుండి వెడలి, ప్రత్యణువులో నిండినిండి, గాత్రరుహకూపములనుండి కాఱ జొచ్చె వ్యాళఫూత్కారనిర్గతక్ష్వేళమట్లు. ఇట్లు పెల్లగు బాధ మేనెల్ల దల్ల డిల్ల మొఱయిడం డొకయింత; డిల్లపడడు; రెల్లుపోచంతయు జలింప; డుల్లమందు మల్లడించెడు శోకంపు వెల్లువలను వెళ్లగానీడు హృత్సీమ వెడలి వెలికి. అబల యయ్యును దొల్లి సీతమ్మతల్లి కాకిరక్కసివెత కోర్చి కాంతు గొల్చె, బల్లిదుండను; మొఱలిడి ప్రభునికార్య భంగ మొదవింప నవ్వరే పందలేని! అని స్వామిహితమునే అధికమ్ముగా నెంచి వనజాక్షచింతనప్రసితాత్ముడౌ మౌని ఘనతపోగ్లాని సుమకల్పముగ గొను రీతి పెనుబాధ లోనె యిడికొనియుండె నాతండు. అక్కట! విసమ్మునే అమృతమ్ముగా నెంచి పుక్కిటం గొన్న ఫణిభూషణుని చందాన మిక్కుటంబగు వెతనె మేలుగా భావించి ఒక్కింత సడిలేక ఓర్చియుండె నతండు. చిమ్మిరేగెడు తూఫాను దొమ్మిలోన విన్ను నంటెడు కెరటాల వెన్నుమీద ఎట్టులో నావ దాటింప బిట్టు దివురు నావికుని చందమై తోచె నతనిరీతి. ఇట్టు లతడుండ దనుకృచ్ఛ్ర మినుమడించె, శూలముల గ్రుచ్చి వ్రణములో హాలహలము నించినట్లయ్యె; నోరెండె; నేత్రయుగము నుండి జాల్వాఱె నేఱు లఖండముగను. ఈతెఱం గాభీలయాతనోర్మీముహు స్తాడితుండై యతడు సమ్మూర్ఛితుండయ్యె; ఉల్లోలకల్పాంతకల్లోలవినిమజ్య మానాంబుతరి చంద మావిధము గననయ్యె. దారుణతరగ్రీష్మతాపంబునం జొక్కి క్ష్మాదేవి యొడిలోన సడిలేక పడియుండి తొలుకారు చలువచే బులకింపగా వేచు బీజమట్టుల నతడు వివశుడై పడియుండె. అద్దమరేయి యయ్యె; దినమంతయు మార్తుర ద్రుంచు కేళిలో దద్దయు డయ్యుటం దురకదండు మునింగె బ్రగాఢనిద్రలో, సద్దుమనింగె, నల్దెసల జల్వలపందిరి వైచె నత్తరిన్ నిద్దపు నవ్యజాతరజనీకరశీతసుధాంశువల్లికల్. ఆ సుధారుఙ్మహిమ మదియెట్టిదో కాని అది సోకినంతనే యొదవె జైతన్యంబు మందురాంతరమందు మతిదప్పి పడియున్న హనుమప్పనాయకునియం దక్కజముగాను. అట్లు సంప్రాప్తచైతన్యుడై యతండు చొప్పదుప్పటి డాకేల దప్ప ద్రోచి సూచికానిశాతేక్షణరోచు లలర ప్రాంతదేశంబు బరికించి బాఢముగను. "అల్పకార్యము నద్రికల్పముగ భావించి ధావించు బ్రధ్వస్తధైర్యుడై భీరుండు కాని కులగోత్రభరమైన కార్యంబునే యెంచి కుశకల్పముగ నెనయించు ధీరుండు." ఈవిధి నాతడు యోచన గావించి, లవిత్రము గొని కట్టిన కోకన్ వే విదళన మొనరిచి, యా పై వామకరంబున నొక పాయను గొనుచున్ కుడిముంజేతికి గట్టెను కడుబిగువుగ నాపటంబు గడియమువోలెన్, తొడవయ్యె నదియె యనికిం గడు దొడరెడు మగని వీరకంకణమటులన్. ఆతతచాతురీధృతిసమంచితధీయుతి