హనుమప్పనాయకుడు-చతుర్థాశ్వాసము ఒక కుత్సితుని దుర్మనోంతరస్థితమైన స్ఫారక్రుధానలప్రతిబింబమో నాగ కననయ్యె నవ్వేళ గాఢకాషాయప్ర భా భాసురంబైన పశ్చిమాశాముఖము. ఒక్క దుశ్శీలు వ్యూహంపుటురులయందు జిక్కికొనినట్టి సచ్ఛీలు చక్కి దోప సాంద్రభూరుహచ్ఛదసంధిసరణులందు అక్షిగోచరుడయ్యె లోకాప్తుడపుడు. హేతువింత లేకయె పరభూతలేంద్ర మండలము లాక్రమింపగ మత్సరించు నృపతి యూహల చాలుల నిభము లగుచు నీడలంతట నిడుదలై నేల బొల్చె. ఒక ధూర్తవర్తను మనోవిహాయసమందు ఉచ్ఛృంఖలములైన న్యూనభావనలట్లు దిరుగాడె గగనాన గరటాళి యవ్వేళ కఠినకాకారుతుల గలగించుచుం దెసల. భువనైకహితుడౌచు, పూర్ణతేజుండౌచు వెలుగొందు నినుడింక విధివైపరీత్యాన క్షతినందునని తెల్పు కార్తాంతికుల బోలి నింగిలో దిరుగాడె నీడోద్భవకులమ్ము. అంతలో వీచె మలయాగమశ్రీఖండ తరుకాండసంశ్లిష్యదాభీలకుండలీ సాంద్రకాకోలనిశ్వాసాగ్నిపాణింధ మంబైన దాక్షిణ్యమారుతప్రకరమ్ము. అట్టి వేళ సౌధకుట్టిమాంతరాన ఆప్తసచివుడొక్క డండనుండి కొల్వ అధికరోషభీషణారుణాస్య, నేత్ర యుగళుడౌచు జింతనుండె సయ్యదుండు. ఎఱతామరల గేరు నీక్షణంబులనుండి విస్ఫులింగంబులే వెలికి రాల, క్రౌర్యాగ్నితప్తమౌ కాయయష్టికయందు ఘర్మాంబుపూరంబు కాల్వగట్ట, నిటలవీథీనటత్కుటిలభ్రుకుటివల్లి కలు కాలఫణులట్లు గదలియాడ, గాఢదంతాగ్రసంఘట్టనోదితమైన పటపటాధ్వనులు దిక్తటుల నిండ, మొదట సోమభూపాలుతో నొదవియున్న ఆహవంబున సంప్రాప్తమైన యట్టి ఘనపరీభావపావకగ్రస్తమైన హృచ్ఛరీరుడై సయ్యదు మ్లేచ్ఛవిభుడు. హుక్కా త్రాగుచు, బొగచే నక్కజముగ నుంగరముల నమరించుచు, గై పెక్కగ మదిరం గ్రోలుచు, ముక్కున్విఱచుచు, నమాత్యముఖ్యుని గనుచున్. అనియెను, "భాయీ! తెనుగుం జనపతి బూదిం గలుపక క్షణమాత్రంబును నాకుం గునుకొదవదు; కానీ యది యొనగూడెడి యనువొకటియు మనసున కందకయుండెన్. నిన్నమొన్నటి దాక నెఱుగ మాతడెవండొ, కాని వాడే నేడు కంటిలో నలుసయ్యె, కొదమసింగము నేడు కోతికే లోనయ్యె, కలవారిలో నాకు దలవంపులే యయ్యె. అరెరే! అవ్వల్ దర్జా సరదారుడనయి, దురమున శత్రుంతపునై పరగిన నన్నే గవ్వకు గొఱగానీడయ్యె, వాని క్రొవ్వెంతటిదో? నన్నేమిటి? నాయనుగుల నపూర్వబలసం పన్నుల నిదరుం బసరుం బ్రాణమ్ములకై వెన్నిడి పాఱం గొట్టెను; ఉన్నదె మనుగడ ఉన్నతుడై వాడుండగ నుర్విన్ మనకున్. దురమున బలవర్తనచే బరివర్జ్యుడు గాకయున్న బలవద్రిపుకున్ పఱుపున జేరిన దర్వీ కరమునకున్ భేదమింత గలదా చెపుమా? కావున వాని న్నాశము గావింపగ నిచ్చలు మది గౌతుకమెంతున్, భావింపగ నది కూడెడు నేవిధి నూత్నాలఘుబలహేతులు లేమిన్? ఒనగూడునె బలమూరక? మునుపటి జంగున ఖజాన మొహరీదేఖిల్ మునుకొని ఖర్చుంజేసితి నెనినాళ్లకొ యంతపైస యేర్పడు నింకన్? కాని పైస లేదటంచు గాలయాపనంబు సేయ గచ్చులోని కంకరట్లు గట్టిపడును వాడు మిగుల కాన వానిజుట్టు నిపుడె కరమునందు బట్టవలెను, మూడుజగములందు వాని ముష్టినెత్త బంపవలెను." అనవుడు సచివుం డిట్లను "జనవర! మీకిట్లు బహువిచారంబేలా? మనమెఱుగమె ఆ సోముని ఘనతరమగు మేకపోతు గాంభీర్యంబున్? మున్నొదవిన విజయముచే నన్నెదురించెడు నరుడిక "నహినహి"యని తా నున్నాడట! కన్నుల గన కున్నాడట మిథ్యాధైర్యోన్నతికలనన్. ప్రథనార్హంబౌ శస్త్రాభ్యాసము పొంతం బోవక కాంతాసంగములందుం, గవిజనసంఘములందున్, పాషాణార్చలయందుం, బండితచర్చలయందున్, పుచ్చుచునున్నాడని వినవచ్చెనుగాదా కాలము! తొలిపౌరుష మెంచుచు మీసల మెలివెట్టిన దలకుటకై మనమంత యథాజాతులమా? అల కోతుల కిచకిచలకు దలకున దంతా వళకుంభస్థలరక్తపిపాసితమౌ హరి? కావున చింతన్వీడుము భూవర! దుర్దాంతనూత్నభుజదర్పమహా పావకశిఖలన్ సోమ క్ష్మావిభు విభవంబు బూదిసల్పుము త్రుటిలోన్. వరులగు సరదారులకుం బరమార్థంబౌగద! క్షణమాత్రంబున నూ ర్వురు తెలుగుల శీర్షమ్ముల దఱుగుట, ఈ సత్క్రియకిక దగులుము కడకన్. అత్యంతపావనంబగు నీ మహోద్యమము దుదిదాక నెఱవేర్ప దోడుగా వచ్చెదరు మనమిత్రులెందఱో మర్యాదతో నడిగి నంత మాత్రాన జతురంగములతో గూడి. దృక్సంజ్ఞమాత్రాన ద్విట్సంఘముల ధైర్య ముం డుల్చు నల నిజాముర్వరావిభుడు, శతమత్తగజములన్ క్షణములో బరిమార్ప గల లావు గలవాడు కర్నూలువిభుడు, ఆలమ్ములో వైరిజాలమ్ములను మక్షి కాభమ్ముగా జదుపు నాదోనివిభుడు, పరనాథయూథముల శిరములే బంతులుగ నెత్తి యాడెడివాడు గుత్తిపురవిభుడు, రాచవారలలోన రమణకెక్కినవాడు ప్రస్ఫీతశౌర్యుండు రాయచూర్విభుడు, కదనరంగమ్ములం దెదురెఱుంగనివాడు పంచాస్యతేజుండు ప్రాగటూర్విభుడు, వీర లాప్తులు; మనకెల్ల వేళలందు దోడురాగలవా రింక దొట్రుపడక వారి వేడుము; కయ్యంపువహ్ని కింధ నమ్ము గావింపు మా సోమనాద్రివిభుని. గండుమీఱెడు మీ యఖండసైన్యము గాంచి గండుపిల్లిని గాంచి కలుగులోపల దూఱు చుండెలుక చందాన సోమభూపాలుండు కండకావర ముడిగి కాళ్లపై బడిపోవు." అను సచివు నుద్బోధ అమృతోపమంబౌచు శ్రుతిపర్వ మొనరింప, ప్రతినవాభీల