హనుమప్పనాయకుడు-తృతీయాశ్వాసము అతిభయంకరతురుష్కాధిపత్యమువోలె నాతతంబయ్యె నపు డాంధ్రదేశమునందు వీతసుఖు లాతురితచేతస్కులై జనులు సీతువున గంపింప శిశిరర్తుసమయంబు. దారుణతురుష్కధాటీ దారితదేవాయతనవిధంబున దనువుల్ సారపు బగుళ్లు సూపెను తోరంబగు శిశిరధాటి త్రోవగరామిన్. యవనధాటులు మాంగల్య మపహరింప గ్రిందువడియున్న యాంధ్రరాజ్యేందిరాస్య రీతి నూర్జితహిమపాతఘాతి జెలువు దక్కి స్రుక్కెను గొలకులం దమ్మిపూలు. వాలాయముగ నాల వధియించు యవనాళి కులదైవముం గూడు కొఱకేమొ తపనుండు చల్లబడి పరువెత్త సన్నబడె పవలౌర! చెల్లునా లోకాప్తచిహ్న మీదృశునకున్? కాంతతరమౌ శరత్కాలమ్ము నెడలించి ఈ సీతు వేలకో యిల నించినావు? మందిరమ్మును గూల్చి మస్జీదు నిల్పినటు నీలీల విధి! చాల నిష్ఠురము గాద! అని త్రస్తాంతరులై, శీ తానిల సంస్పర్శనసం స్తంభితతనులై, జనులం దఱు విధి దూరిరి; పీడా ర్తులు శ్రమ మీగతి మఱవం దలచుట పరిపాటియె గద! ఉత్కటమగు శైత్యోద్ధతి నుత్పాటింపగ కొయ్యల బేరిచి జనములు గూర్చిన మంటలు యవనౌద్ధత్యము బాపగ నాంధ్రుల మనముల గెరలెడు పౌరుషరేఖాకీలల బోలెను. ఘోరయవనాధికారంబు గూలద్రోసి ధర్మసంస్థాపనము సేయు మర్మమిదియె యనుచు గూఢలిపి దెనుంగుజనుల కజుడు వ్రాసి పంపిన జాబులో వ్రాలు నాగ శాద్వలంబుల హిమబిందుసంఘ మొనరె. అదియె సందేశ మాత్మలో హత్తుకొనగ ఆంధ్రు లుప్పొంగి యవనాళి నవల ద్రోలి ఆంధ్రికిం బట్టముం గట్టునట్టివేళ జలజలం గురిసిన పైడిజల్లువోలె బంతిపువుల డాల్గ్రాలె హైమంతవేళ. తెనుగుతల్లి వైభవంబు తిరిగి నిలుచునట్టివేళ సమయమాగధుండు సంతసమ్ము నిలువబట్టలేక ప్రస్తుతింప బట్టినట్టి పసిడిబావుటాలె సుమ్ము పల్లెసీమలందు బరగు పచ్చగుమ్మడివిరిదిమ్ము! ఆంధ్రభూరమ పాపట నందగిల్లు కమ్రకుంకుమరేఖికాకాంతివోలె పల్లెసీమలయందెల్ల బరిఢవిల్లె మిరపపండుల నవకంపు మిసిమిపిండు. పండి, ఖండితమైన పంటకొయ్యలు మగుడ నిండె నిగురుల నంత నీహారమున దోగి ఖండితములే యయ్యు నిండారు విజిగీష వెండి మొలచిన యాంధ్రవీర్యాంకురములట్లు. ఇరుల బోలిన నెఱనీలికురులలోన తారలటు బంతి,చేమంతి తలిరులూన్చి కలువకన్నులు, నవులవెన్నెలలు జెలగ రేలు రచియించి రిలను బూర్ణేందుముఖులు! స్వర్వేణితుల్యమ్ము, సర్వౌఘతరణమ్ము, సర్వాంధ్రజనసౌఖ్యసంధానకరణమ్ము, మహితాంధ్రమండలీమంజులౌఢ్యాణమ్ము, వడిఁ బాఱె నవ్వేళ వాఃపూర్ణ కృష్ణమ్మ. ప్రథమకవి నన్నయ్యభట్టకృతభారతాం తరసుప్రసాదగుణభరితాంతరముతోడ, ఆంధ్రకవిసార్వభౌమాऽరచితబహుకావ్య మాధుర్యగుణధుర్యమధురాంబువులతోడ, సహజపండితకావ్యసరణిమండితపద క్రేంకారసంకీర్ణకీలాలరుతితోడ, అష్టదిగ్గజయూథపాప్సరోనాయికా భ్రూనర్తనోపమాంభోనర్తనముతోడ, లలితవర్తులధవళసైకతశ్రోణి, పరమహంసమోక్షపద్ధతినిశ్శ్రేణి, ప్రాక్పయోధిరాజు పట్టపుదొరసాని, నయనపర్వమయ్యె నపుడు కృష్ణవేణి. శమనస్వసాతటీసరసకేళీలోల వాసుదేవాసక్తవల్లవీతనులుఠత్ శ్వేతచేలాంచలము లా తన్వి వీచికలు నందనారామచందనతరుచ్ఛాయా కందుకక్రీడాత్తబృందారకాంగనా బృందిష్ఠపదకటకబృంహితము లా రొదలు ఉప్పొంగు కృష్ణమ్మ యూర్మికల బెల్లుబుకు