నాతడంత డా చేత లవిత్రమూని కుడిచేతి నొకానొక వ్రేటుచేత ని ర్భీతి దెగంగ గోసె, నతివేదన నంగము గ్రుంగినన్ నవో ద్భూతమునైన స్వేచ్ఛ నిరవొందగ నెమ్మది సుంత నెమ్మదిన్. పెల్లగు బాధచేత దనువెల్లను దల్లడమందె గాని తా దొల్లి బిగించి కట్టుటను దొల్కదు రక్తము దొట్టుతొట్టునం బెల్లుగ జేతినుండి, యిది బీజముగా నత డొందడయ్యె మూ ర్ఛోల్లసనంబు, నొప్పెనిదె యుత్తరకార్యసహాయకారియై. కొంతకాలం బటనె కూలిపడియుండె నత్యంతబాధావృతాంగుడై యతడు నీరంధ్రనీలాభ్రనీశారమైన రత్నగర్భాధరప్రతిమాను డగుచు. కాని దుర్దినాంతరజాతగాఢచంచ లాభ చంద మాతని హృదయాభ్రమందు స్వామికార్యైకదీక్షయే సాంద్రమగుచు మెఱయగా నెదోవిధి ధృతి గఱచి లేచి. గుండెలుపిండు వేదనను గుప్పిట బట్టి యతండు వస్త్రపున్ ఖండము నొక్కదాని గుడికైపయి గట్టిగ జుట్టి, దోవతిన్ నిండుగ వల్లెవాటువలె నిల్పి నిజోర్ధ్వశరీరయష్టిపై, దండితనాన డాకయిని దా గొనివచ్చిన ప్రగ్గె నొయ్యనన్. కళ్లెముగ దగిలించి కంఖాణముఖమందు మెల్లగా వీపుపై మేలొప్ప గూర్చుండి ఛెళ్లునన్ మెడదట్టి ఛెల్ఛలోయంచు హయ తల్లజము నుసికొల్ప దక్షణం బెలమిమై. తలలో నాల్కవలెం ద త్కులహయ మాతని తలంపు గుర్తించుచు దా దొలగిచనెన్ రిపుశిబిరా వళి ద్రుటిలోనన్ క్షణప్రభాలతవోలెన్. నిద్దురమత్తు కొంతయును, నిష్ఠురయుద్ధధరాభివిద్ధగా త్రోద్ధురబాధ కొంతయును, వ్యుష్టితరాసవపానలోభసం సిద్ధమదంబు కొంతయును, చేరి మనంబులు మొద్దుబార నా యోద్ధ రయంబునం గొనెడు నుత్తమవీతిని గాంచి యామికుల్. నీటికి నాశ్వికు డెవ్వడొ ఘోటకముం గొనుచు నేగు గొబ్బున నిపు డా యేటికి; ఊరక ఆపగ నేటికి, నిరుకునను బెట్టనేటికి వీనిన్? అని వారూరక యుండిరి; అనృతము గాదయ్యె వారి యాలోచనయున్ గొనిపోవుట ఘోటకముల ననిశం బేటికి భటాళి కలవాటగుటన్. అతిరయధూతవాతహరిణాద్భుతవేగవిభాసమానమై చతురత నాతురంగము నిజాధిపుడౌ నలసోమనాథు డం చితముగ నున్న చక్కికిని జేరె దదీయభటప్రశిష్టమై యతివరశిష్టమై హరిని నాదట జేరు మనస్సమానమై. ఈవిధి జేరిచి భూవిభు స్థావరమునకున్ హయమును, స్వప్ననిమగ్నుం డౌ విభు నల్లన జాగృతు గావించి యపూర్వభక్తిగరిమం బలరన్. సవ్యహస్తము నొసటిపై సంఘటించి వంగి ముమ్మారు గావించి వందనంబు, సప్తి నాచేతనే చూపె జనపతికిని మేరుధైర్యుండు హనుమప్పవీరవరుడు. ఆ తురంగము గాంచి యత్యంతహృష్ట మానసుడె యయ్యు సోమభూజాని, సవ్య హస్తమున మ్రొక్కు హనుమప్ప యనువు జూచి కినుక నెలకొన నాతనికెలన జూచె. అంతలో భూజాని కక్షిగోచరమయ్యె