శౌ ర్యాంకురము లాక్షణమె ఆత్మలో నిండార, ఆరూఢధైర్యుడై యనె సయ్యదుండిట్లు. "నీవంటి సచివుడొదవిన క్ష్మావిభునకు గూడు గాఢసంతతవిజయ శ్రీవాల్లభ్యము; మిత్రమ! నీవలనం దీఱెనయ్య నెవ్వగ నాకున్. వాచాతీతము నీ మనీష, వంద్యంబు నీ జ్ఞానమున్, నీచే నాయెద నింతదాక నిద్రాణమైయున్న శౌ ర్యాచారంబు ప్రబోధమొందె, ఆస్కంధనోత్సాహపున్ వైచిత్రిం దగు నాదుమేన బాటిల్లె రోమాంచముల్. కోశాగారము గుల్లవాఱినను, ఘోరాపదల్గూడినన్, రాశీభూతములౌచు యోద్ధల పురంబుల్ధరం గూలినన్, దేశంబెల్లను రక్తవాహినుల దేలించి యుద్ధంబునన్ నాశంబేనొనరింతు సోమనను నవ్యోరుదర్పంబునన్. కాలవ్యాళము కరణిన్నాకర వాలము సోమనవాహిని నంపును కాలుని వీటికి; గబ్బిలములె యిక పాలించును గద్వాలపురంబును. దారుణమగు నీ మారణహోమంబున్ పారము ముట్టింపగ హుతవాహునికిం గాడుపువోలెం దోడుగ రమ్మనుచున్ వేడెద నిజాము పృథ్వీవరు నింకన్. ప్రవిశాలదక్షిణాపథభూమి నెవ్వాడు ఏకాతపత్త్రముగ నేలుచుండు, సకలమండలనాథమకుటకాంతులతోడ నెవ్వాని దర్బారు లింపుమీరు, శతలక్షహర్యక్షసములైన భటులతో నెవ్వాని పరివార మేపుమీరు, అవిధేయసామంతపవియౌచు నెవ్వాడు క్షణములో రాజ్యమ్ము జక్కసేయు, అతడు హైదరాబాదురాజ్యాధిపుండు పావనాసఫ్జహీవంశవార్ధివిధుడు అఖిలశాత్రవవదనముద్రావతార చండశాసనుండు నిజాముచక్రవర్తి. పెట్టనికోటగ నిజాము పృథ్వీశుండే నా పట్టున గలడను వార్తయె పవియై తనచెవికిం బట్టిన క్షణమందే గద్వాలేశుడు గుండెల్ ఫట్టున బగులం జచ్చును; భండన మింకేలా?" అని రోషాటోపప్రకటభ్రుకుటీనాట్యాంచితఫాలుండై, ఘనరక్తాతపశోభితలోచనజితరక్తాంభోజాతుండై, వినివర్తిత, సంఘూర్ణితవదనుండై, తోడనె శిబికావహులం బనిచెన్ వేకువ బల్లకి దేగన్ హైద్రాబాదునకుం జనగన్. ఉన్మనుండైయున్న ఉప్పేడుభూజాని మనమందు నెలకొన్న మాలిన్యముంబోలె వ్యాపించె కజ్జలం బారవోసినయట్లు పూర్ణమై తమమంత భూనభమ్ములయందు. మాటిమాటికి వాని మనమందు మెఱయు ఆంధ్రావనీనాథహరణేచ్ఛవోలె నడిమింట జెలువారు నక్షత్రరాశి మిన్కుమిన్కున గ్రొత్తమెఱుగులం జిల్కె. వక్రోహావశుడై నిజాము చక్రేశుం జూడగబోయెన్ సయ్యదుమియ్యా యని చారులు చయ్యన దెలుపన్, సోమనయున్. అతులస్థైర్యాకృతియై మతి నా వార్తార్థనిరూపణ మొనరిచి, ఆ ప్తామాత్యుల, సేనాధీశుల, రా బనిచి నిగూఢసభాస్థలమునకున్. మెలమెల్ల గొనగోట మీసాల మెలివెట్టుచున్ కళవళము కఱవైన గంభీరకంఠమ్మునన్ నలసోమనాద్రీశు