విస్మృతాంధ్రక్ష్మాపవిభవచరితంబులే, పెల్లడరు కృష్ణమ్మ వెల్లువల రొదలోన వినిపించు దదనూనవిక్రాంతిగీతులే. ఆ వీచికల గాంచి ఆపులకితాంగుడౌ బధిరుడైనన్, ఆ రొదల నాలించి ఆపులకితాంగుడౌ నంధుడైనన్. భరతనాట్యాచలత్ భామినీశ్రోణితట నటదతులపటుదీర్ఘకుటిలవేణికవోలె స్ఫుటమయ్యె బులినాల స్ఫటివోలె జుట్టుచుం బాఱు నావ్వాహినీభవ్యతరవేణికలు. ఆమె పావనవారి అభిషేక మొనరించె నో యెన్ని అవనీశ్వరోత్తమాంగమ్ములన్, ఐక్యమై పాఱెనో ఆమెజల మెన్నెన్ని రణరంగసంస్యన్నరక్తభంగమ్ములన్? ఆమె యెఱుగనియట్టి యాంధ్రచారిత్రమే లేదు; ఆమె అరయగలేని ఆంధ్రభవితవ్యమే లేదు. అరుణోదయాదీప్తమగు నామె జలరాశి పూర్వాంధ్రవైభవస్ఫూర్తికే యంజనము; అహరంతపరిదీప్తమగు నామె జలరాశి భావ్యాంధ్రవైభవప్రగతికే దర్పణము! శ్రీమంతంబగు నాంధ్రీసీమంతినికిన్ ముక్తా దామంబగు నన్నదికిం దరళంబై తగు నొక్క పు రీంద్రము; నలసోమనభూమీంద్రుని రాజ్యేందిరకున్ జాంద్రీహర్మ్యము; సుకళాకేంద్రము; గద్వాలాఖ్యము. కందళితాద్భుతధృతితోన్ ముందట నొదవిన వనంబు మురికొని గట్టెన్ బృందారకపురి చందము సుందరముగ నప్పురంబు సోమన యెంతేన్. సురుచిరమగు నప్పురి గని పిరిగొను నీర్ష్యన్ మనంబు పెడదారి బడన్ సరదారుడు సయ్యదు, భూ వరు డుప్పేడుకు, సమీకపర్యుత్సుకుడై. మాదీ సర్కారనియును మాదీ సూబా యనియును మదమత్సరుడై వే దార్కొనె మ్లేచ్ఛు డస హ్యోదారస్థేము దెన్గు నుర్వీనాథున్. అంధుతోక నంటి చనెడు నధికఖలులు గంధయుతులు, భాఢక్రౌర్యకలితమతులు రాయచూరి బసరుజంగు నాయకుండు, ప్రాగటూరి యిదరుసాబు పాలకుండు వాని గూడవచ్చి రధికబలము కలిమి. ఉప్పెనవలె నిల గ్రమ్మిన ఉప్పేడీశ్వరచమూత్కరోత్సాహంబున్ చప్పున ధూళిం గల్పిరి అప్పురి తెన్గు లరిహరిణహర్యక్షములై. ఉద్దామస్థేముడు సోమోర్వీశుడు భారతసం పద్దస్యుల, దుర్ధిషణావశ్యుల, మ్లేచ్ఛుల నిజసం యద్దర్పాగ్నికి వైళమె అర్పణసేయన్, "భాయీ! వద్దిక యుద్ధము, బ్రతికిన బాగ"ని పాఱిరి వారల్. వెన్నుజూపి సయ్యదుండు వేడె "నన్ను గావు"మనుచు, పరుగుదీసె బసరుజంగు "బ్రతికియున్న జాలు"ననుచు, తోకముడిచె నిదరుసాబు "తోడు నాకు దేవు"డనుచు, ఇంటిముఖము పట్టె వారి వెంటనున్న సైన్య మెపుడొ! "ఆంధ్రనృపచంద్రు శౌర్యంబు నలతి జేసి క్షణములోపల నిర్జింతుమనుచు దలచి భంగపడి పాఱితిమి యెట్లొ బ్రతుకుకొఱకు కొఱవితోడను తలగోకికొంటి మకట!" అని రోషారుణవదనుడు ఘనలజ్జార్తుడు, పరిభవకాతరుడై, ఏ యనువున శాంతిం గానక కనుచున్ సయ్యదు తురుష్కగణముల నంతన్. "ఎరియించెను ప్రాణము నీ పరిభవ"మని యఱచె, బండ్లు పటపట గొఱికెన్, పరిపరివిధముల దెనుగుం ధరనాయకు గ్రిందుసేయు దారులు వెదకెన్. కానీ వారాతనివలె ఘనరోషాంధులు గానందున బల్కిరి,"ఈ కాఱుల ఫలితము గూడునె? యిప్పుడె కాదా కుడిచితి మాంధ్రధ రాధిపు దఱటులయామెత లఱ్ఱులదాకన్. శాంతింపుము సయ్యదు! నీ సొంతమె యీధర? తెనుంగు క్షోణీపతితో వంతుగ నేలుము;" అని వా రెంతో యత్నించి రతని కితముం దెలుపన్. కాని యానుడు లతని కప్రియములయ్యె. పైత్యదోషార్తునకు బంచదారయుబోలె అతని మనమందు గుందట్టులే