ఖండితాగ్రంబు, రక్తపృషంతికార్ద్రంబు నైన హనుమప్పనాయకదక్షిణకరంబు; అప్పుడే భూజాని హల్లకోపమమైన వదనంబు కైరవప్రతిబింబముగ మాఱె. సప్తిసందర్శనోదితసమ్మదంబు సేవకకరేక్షణోదితచింతతోడ మిశ్రితంబైన సోమభూమీశుహృదయ మంత గనుపట్టె ధామధూమాన్వితాభ్ర పటలసంయుతంబైన యభ్రపథమట్లు. అంతవఱ కాఱేని స్వాంతంబులోన భాసిల్లు కైరవప్రతతులే మాఱె నిందీవరంబులుగ నిపు డబ్రముగను నీలీసుమంబులుగ నేడబ్రముగను. వెంటనే గౌరవప్రేమాభిమాన భావశబలంబైన స్వాంతంబుతోడ ఆశ్లేష మొనరించి హనుమప్ప నడిగె హేతువేమని తద్విఘాతమున కతడు. అతివినయమతియౌచు హనుమప్ప యంతటన్ పృథ్వీశు కెఱిగించె వృత్తాంత మంతయున్ క్లుప్తముగ జాలతఱి లుప్తమొనరింపకన్ వృథసేతురే తఱిని కృతబుద్ధు లింతయున్? నాన్యతస్సాధ్యమౌ నాచరిత మాలించి స్ఫారతరమోదవిస్మయపూజ్యతాభావ భరితాంతరంగుడై ధరకాంతు డాతనిన్ బిగికౌగిటం గ్రుచ్చి ప్రియమార నిట్లనెన్. "ఇంతటి సాహసంబు, మఱి యింతటి దేశహితైకవర్తనం, బింతటి స్వామిభక్తి, పయి నింతటి కార్యనిరంకుశత్వమున్ గాంతుమె యెందునేనియు ద్రికాలములందును వీరవర్య! నీ యంతటివానినిం గనుట నాంధ్రిచరిత్రము ధన్యమయ్యెడిన్. నీ చరితంబు నిర్మలము; నీ కనుసన్నల జిక్కెనోయి యెం తో చపలాత్మయౌ విజయతోయజగేహిని; నిన్నుబోలు శౌ ర్యాచరణైకజీవనుల త్యాగఫలంబునగా దొలంగు నాం ధ్రీచరణంబులం బడిన మ్లేచ్ఛజనప్రభుతోగ్రశృంఖలల్. గండరగండలౌ రిపుల ఖండనసేసి మహాంధ్రఖండ మా ఖండలలోకమట్లుగ సగర్వముగా రచియింప జాలు నొ క్కొండు భవాదృశుండగు మహోగ్రరణాధ్వరపండితుండు, వే దండసమంబులౌనె వని దక్కిన వన్యము లెన్నియుండినన్. నీదగుకీర్తి యీ తెలుగునేలను నిల్చి యనశ్వరంబుగా నూదును క్రొత్తయూపిరుల నూర్జితభావిమహాధ్రయోద్ధసం ఘోదయకాయమందున, ద్వదుత్తమగాథ సుధోపమానమై శ్రీదమునై సదా తెలుగుజిహ్వల దప్పక నాట్యమాడెడిన్. ఇట్టి మహోపకారికి మహీతలమెల్లను గాన్కవెట్టినం దుట్టియె, యైన మామదికి దోచినయట్టుల, మాదుశక్తికిం దట్టినయట్టులన్ ఘనముదమ్మున నీకిదె కాన్కవెట్టెదం జిట్టిదటంచు గాదనక స్వీకృతిగాంచుము దీని నెట్టులేన్." అని సోమభూపాలు డంతటన్ ఘనధరాఖండమున్ కాన్కగా నొసగుచున్ దనచేతనే దానపత్రమున్ నెనరొప్పగా వ్రాసి హనుమప్ప కొసగుచోన్. అతివినమ్రుడై హనుమప్ప యనియె "స్వామి! సేవకున కింత మర్యాద సేయదగునె? ఏనొనర్చిన మేలింతసేసి తాము నను మింటికెత్తగా దగునె దేవ! ఓ నరపాలవంశమణి! ఉంటిని చాలును మీకటాక్షధా రానిరతార్ద్రమైన ధర బ్రత్యహమున్ ఫలియించు