డలఘుధైర్యాద్రీశుడై పలికె నిట్టుల సచివవాహినీశుల గాంచుచున్. "తీరని పగబూనిన కా లోరగముంబలె నవిరళయుద్ధోత్సుకతా దారదవశుడై సయ్యదు కోరగనేగెను నిజాముకులపతి తోడున్. అని తెలియగవచ్చెంగద! వినతాసూనూపమఘనవిక్రములారా! కనుగొనవలె నాతని కా టునకుం దగు విఱుగుడు నిపు డూర్జితఫణితిన్. తతసైన్యావష్టంభము కతనన్ రిపులకు సం తతసింహస్వప్నంబై తగు నైజాముధరా పతి యిత్తఱి దోడగుటం బ్రథనంబున నాతం డతిదుర్జేయుండగు, నాకతమున మనమింకన్. ఇప్పటికె ఉక్కుపిడుగుల చొప్పు నడరు మనదు భటయూథముల నవ్యమహితశిక్ష ణావసరమున నొనరింపగావలయు న ధర్షణీయస్వరూత్కరాదర్శములుగ. అనువగు శస్త్రాస్త్రంబుల, నాహారపదార్థంబుల, ఘనఘోటకదంతావళగణముల, ఘోరశతఘ్నీ దళముల, పశుమానుషవైద్యప్రవరుల దగి యుద్వే లంబగు పర్వోదధి బోలంగల్గిన వీరానీ కము నడిపింపన్వలె, నరికట్టన్వలె మ్లేచ్ఛాతి క్రమణం బాసాంతము దోర్గర్వంబు తలిర్పంగన్. మాతృభూరక్షణంబున మందుడైన యట్టివాడెపో భార మీయవని కరయ, కావు మృగములు; కావు నగములు; కావు సింధువులు; కావు భారము సింధురములు! స్వల్పసౌఖ్యంబు లాశించి జన్మధాత్రి బరుల కర్పించి లభియించె పాయసాన్న మనుచు దనివొందు తనయుల గనుటకంటె తెనుగుతల్లికి గొడ్రాలితనమె మేలు! ఈ కదనంబున విజయ శ్రీకరపీడనమున నలరితిమా! గద్వా లాకమలకు నైదువతన మాకల్పాంతం బొదవును; అదె విఘటింపన్. కాదొక గద్వాలయె, తుర్కల యాక్రాంతిన్ బూదియగున్ సర్వాంధ్రము; పూర్ణాంధ్రాభ్యుద యోదధి యింకున్ ధర్మచ్యుత తద్దుష్ప్రభు తాదుర్దాంతనిదాఘోత్తప్తం బగుచున్. కావున వీరగ్రామణులారా! కట్టుడు నడుముం గదనంబునకున్, చేపట్టుడు జయసింధుజకరమున్, నిలువంబెట్టుడు తెలుగుల యశమున్." అను సోమక్షితిపతి ముఖజనితాద్భుతవాక్యార్థంబుల్ మనముల పౌరుషమదిర న్నినుచగ, సచివచమూనాథుల్ నినిచిరి భవనాంతరము "న్నిక్కము! సోమధరాధిప! మా జననం బాంధ్రీసేవకె, జన్యంబున రిపురక్తముతో ఘనతర్పణమొనరింతుము కాలున" కను వీరాలాపముతోన్. పదిలంపు గెరటాలు కదలియాడగ గొంత సదమలస్వాంతముల చాయలో యనమీరు కొదమరాయంచలకు గూర్మిసదనంబౌచు బొదలాడె నవ్వేళ భువి దుంగభద్రమ్మ. ఎందుకో కనుపించె నీనాడు తుంగమ్మ అతిలోకనైర్మల్యవతి యౌచు జిత్రముగ ఒక మహాత్ముని భవ్యసుకుమారభావనల దలపించు స్వాదుజలలలితోర్మికలతోడ! కాని పాఱదొ మున్ను నానారణస్యన్న వీరోష్ణరక్తఝరధారలం బెంపారి మఱచెనో, లేకున్న వెఱచునో తెలుపంగ ఆ ఘోరయుద్ధేతిహాసమ్ములన్నేడు? ఆ తుంగభద్రాపగాతటంబున గల్గు నిడుదూరు గ్రామాన నేల యీనిన యట్లు కననయ్యె గజవాజిఘనపత్తిగణయుతము మ్లేచ్ఛసైన్యం బతిరణేచ్ఛాసమాగతము. దండధరునైన దోర్దండతేజఃస్ఫూర్తి దండింపగల వీరమండలుల గూడి, కులశైలములనైన కుంభాగ్రఘట్టనం బున గూల్పగల ఘనాఘనములం గూడి, చక్రవాతమునైన స్యదచంక్రమణదీప్తి వమ్ముసేయగజాలు వార్వముల గూడి, చట్టుబండలనైన క్షణములో బొడిగొట్ట గల శతఘ్నీయంత్రదళములం గూడి, తుర్కసేనలు నిల్చె దుంగభద్రాపగా దక్షిణతటంబందు, దద్విక్రమాగ్నిసం గతధూమపటలంబు గతినొప్పె ప్రాంతీయ శతపత్త్రనిర్యాతషట్పదవ్రాతమ్ము. ఉక్కుపిడుగులబోలు పెక్కు పోటరులతో హైదరాబాదునగరాధిపుండు, వార్ధులింకగజేయు పౌరుషాగ్నిం గ్రాలు మగలతో గర్నూలు మహిభుజుండు, యమకింకరులబోలు నతిభీదభటయూథ కలితుడై గుత్తిదుర్గాధిపుండు, చండభండనకళాపాండిత్యమున దేలు దండుతో నాదోని ధాత్రిపుండు, ఉద్వేలమగు నాహవోత్సాహమున గ్రొవ్వు ధ్వజినితో బళ్లారి వల్లభుండు, తొలి పరీభావముం దొలగించుకొన గోరి పరితోడ రాయచూర్పురవిభుండు, ఈతూరి జయలక్ష్మి చేతికిం జిక్కునని పెనుబారుతో నిదరు జనవిభుండు, తోడుగావచ్చి విడిసి రుప్పేడుపతికి తుంగభద్రకు దక్షిణోత్సంగమందు గ్రాలు నిడుదూరు గ్రామాంతికమ్మునందు ఏధమానజిగీషాత్తహృదయు లగుచు. ఆ తుర్కసైన్యంబు కభిముఖంబౌచు కలుగొట్ల యను పల్లికాంతికమునందు విడిసె నలసోమపృథ్వీశు వాహినులు తుర్కరక్తపు దృష్ణతో నాల్కలెండ. తాళద్రుసంకాశతతదీర్ఘగాత్రుండు, దుర్గారరోపమస్థూలవక్షుండు, వ్యాయామవర్ధితవరమాంసలాంసుండు, ఆజానులంబమానాంచితభుజుండు, షట్పదశ్యామలశ్మశ్రురుచిరాస్యుండు, సంస్నిగ్ధదృఢపీనజంఘాద్వయుండు, అవిదార్యవర్మావృతాఖిలశరీరుండు, వరశిరస్త్రాణగోపాయితశిరుండు, పాణికీలితశాతాసిపన్నగుండు, ఊర్జితార్జునాశ్వాధిరోహుండు నగుచు ఆజ్ఞలొసగుచు నాత్మసైన్యాధిపులకు కాననయ్యెను సోమన్న సేనమొదట. ఆ తెన్గుసైన్యంబునందు గననయ్యె, హనుమప్పనాయకుం డతులతేజుండు, పదివేల తారకల బ్రతిభాసియైన పూర్ణిమాచంద్రముని పొల్పు నింపారి. మసకచీకటిలోనె అసమానతేజుండు నలసోమనాథుండు బలసంయుతుండౌచు తుంగభద్రం దాటి, తొలిప్రొద్దు వెలుగులో ప్రళయరుద్రుని లీల బడె వైరిబలముపై. మెఱపులజడివలె నాక స్మికముగ బైబడిన విప క్షానీకాక్షీణద్రవి ణాగ్నింబడి మ్రందిరి యెం దఱొ మ్లేచ్ఛానీకపు సర దారులు శలభములటులన్. ఎక్కడ జూచిన దానై ఉక్కడగించుచు విరోధియోధాగ్రణులన్ గ్రక్కున రిపుబలముల న ల్దిక్కులనుండియు నెదిర్చి తేకువ బోరన్ తన బలముల గొనకొల్పుచు ఘనజవనాంచితము స్వీయగంధర్వవరం బును నవగతులం దేల్చుచు నని విహరించెను తెనుగుధరాధిపు డంతన్. పౌరుషంబును, దేశభక్తియు, నపార ధర్మనిరతియు, బట్టుదలయు, నూత్నాయు ధంబులై పరగ, ద్విషదంగయష్టికల సమిధలుగ నొనరించి, సమరాంగణంపు స్థండిలమున నపూర్వసంహనన మఖస మారంభమున దేలె నాంధ్రావనీంద్ర యోధవర్యాధ్వర్యుయూథమ్ము లంత. దివిలోన దినరాజు తీక్ష్ణకరకాంతి అత్యుగ్రమై తోచెనహమెక్కు కొలది; భువిలోన గద్వాలభూపవిక్రాంతి అత్యుగ్రమై తోచెనహమెక్కు కొలది. దివిలోన దినరాజు తీక్ష్ణాంశుజాలమ్ము లింకించె వాహినుల నేపారు నీరమ్ము; భువిలోన గద్వాలభూపభటజాలమ్ము లింకించె వాహినుల నేపారు బీరమ్ము. అతిఘాతుకద్విపప్రతతు లాప్లవమాన కాలాభ్రముల లీల గదలియాడ, విస్ఫురత్ చండాసివిహ్వలాకారముల్ సంచలన్మీనసంచయము బోల, రయచంక్రమణదీప్తి రంజిల్లు హయహేష లతితీవ్రకల్లోలరుతుల బోల, అతిసంక్షుభితపద్గవితతు లత్యుగ్రఝం ఝాలగ్నయానపాత్రాళి బోల, అహమహమికాప్తి గవియు యోధాళి రోష విస్ఫురణ తీవ్రబడబాగ్నివిధము దోప, సారవాహినీసంగమస్ఫాతి గాంచి పొంగు సంద్రము బోలె యుద్ధాంగణంబు. ఖణఖణాయని సాంద్రనినదమ్ముతో దాకు నిస్త్రింశములనుండి నిప్పుకలు రాల, మాటిమాటికి బిట్టు మందుగుండ్లం గ్రక్కు నురుశతఘ్నులధాటి కుర్వి నెఱెవార, కుండలీకృతదీర్ఘకోదండకాండము ల వారితంబుగ శరాసారంబు గురియ, దొమ్మియుద్ధంబులం జిమ్మిరేగెడు సింహ రావమ్ముతో దెసలు వ్రయ్యలైపోవ, అతిభయంకరవారణాంచితభటాళి కరకీలితాసిరుగ్జాలంబు లగ్ని పర్వతోత్సృష్టతీవ్రార్చులం బోల, దుర్దాంతకల్పాంతధూనభువనంబు చందమై తోచె నా సమరాంగణంబు. సంచలత్ఖురచతుష్కసముత్థితోత్కట క్షోదంబు సూర్యునకు గూడుగట్ట, సంస్పందమాననాసానిర్గతోచ్ఛ్వాస కశ్రేణి కడ సుళ్ల గలుగజేయ, క్వణమానకమ్ప్రకవికాకర్షణోత్కర్ష సృక్వాంతఫేనంబు జిట్లజేయ, చలదున్నమితవాలచామరము భావిజయ సింధుజాతకు బట్టు సిడెము గాగ, ఆహవానుకూలంబుగా నగ్రగామి, పార్శ్వగామి, తిరోగామి, వక్రగామి, చక్రగామియైచరియించె జన్యభూమి నాంధ్రరాడశ్వ మతికౌశలాఢ్య మగుచు. ఆయుత్తమాశ్వంబు నధిరోహమొనరించి ఉచ్చైశ్రవంబును వియచ్చరులపతి యట్లు దుర్దాంతవిక్రాంతి ద్రుంచె నాంధ్రేశుండు మ్లేచ్ఛశీర్షమ్ములన్ మేల్బంతిగములట్లు. తొల్లి శ్రీరామునకు దోడైన హనుమదాదుల బోలి అండయై పోరి