నిల్చె నిర్వాతదేశమున నీలమేఘమువోలె. ****** ఇట్లు మ్లేచ్ఛుల నిర్జించి యింద్రసముడు సోమభూజాని గద్వాల క్షోణిలోన నింద్రపురిరీతి గావింప నిచ్చగించి బహుళనవసౌధనిర్మాణపరతుడయ్యె. నాటికె శత్రుగణాభేద్యంబగు కోటకు మఱిన్ని క్రొత్తళములు గూర్చెన్, ఘోటకశాలలు, కుంజరశాలలు నీటుగ మఱిన్ని వీట న్నెలకొల్పెన్. ప్రవిశాలంబగు బాటల కిరుగడ పువుగుత్తుల తరువుల నాటించెను; నవకపుదోటల, నాట్యాలయముల బ్రవిభూషించెను పట్టణమెల్లను. పశువులశాలలు, వర్తకశాలలు, శిశువులశాలలు, శిక్షణశాలలు, విశాలసుందరవిద్యాశాలలు, ప్రశస్తముగ నగరంబున నిల్పెను. పదివేలనాలుకల వదరుబోతైన నా గేంద్రతల్పమున శయనించు నెటులు? పదియార్వెయిల స్త్రీల బంధమ్ములం జిక్కి ఆవంతయున్ శాంతి నందు నెటులు? ముక్కోటిదేవతల యిక్కట్టులం బాపు తలనొప్పి నిచ్చలుం దాళు నెటులు? ఒకమాటకు న్నాల్గు మొకముల న్వడ్డించు సుతునిపంచను జేరి బ్రతుకు నెటులు? అకట! అనువైన యిల్లొకటైన లేక శాంతి కొఱవడె కేశవస్వామి కనుచు సకలసౌఖ్యదమగు దేవసద్మ మొకటి నగరి నిర్మించి, కేశవు నందు నిలిపె. ఉదయాది విప్రోక్తమృదుమధురవైతాళి కస్తోత్రరసలహరికం దోగి లేచు, ఉదయమధ్యంబునందొదవు కోవిదశాస్త్ర చర్చ లాకర్ణించి సమ్మదము నొందు, మధ్యాహ్నపూజాసమర్పిత మధురపాయ సాపూపరుచిసౌష్ఠవాకృష్టు డగును, అపరాహ్ణకాలచపలాంగికాలాస్యవి న్యాస మీక్షించి రోమాంచముం బొందు, అహరంతపూజార్పితామ్లానమాలతీ సౌరభ్యమున కెంతొ సంతసము నించు, యామినీసమయపర్యంకసేవాప్రాప్త తల్పమున సిరితోడుతం బవ్వళించు, మాఘపూర్ణిమనాడు లక్ష్మమ్మతోడ తేరులో నెక్కి గద్వాలపౌరజనుల కలిమిలేము లరయుచు గక్ష్యలను దిరుగు కేశవుం డర్థిపాలనఖేలనుండు. తావలంబగు నాంధ్రధాత్రీసురశ్రేష్ఠ పావనశ్రుతిశాస్త్రపాఠములకు, కాణాచి యగు నాంధ్రగాయకకులశ్రేష్ఠ కలకంఠమాధుర్యగరిమమునకు, రంగోర్వి యగు నాంధ్రలాస్యాంగనారత్న మంజీరసంగీతమంజులతకు, కల్పద్రువగు నాంధ్రశిల్పకారకకళా వ్రతతికానిరతవాల్లభ్యమునకు, సకలాంధ్రసంస్కృతికి సరిలేని ముకురంబు, సోమవిభు కీర్తికిన్ సొంపారు మకుటంబు, కేశవస్వామికిం గేళికారామంబు, అసమాన మీయుర్వి నా దివ్యవేశ్మంబు. మీనకేతుని మించు నానగరి పురుషాళి సౌందర్యవిభవవమ్ము చందమ్ము నాలించి తమకమ్ము మీఱంగ ధరమెట్టి యున్నట్టి రంభాదులే సుమ్ము! రమణు లా పురమందు! ఆ స్త్రీల దరహాస మాలేప మొనరించు కలికివెన్నెలతోడ గారుచీకటినైన, ఆ స్త్రీల రసలీల లావిద్ధ మొనరించు కామవిహతముగాని కఱకంఠు మతినైన. ఆయూరి నట్టువల అతిలోకవైదగ్ధ్య మగు నాంధ్రభారతికి నపురూపరవణమ్ము! ఆయూరి గాయకుల అసమానగాంధర్వ మగు నాంధ్రభారతికి నమృతనైవేద్యమ్ము! ఆయూరి బ్రాహ్మణుల అసమానవైదుష్య మగు నాంధ్రభారతికి నమలచందనవిలేపమ్ము! ఆయూరి శ్రోత్రియుల అనవద్యశ్రుతివిద్య యగు నాంధ్రభారతికి దగు మంగళాశాసనమ్ము! `రతనాలకుండలాల్ శ్రుతులందు వెలుగొంద, తిరునామముల్ నెన్నుదురులందు దెలివొంద, తులసిపేరులు గళమ్ములయందు నెలవొంద, చక్రాంకములు భుజస్థలులందు నలువొంద, జినుగంచు దోవతుల్ తనులందు జెలువొంద, సంవ్యానకము లురఃస్థలులందు బొలుపొంద, పరమభాగవతులు; సదా వాసుదేవ చరణకంజాతభృంగితస్వాంతు, లనఘు, లపరభాష్యకారు, లగుచు నప్పురమున నయనముల దనియింత్రు వైష్ణవులు మిగుల! ఆవీటి భటసముదయావక్రవిక్రమము తీరెఱిగి, తనశక్తి వారితో బోల్చికొని తీవ్రమగు సిగ్గుచే దినరాజు వదనంబు మబ్బుతెరచీరతో మఱిమఱిం గప్పికొను. ఇటులాంధ్రసంస్కృతికి స్ఫటికంపు ముకురమై శోభిల్లు నప్పురిన్ సోమభూపాలుండు కొలువుండె దను గొల్వ గోవిదులు, కవిచంద్రు, లగధీరులగు వీరు లతివిధేయతతోడ. పరమభక్తుడతండు స్వయముగా గావించు కేశవస్వామికిన్ గృహమార్జనాదివిధులు, ప్రతిమాఘపూర్ణిమకు రథసేవ గావించి యోధ,కవి,నటక,బుధయూథముల గారవించు. ******* "జయజయ మహాంధ్రసర్వం సహాసముద్ధారణదీ క్షాకంకణాంకితపాణీ! దుర్వారవిద్విషద్గణ గర్వతమోనిర్వాపణ పర్వోత్సుకదోర్ద్వితయా ఖర్వపరాక్రమసూర్యా! మందార,కుంద,చందన, బృందారకయోషాగణ మందస్మితచయ నిందద మందామలకీర్తినిధీ! ప్రతివత్సరశిశిరాగత వరపండితకావ్యవధూ రసవత్ స్పర్శనరచితా హ్లాదసుమాంచితచూతా! నానావిధముగ్ధకళా సూనాంచితదృబ్ధమనో జ్ఞాలంకరణోపాయన సమర్పణానందితవా ణీస్మయనామృతసేచన నిచితోత్కటపులకాంగా! క్షితితలవైకుంఠోపమ శ్రీకేశవమందిరని ర్మితిసంచితపుణ్యా! శ్రీముష్టిపల్లివంశక్షీరాబ్ధిశశాంకా! శ్రీమద్గద్వాలరమాశ్రీవత్సాంకా! శ్రీసోమాధిప! శ్రీసోమాధిప! జయము! జయము! చిరదీనావనదీక్షాపరపద్మాధిప!" ఈగతిని దెసలందు మ్రోగె గైవారముల్, మగధాస్యనిష్యందిమధురామృతాసారముల్, నటదీశఢమరుకానాదగంభీరముల్, నటదప్సరోబృందనవగానమాధుర్యముల్. అంతలో గననైరి అంచితాశ్వారూఢు, లతిచిత్రవర్ణాంచితాహార్యధారుల్, కళ్యముల గొని పంచకల్యాణులం దీరు గా దోలు నాశ్వికులు కౌశల్యసారుల్. వారి వెనుకను వాహినీశులు, సచివవర్యులు సప్తిపర్వత కటకసీమల గదలు మబ్బుల చాలులట్టుల సాగిపోయిరి. వారి పిరుదను బారుదీరెను వందిమాగధ, వాద్యకోవిద, దేవదాసీ, దివ్యలాసీ, పుణ్యసాధ్వీ పోష్యవర్గము. రమ్యచేలక, రత్నభూషణ రాజితంబగు రాజవారణ మంత నొక్కటి అక్షిగోచర మయ్యె గదలెడు నద్రి పోలిక. ఏకఘీంకృతితోడ నాకకరినే గెల్చు భద్రేభపీఠిపై బలవైరినే గెల్చు రూపాన నలసోమభూపాలుడే పొల్చె, పార్శ్వమున దద్రాజ్ఞి పౌలోమినే గెల్చె. ప్రభుని వెనుకను స్వర్ణభూషిత వారణంబుల వరుసదీరిరి మండితాంగులు మండలేశులు పోష్యజనములు పూని కొలువగ. వెనుక సాగిరి విప్రవర్యులు, వివిధగాయక, కవివరేణ్యులు, శిల్పకారక, చిత్రకారక, కనకకారక కళాధుర్యులు. వారి వెంటను పౌరజనములు కడలితరగల వడువు నడరుచు కదలసాగిరి కమ్రభూషణ వసనమాలోల్లసితగాత్రులు. మంజుతరమౌ మనుజరూపము గాంచి కదలెడు మంచుకణముల బోలు వారల మేళనంబున అష్టమాంబుధి సృష్టియయ్యెను. "జయజయ కేశవ! జయ మామందిర! జయ మునిమానసజలజేందిందిందిర! జయ కంధరకృష్ణవపుస్సుందర! జయ లోకక్షయసర్గధురంధర! జయ జయ కేశవ! జయ చక్రధరా! జయ జయ కేశవ! జయ శంఖధరా! జయ జయ కేశవ! జయ శార్ఙ్గధరా! జయ జయ కేశవ! జయ పద్మధరా!" అను వారల ప్రాజ్యస్తుతిపాఠము లా యంభోనిధి కపూర్వనాదము లయ్యెన్, అను వారల భక్త్యావేశము లా సాగరసంగతఝంఝాసారము