దీవెనై, మానితమామకీనతనుమానసశక్తులు మీదుసేవకై కానుకసేయు భాగ్యమును కంటిని చాలు నికేల కానుకల్! ఉర్వీవల్లభ! మీరో సర్వాంధ్రజనాళికి బ్రియజనకులు; దీనిన్ గర్వముతో నెంతుము మా పూర్వాచరితాసమానపుణ్యఫలముగన్. దోర్వీర్యంబున దనయుం డుర్విం దండ్రిని గొలుచుట యుక్తముగాదో నిర్వర్తించితి నావిధి గర్వింపగ నేమి కలదు కన్గొన నిందున్. ఐనను మీరూహించిన నేనెదొ ఘనకార్య మాచరించితినని, తా ర్కాణంబయ్యది మీహృద యానూనవిశాలతకు, దయాసాంద్రతకున్. ఈ సద్భావమె వసుధా వాసవ! చాలద యొనర్ప బ్రతుకున్ ప్రమదో ద్బాసితనందనముగ, నిక నాసింపగ నేలనయ్య యన్యము నాకున్!" అను నాతని యౌదార్యం బున కెంతో విస్మితుడయి భూమీకాంతుం డనె నీగతి ద్విగుణీకృత ఘనకరుణాభరితహృదయకమలుం డగుచున్. "నీ యౌదార్యము విస్మయావహము; నీకిచ్చ లేకుండినన్ శ్రేయోదాయకమౌట నీయుపద జేకొమ్ము వీరాగ్రణీ! నాయుల్లంబును దాన సంతసము నందున్ నవీనప్రరో హాయామంబగు క్షేత్రముం గనిన యాషాఢమేఘంబటుల్. శ్వేతపక్షంబునన్ స్థిరవర్ధమానుడౌ శీతాంశునిం గన్న క్షీరాబ్ధివోలె, ప్రత్యూషమందునన్ పరిభాసమానమౌ కాసారముం గన్న కమలాప్తుబోలె కేదారమందునన్ మేదురేధితమైన రాజనము గన్గొన్న రైతన్నవోలె ఆరామమందునన్ సారపుష్పితమైన మాకందముం గన్న మాధవునిబోలె ఉత్తమంబును, మత్ప్రదత్తంబునైన విస్తారపృథ్వికిన్ విభుడవీవగుచు ఏధనము చెందంగ నీక్షించి నేను మోదింప మదినెంతు నాదరముతోడ. అంతియేకాక వినుమయ్య యర్కతేజ! అర్హదత్తంబు గాకున్న యర్థమెల్ల వ్యర్థమగు గొల్లలై వని బరిఢవిల్లి హరిపదంబుల జేరని విరులయట్లు. ఆదియును గాకన్ మును నే సదసున జేసిన సమయము సందుష్టముగాదో? పదపడి నను దూఱరొ జను లదయుండు, కృతఘ్నుడంచు నాచంద్రార్కముగాన్? కావున రాజాజ్ఞగ నిది భావించి కొనందగునిక ప్రతిభాదిత్యా! ఈవిశ్వజనాళికి మన పావనసౌహృద మపూర్వపాఠము గాగన్!" అను ఱేని ఘనదిత్స నాత్మ సంభావించి హనుమప్పనాయకుం డాదానపత్రమున్ ఘనమోదకలితుడై గ్రహియించి కెంగేల గనుదమ్ములకు నద్దికొనె నంత నమ్రుడై. స్ఫారతరమైన యాసారసంప్రదాన కలన బూరించి సారసాకరవరంబు పారమెఱుగని తృప్తిచే బాండువైన నీరదంబును బోలె నా నృపతిచంద్రు, డట్లు నిండిన కాసారమట్లు దోచె నతులసమ్మోదభంగితంబైన యట్టి ఆ మహావీరతల్లజు నాత్మసరసి. మఱియు సేనాభిషక్కుల ద్వరితగతిని నటకు రావించి సోమధరాధిపుండు "వైద్యవరులార! సుశ్రుతప్రతిభులార! నన్నుగా నాత్మ భావించి నయమొనర్ప వలయు నీతని తనువున వ్రణములింక దూర్ణముగ" నంచు వారల నిర్ణయించె. ******