రాంధ్రావనీపతి కాహవమునందు అస్ఖలితశౌర్యులై, అరికంఠలుంఠనప్రవణులై హనుమప్పనాయకాద్యఖిలసేనానాయకోత్తములు. ఒక్కొక తెలుంగువీరుడె దిక్కులు వ్రక్కలు పొనర్చు తీక్ష్ణాక్రందనతో నుక్కుం జేరిచి, పదుగుర నుక్కడగించుచు జరించె యుద్ధాంగణమందున్. ఇట్లాభీలంబగు నని పెట్లకు నోర్వక నితాంతవిహ్వలమతులై ఎట్లో బ్రతికిన బాగని చిట్లగ నాయత్తులైన స్వీయభటాళుల్. అల్లా! అల్లా! యని పెల్లార్చుచు నైజామువిభుండంతన్ భల్లూకపుబూన్కితోడ వారల కాతరహృదయమ్ములలో బెల్లగు నూతనధృతి సంధిల్లంజేయగ జూచెం గానీ పొల్లయ్యెను తద్యత్నము; పొంగెను ద్రావితసాగరమింకన్. ధారుణి నని వెనుజూపిన వారి, నధఃపాతుకమగు ప్రస్రవణంబున్, వారిధిభంగమ్ముల నె వ్వారికి మఱలింపగనగు బలవంతముగన్. జలజాప్తు డంతలో జరమాద్రి జేరె, కలగి పాఱెడు మ్లేచ్ఛబలములంబోలె గులకులం గూయుచుం బులుగుమొత్తాలు చలియింపగాసాగె సకలాశలందు. పవలెల్ల బవరాన బగతురం బరిమార్చి తత్తనుస్రుతశోణితార్ద్రాంగుడై సంధ్య నిలుజేరు సోమన్న యెఱుపారు మూర్తియటు లరుణాభ నలరారె జరమార్కబింబమ్ము. ****** పొనరిన యోటమికిం గా రణములు వెదకగ, భటనికరము హృదయములన్ ననిపించగ నవధృతి, ఱే పొనరెడు నని గెల్చెడు వెరవుల నెమకంగాన్ తత్తరమున నా నిశి దళు కొత్తు జయేచ్ఛన్ నిజాముకులనాథుడు యో ధోత్తములన్, సేనాపతి సత్తములం బిల్చి చేసె సభ నొక దానిన్. ఆసభలో స్వీయపరాభూతికి గొందఱు వే సూచించిరి వివిధములౌ కారణముల్, అసలవి మృషలని అన్యులు వేరే మిషలన్ వెస నిర్ధారింప సమీక్షించిరి వరుసన్. ఖండించుచు నొండురులన్ వా గ్భండనమున దేలు వీరవర్గముతోడన్ నిండిన యాసభ దినమందలి భండనరంగమ్మునకుం బ్రతియై తోచెన్. కనుగొన నందఱి వాదములన్ వినవచ్చెను సోమధరావిభువీతియె యా తని విక్రాంతికి నాధారం బనియెడు నిర్ణయమే తుద కాశ్చర్యముగన్. ఆ కులీనాశ్వసంస్థితు డైన యాంధ్ర విభునితో దాను బవలెల్ల విగ్రహించి యుంట నైజాము వెంటనే యొప్పికొనియె వీతియే సకలానర్థహేతు వనుచు. అల చదరంగమునం దల్పాశ్వముచేతన్ బలిమిన్ బంధనమందిన ప్రభువువిధంబున్ దలపింపగ దనగతి నవదర్పోద్ధతుడై పలికెన్ నైజాము ధరాపతి యీపగిదిన్. చోద్యముగాదా యిది! అనవద్యప్రతాపవైశ్వానరు, లుద్యద్వైరివరూథిన్యుద్యానప్లోషకు, లాహవ విద్యాపారగు, లస్మద్వీరోత్తము లొక యల్పునిచే నాద్యంతం బోడుట! ఈ యవమతి నెట్లోర్తుము మదిలోన్. అల్లాపేరిట యావద్భారతధరయం దే యెల్లల్లేని