లయ్యెన్. అది మాఘశుక్లపక్షాంతశుభవేళ యని, ఆనాడు కేశవున కరదంపుసేవ యని, తద్భక్తిరసభంగితాధ్వములె వ్యంజించె, తద్గీతికాప్రతిధ్వానములె ఘోషించె. ప్రతిగృహ మొక గోపల్లికయై, ప్రతిగృహిణియు నొక వల్లవియై, ప్రతివాక్యం బొక పల్లవియై, రమ్మనె హరి నా రమ్యాహంబున. ఈవిధి నూరేగెడు వసు ధావిభు పరివారముపయి దలిరులవానన్ శ్రీవహముగ గురిపించిరి ఆవీటి కుటింబిను లమితామోదమునన్. సాగి సాగి ఇటుల గడకు నాగిపోయె జనగణమ్ము; సాగి సాగి తటము నొరసి ఆగిపోవు నల విధమ్ము! అచట బొల్చె గేశవాలయమ్ము, అచలయందు స్వర్గమదియె సుమ్ము! హస్తి డిగ్గి సోము డచట నిల్చె, పరిజనమ్ము లతని పిరుద బొల్చె. ఊర్ధ్వపుండ్రసముజ్జ్వలాంగులు, పవిత్రాంకితపాణిపద్ములు, వేదవిప్రులు మేదినీశుని పూర్ణకుంభము బూని తార్కొని స్వాగతమ్మును బల్కిరంతట. బ్రాహ్మణావళి స్వస్తివాక్కులు, భద్రగీతులు, వాద్యఘోషలు, పరగ సోముడు పరిజనులతో మందిరాంతరమందు జొచ్చెను. ఈవిధిని శ్రీవిభుని కోవెలం జొచ్చి దైవజ్ఞనిర్ణీత తతశుభక్షణమందు క్ష్మావిభుం డర్చనాసంరంభుడయ్యె, దేవేరి యతని దారావిధి ననుసరించె. పరమేష్ఠిసన్నిభద్విజ పరమాగమమంత్రపాఠపంక్తులు, వీణా మురళీమృదంగనానా వరవాద్యజభద్రరుతులు పరగుచునుండన్. అమలినకృష్ణాజలముల కమలాపతికంత నృపతి కరతోయం బొసగెన్, సుమగంధిలతజ్జలముల సుమసాయకజనకు నంత సుస్నాతు నొనర్చెన్. కుసుమాంగీనీతాద్భుత కుసుమమ్ముల శ్రీపతిపయి గురిపించెన్, ధౌ తసుచేలస్రగ్భూషా విసరము లర్పించె విభుడు విశ్వాత్మునకున్. వరకుంకుమకస్తూరీ హరిచందనలేప మలదె నబ్జాక్షునకున్, ధరణీధవుడాపై సురు చిరమగు నైవేద్య మొసగె శ్రీవక్షునకున్. మంగళతూర్యము సెలగగ నంగజగురునకు గపురపుటారతి నొసగెన్, పొంగారెడు భక్తిన్ సా ష్టాంగనతి యొనర్చె హరికి నవనిపు డాపైన్. ఈరీతి గేశవుని ఆరాధనము సేసి, భూరిదక్షిణలతో భూసురుల గైసేసి, అర్ధాంగియుతుడౌచు నవనీశచంద్రుండు ప్రాంగణస్థితమైన బ్రహ్మరథముం జేరి, కదళీదళముల, సహకా రదళాంచితతోరణముల, రమణీయసప ద్యుదితప్రసవస్రజముల హృదయంగమమౌ శతాంగహృదయమునందున్. ఉపవిష్టులై యున్న ఉత్సవుల నర్చించి, పరిజనులతో గూడి పగ్గముల సడలించి, స్వయముగా సోముండు స్యందనము గదలించె, ప్రజలెల్ల బారులై పగ్గముల గొనిరంత. ****** నాడు మొదలుగ నాల్గునాడులు కొలువుదీర్చును కువలయేశుడు నేల నిల్చిన నిర్జరేశుని ఓలగంబును బోలు దానిని. నాడు మొదలుగ నాల్గునాడులు నగరియందున నాట్యనాటక సారకవితా క్షత్రవిద్యా చతురిమంబే సల్పు రాజ్యము. నాడు మొదలుగ నాల్గునాడులు దేవదాసీ దివ్యగీతా లాపసంయుతలాస్యరీతులె దేవళమ్ముల దేజరిల్లును. అవనిలోపల బుణ్యమార్జించుకొన్నట్టి అనఘులెవ్వరొ కందు రట్టి విభవమును త్రిదివాన, కాని యా నాగరుల ఘనభాగ్య మెట్టిదో తాముగా బోషింత్రు తద్వైభవం బవనిలోన! ఒక మహీధ్రమునుండి ఉత్సృష్టమై మరుత్ స్పర్శకుం దూగాడు ప్రస్రవణవిధమౌచు, ఒక మహీజము చుట్టు నూర్మికోపమమౌచు వలమానమగు చైత్రవల్లరీవిధమౌచు, ఒక మదవతీనూపురోదితస్వనభీత మై గాలిలో దేలు హరిణమ్ము విధమౌచు, ఒక కాంత కరతాళసుకుమారలయ కలరి నటియించు మదబర్హిణగణమ్ము విధమౌచు, అంగవిక్షేప, నానారసానుకూల రమ్యముద్రాభినయభావరమ్యమైన గతుల నర్తించు నొక్కొక్క గరిత యపుడు నాట్యబహుమానసముపార్జనాభిలాష. కలకదేఱిన శరత్కాలమ్ము తటినిపై ఎలగాలికిన్ లేచు లలితోర్మికల బోలి, కలికిపున్నమిరేల గలువకన్నెలమోము లలనల్ల ముద్దాడు తెలివెన్నెలల బోలి, తొలిరేయి ప్రియురాలి తలవెండ్రుకల డాగి చిలిపినవ్వుల జిల్కు తెలిమల్లియల బోలి, కలికి మోవులతావి గలిసి యిమ్మడియైన మలయాగసంజనితమధురానిలము బోలి, మధురమై, మృదులమై, మహితబ్రహ్మానంద సంధాయకంబై, అసమబాణసమ్మోహ నాస్త్రమై చూపఱుల నవశులం గావించు నా స్త్రీల రసబంధురాభినయకౌశలము. ఉర్విన్ వారుండగ నిక నూర్వశికై వ్రజ్య యేల? ఉండ నమృతపుం జెర్వొక్కటి కడ, నేలా పర్విడుట దవిష్ఠవిషధిపాథస్సులకై? పూతత్రిపుండ్రోర్ధ్వపుండ్రమండితఫాల ముల బ్రహ్మతేజమ్ము గలుగు వారు, సువిశాలకర్ణాంతశోభాయమానవై డూర్యకుండలవిభం దోగు వారు, కంబునిభకంధరాలంబమానస్ఫటిక రుద్రాక్షమాలికారుచుల వారు, సువిశాలగాఢవక్షోపలక్షితపూత యజ్ఞోపవీతాల నలరు వారు, తదురఃపినద్ధమృదుధవళోత్తరీయప్ర భాదిగ్ధకకుభులై పరగు వారు, పాణితలవిన్యస్తబహుళాత్మకృతగ్రంథ శతపత్త్రులై యింపు సలుపు వారు, ఆంధ్రగీర్వాణవాగ్దేవతానవరత మందిరీకృతాకలుషితమంజువాక్కు, లవనిదేవు లావేళ సోమవిభు సభకు మారుమూలలనుండి యింపార జేరి, సరసావధాన, రసవ త్తరాశుకవితావిధముల, దర్కచ్ఛందో నిరుక్తసాహిత్యవ్యా కరణాలంకారశాస్త్రఘనవాదములన్ తనరెడు ప్రాగల్భ్యప్రహ రణముల బండితగోష్ఠీరణముల బ్రతివిద్వ న్మణులం గెలుతురు; గెలుతురు ఘనదక్షిణలను దానన్ గద్వాలాసభలోన్. పసిడిలో రతనాలు పొసగించినటు పదం బుల నూతనార్థముల్ పొందుపఱచి, గందవొడికి న్విరులగందంబు గూర్చినటు వాక్యముల వైచిత్రి బాదుకొల్పి, నీరమ్ము, క్షీరమ్ము నేర్పరచు హంసలటు కావ్యగుణదోషముల క్రమము లెఱిగి, వరవర్ణినికి నవ్యతరభూషలను గూర్చి నటు లలంకారమ్ము లమరజేసి, విరులతో మాలకరి వివిధమౌ హారముల విరచించు గతి సుధావిమలమధురోక్తులను విరచింతు రాశువుగ వరకావ్యముల వారు, కురిపింత్రు నవపద్యకుసుమమ్ములను వారు. వారల వాక్చాతుర్యము, వారల సాహిత్యశాస్త్రవైదుష్యంబున్, వారల సద్యఃస్ఫూర్తియు, వారల కవితావిశేషవైదగ్ధ్యంబున్, కని విస్మితులై వినుతిం పని వారును, బులకల దనువల్లికలం బూ నని వారును, కనరారెం దును దచ్ఛైశిరవిద్వద్గోష్ఠులయందున్. అపుడాంధ్రదేశంపు టన్నిమూలలనుండి వీరభద్రునిబోలు వీరవరు లేతెంచి సప్తిచాలనకళాచాతుర్యముం జూపి ప్రభువు మన్ననలంది పరితుష్టు లయ్యెదరు. అట్టివారలయందు గొందఱు సంగరకళాసవ్యసాచుల కవనినాయకు డాత్మసైన్యము నందు గొలువిడి యాదరించును. అట్లు వచ్చిన వీరసింహంబులందు ప్రాప్తయౌవనప్రద్యుమ్నరమ్యమూర్తి స్థేమనిర్జితమార్తాండతీక్ష్ణమూర్తి అక్షితర్పణ మొనరించె నపుడొకండు. ఉన్నతాంగమ్ముపై నూర్జితమ్మగు శిర మ్మున సితోష్ణీషమ్ము మురువు సూప, ముఖసుధాకరబింబమునకు జిహ్నములైన శ్మశ్రువుల సౌందర్య మతిశయింప, దుర్గారరోపమస్థూలవక్షముపైని హరితకూర్పాసంబు హరువు సూప, దట్టించి బిగగట్టినట్టి దోవతి బల్లి పొరయట్టు లంగముం బొదవికొనగ, అంఘ్రులందున బాపోసు లందగింప, కరములందున గళ్లెంబు కదలియాడ, అభ్రఘోటకసంకాశమైన శ్వేత వీతిరూఢుఢై యతడు సంప్రేక్ష్యుడయ్యె. పక్కితేజిని వీడి ఎక్కివచ్చెనొ శార్ఙ్గి అక్కజమ్ముగ శ్వేతహయము ననగ, నింగి వెల్గుట మాని నేలకుం డిగివచ్చె నో హయారూఢుడై ద్యుమణి యనగ, తొలిభవంబున నశ్వములపయిం గల ప్రీతి దిరిగి పుట్టిన సహదేవు డనగ, అల్పాయువగుటచే నాదిజన్మమునందు మఱల బుట్టిన యభిమన్యు డనగ, ప్రన్ననౌ జూలు నలనల్ల బాణి నిమిరి, గళము దట్టుచు జిత్రంపు గతుల దేల్చి, కళ్లెముం ద్రిప్పి లక్ష్యంబు కడకు జేర్చి, స్వారి గావించె నవలీల సప్తి నతడు. తన సన్నలన్ మెలగు ధవళాశ్వరాజమున్ వెనుకకుం బ్రక్కకున్ వెస ముందుకుం ద్రోలి కందుకము నొకదాని గగనమందగ వైచి అందముగ నద్దాని నఱచేత మీటుచున్, కందుకము నొకదాని ముందునకు బడవైచి అందుకొన నద్దాని నతిరయమ్మున ద్రోలి ప్రక్కకున్ ముందుకున్ బాణిచే గొట్టుచున్ అక్కజమ్ముగ వలయమ్ము లేర్పరచుచున్, అలవోక జరియించె నయ్యాశ్వికుండు, భళిభళీ యని ప్రజలు బహుధా స్తుతింప. ఆపైని నశ్వంబు నత్యంతజవనాప్తి జక్రవాతములీల జంక్రమింపగ జేసె; తద్గళస్థితమణిస్థగితభూషణపాళి కొఱవి ద్రిప్పిన రీతి గొమరార మెఱయంగ. అంతియేకాక ఆ యౌపవాహ్యంబు వల్గితప్లుతముఖ్యవల్గుగతులార వల్గనం బొనరించె వల్గానుషక్త వల్గుకరచాలనప్రావీణ్యయుక్తి. అనిలజవనాప్తి బర్వు నా యర్వరాజ చంచలఖురాంచలోత్థితసాంద్రధూళి ప్రాంతకృష్ణవేణీస్తనపద్మకోర కమ్ములం బొల్చె గంధపంకమ్ము లీల. ఆ వీరచంద్రమఃప్రావీణ్యచంద్రికా సాంద్రమగు నవ్వేళ జనవార్థి యుప్పొంగె ఉద్వేలతరసమ్మదోర్మికాసంసక్త జయజయారవరణజ్జగతీత్రయం బగుచు. కందుము కౌశలమందిరులన్ ము న్నెందఱినో యాశ్వికకులహిమమందిరులన్, కందుమె వాఱలయందీ చంద మ మందాద్భుతమగు నైపుణి మందునకైనన్. అని సామాజికు లెల్లన్ ఘనవిస్మయమగ్నాంతఃకరణాంబుజులై కొనియాడిరి యాతని వి న్ననువుం గరతాళానూనధ్వను లెసగన్. అపుడాతని గని సోమధ రాపతి వచించె నీగతి. లోకాతీతంబై తగు నీ కౌశలవృత్తిన్ మాకుం జేకూర్చితి వస్తోకంబగు తృప్తిన్ రాకాచంద్రమునిం గని నాకంబంటిన దు గ్ధాకూపారంబయి మా యాకూతం బలరెన్. పాలు గాఱెడు నీదు ఫాలచంద్రుని జూడ ప్రాయ మిఱువదియేని బాటిల్ల దనిపించు, ఈలోన జేకూరె నేరీతి నీకింత చతురతాలాఘవప్రతిభావిశేషమ్ము? నిను బోలిన ఘనవిక్రమ వనజాప్తుల కతమునగద పాయును మన యాంధ్రా వని బర్విన యైస్లామిక జనాధికారాంధకారచయ మామూలముగన్. ఓ వీరాన్వయరత్నమ! నీ విక్రమతరణి కిపుడు నీరాజన మీ గా వలతురు క్షత్త్రకళా కోవిదు లస్మత్పరీక్షకోత్తము లెలమిన్. వారల సంశ్రవకారణమున నో వీరాగ్రణి! కొను మవిరతవిజయశ్రీదము, స్ఫారవిభాశంపానిభమగు నీ వీరకృపాణము మా యుపహారము గాగన్. సురుచిరమగు నీకరపం కరుహంబునకుం బరగుత కల్యాణకరా భరణంబై యీఖడ్గము నరకేసరి కరమున కల నందకమటులన్. వెండియు నో రణవిద్యాఖండల! ఉండుము మాకొలువున నూర్జితముగ నింకన్; మండనమగుచున్ మా బలములకున్ భండనభూముల జెండాడుము శాత్రవులన్. అని