మహేస్లామికరాజ్యంబున్ సం ధిల్లంజేయగ దివిరెడు మా దృఢయత్నంబుల్ పొల్లైపోవున? పొందద విజయేందిర మనలన్? ఆతండొక క్షుద్రావనిపాలుం, డల్పుం, డాతని ద్రుంపగ నరుదెంచినదకటా ! యీ యాతతతౌరుష్కానీకిని; యిక బిబ్బీ మూతుల మీసలు మొలువంగావలెనేమో! పగతుర బరిమార్పగలేకుండిన యీ జిగిఖడ్గము, లీ మగపుట్టుక లేలా? మగలై పుట్టుట మగువల పొందునకో తగ గదనోర్విం దనులర్పించుటకో? ప్రత్యయమున్ ఘటించి పరిపూతుం డల్లాపై వ్యత్యయముల్దరించి పరిపంథీశాశ్వంబున్ ప్రత్యుషమొందులోగ వడిదేగా నొక్కండున్ ప్రత్యయితుండు లేడ? పరికింపంగా మీలోన్? లేరా శాత్రవలక్ష్మీహారకు లీసభలో, తే లేరా తజ్జయలక్ష్మీకారకమగు హయమున్, కొన లేరా యీ వీరాసిన్ శ్రీదోపదగన్, మనగన్ లేరా శాశ్వతకీర్త్యాకారములూని ధరిత్రిన్? అను నైజాము వచోధోరణి నాలించిరి; కానీ కదలక మెదలక కతిపయమాత్రలు వీరా గ్రణు లటులే కూర్చుండిరి ప్రతిమలయటులన్ మనముల సాధ్యాసాధ్యములను దర్కించుచొకింతన్. ఎంత పోటరియైన నొక్కింత మదిని దర్కమొనరింపవలెగదా! దర్పమెలర శేషఫణముపై మణి బొంద జేయి సాచు ముందు, పులినోటిలో మూర్ధముంచు ముందు. అపుడొక సరదారుడు, హేమాద్రిస్థైర్యుడు నిపుణత వీరోచితవిధి నిస్త్రింశమునకు నృపతికి వంగి సలామొనరించి గ్రహించెన్ చపలాభంబగు తదసిన్ శయకంజమునన్. అంతలో నతని విక్రాంతి కత్యంతవి భ్రాంతులై చూచు సభ్యాళి జయరావముల్ మ్రోగె, అంతలో నావీరు నౌపవాహ్యాంచితఖు రాంతసంజనితరుతు లలనల్ల ప్రాంతమున మ్రోగె. జిగిమీఱి వెలుగొంద జెడునేమొ కార్యమని పొగమబ్బులం డాగి తగుమాత్ర వెలుగొందె తొగరాయ డారేయి; అగుగదా తుర్కలకు మొగసాల గల వేల్పు మృగలాంఛనుం డరయ! తననాథు ఖడ్గంబు తునుకలై పడినట్టు లొక కరాళస్వప్న మొదవంగ మేల్కాంచి సంత్రాసవిహ్వలస్వాంతయై యారాత్రి దిక్కులం బరికించె బిక్కుబిక్కున నాంధ్ర మహికాంతు ప్రియరాజ్ఞి మది గీడు నూహించి. అత్యంతశుభలక్షణాన్వితంబైన అర్జునాశ్వంబుపై నంబరపథాన విభునితో గూడి తావిహరించినట్లు కలగాంచి, మేల్కాంచి, కలయంగ జూచె మిన్కుమిన్కున మింట మెఱయు తారకల నైజాముదేవేరి నడురేయిలోన. పావనుండైన నైజాముపాదుసాహి తనదు విభునకు మండలాధ్యక్షపదము గూర్మి నర్పించి సత్కృతి గూర్చినట్లు, తచ్ఛుభావసరంబున దనకు బ్రియుడు కమ్రమణివిభాసురహేమకంఠహార మొకటి ప్రియమార నర్పించియున్నయట్లు కలను బొడగాంచి మేల్కాంచి గళము దడిమి కొనియె నారేయి నావీరు కూర్మిపత్ని. ******