పల్కి సోమవసుధామరేంద్రుండు నవరత్నఖచితమౌ పవివంటి ఖడ్గమ్ము నర్పించె నతని కత్యాదరముతోడ చదలంటె నప్పుడే జనతాప్రహర్షమ్ము. అట్లు క్షితినాథదత్తశాతాసి బూని చంచలాన్వితమైన వర్షాభ్రమట్లు తేజరిల్లెడు నతనికిం దృప్తి నిడెను వీరహారతి నంత సాధ్వీగణంబు. అతని వైభవ మద్భుతంబై దృఙ్మనంబుల దృప్తి సేయగ వందిమాగధబృంద మంతట బలికె నిట్టుల లలితభాషల. "స్ఫారశౌర్యావధీరితహరి మండలా! హనుమప్పనాయా! జయము గల్గుత! జయము గల్గుత! కమ్రబొచ్చెంగన్నపల్లీ మండనా! హనుమప్పనాయా! జయము గల్గుత! జయము గల్గుత!" అను వారిపల్కులే యాతండు హనుమప్ప యని చెప్ప వేఱుగా వ్యంజింప బనియేమి యింక? వ్యంజనకు దావేది వాచ్యమే ప్రచురమై రాజ్యమేలెడి వంక? ***** గద్వాలనాథకృతఘనగౌరవంబు ప్రావృడంబుదదత్తవర్షంబువోలె నిండింప నిజమనోనీరజాకరము నుద్వేలసమ్మదరసోర్మికలచేత. నలసోమభూపాలు బలములందున జేరి సేవించు భాగ్యంబు సిద్ధించె నెపుడపుడె తన జీవితాశయంబను ద్వీపముం జేర దిక్సూచి యొకటి చేతికి జిక్కినటు దోచ ఆంధ్రావనీరమాత్యంతసౌభాగ్య సంతతారక్షణాసక్తమై యున్న నిజజీవితాశయము నెఱవేఱు నింక నని తృప్తిపడె నెంతొ హనుమప్ప యంత. రాజేంద్రసన్మానరాజితుం డైన పుత్త్రు గని అభిమోదపుష్పాభివిలసి తోత్కృష్టహృద్వల్లికోత్కర్షకలితు లైరి యాతని పితరు లవ్వేళయందు. ****** అతడాంధ్రభూపాలకానీకమున జేరి కడవలే దొకకొన్ని ఘస్రంబు లట్లయ్యు గావించె నిజకీర్తికాంతిపుంజముచేత గద్వాలలక్ష్మికిం గమ్రనీరాజనము. అనుదినావర్ధమానమౌ నతనికీర్తి కాంతి నిండారు జగమందు సంతతక్ష యామయగ్రస్తుడై యపుడప్డు మాత్ర మే మెఱయు నెలతో బనేమి యనిపించు. గద్వాలసామ్రాజ్యకంధిజాసౌవర్ణ కరకంకణోదితక్వణనోపమంబౌచు ఖణఖణధ్వను లెసగ ఖడ్గయుద్ధాభ్యాస మున దేలు నాతండు రణకోవిదుల గూడి. ఆలీఢపాదుడై యాతండు వింటి నా కర్ణాంతముగ లాగి గాఢజవసత్త్వకలి తమ్ములౌ నమ్ములం దద్దయుం గుఱిపించు ధనురాహవాభ్యాసమున దేలు తరులందు. మున్నుగా నొకలక్ష్య ముపలక్షణము సేసి వెనుదిరిగి యద్దాని ననువెఱిగి భేదించి, ముకురాన నీక్షించి యొకలక్ష్యపుంబింబ మకలంకకౌశలత నద్దాని భేదించి, కనరాక గూఢమై నినదించు లక్ష్యమ్ము నినదానుసారియై యనువొప్ప భేదించి, వాతమ్ముగతి నెఱిగి, ప్రచలించు లక్ష్యమ్ము స్థితి నెఱిగి, యద్దాని జతురతం భేదించి, బహుభంగులం ధనుష్పాండిత్యముం జూపు హనుమప్ప నిజముగా నర్జునుడె యనిపించు. మందురాతతి యాజమాన్యంబునం గొన్నాళ్లు హాస్తికాలయనిర్వహణమందునం గొన్నాళ్లు రాజహయముఖ్యసంరక్షణంబున గొన్నాళ్లు రాజగజముఖ్యపరిరక్షణంబున గొన్నాళ్లు వెచ్చించి హనుమప్ప వివిధరంగమ్ములం దెనలేని యనుభవంబును గడనయొనరించె. వారిపూర్ణంబు, యుక్తాతపాన్వితంబు, సారమేదురమైన కేదారమందు శశ్వదభివృద్ధినొందు రాజనమువోలె బహుముఖాన్వితవైదగ్ధ్యపాటవంబు లనెడి గంటుల నేపారి యతిశయించె అతని విక్రమాంకూరంబు ప్రతిదినంబు సోమభూపాలకాస్థానసీమయందు. మలినమృత్తికాభవమైన మణిలలామ మమలభర్మానుషక్తిచే నతులమాన్య మైన పగిది సోమనృపసేవానుషక్తి కలన హనుమప్ప యతిమాన్యకలితుడయ్యె. ******