హనుమప్పనాయకుడు-ద్వితీయాశ్వాసము కొన్నినాళ్లకు అన్నమాంబకు కాననయ్యెను కౌను కొంచెము జానువాఱెను మేనిచాయయు అందమయ్యెను మందగమనము. నాయకున కీవార్త సుమనోజ్ఞ గేయమున కన్న బ్రియమయ్యెను; నాయకుని డెందమం దొకటియా వేయి హరిచాపములు పూచెను. ఆమె గర్భమునందునన్ వంశతారకభవ్యరూపము, ఆమె మూర్ధమునందునన్ తృప్తిపరిణతదివ్యతేజము, ఆమె చెక్కుల నమృతదీధితి హల్లీసకమ్ము, ఆమె దృక్కుల నమృతధారావ్యావర్తనమ్ము, ఆమె యోష్ఠములందు నామోదకరనూతనారుణత్వమ్ము, ఆమె యూర్పులయందు హైమంతగంధవహనాలసత్వమ్ము, ఆమె యొడియందు దినదినావర్ధితమసృణవర్తులత్వమ్ము, ఆమె నడలందు మత్తమాతంగపదమధురవిన్యాసమ్ము, కాంచి నాయం డంచితప్రమ దార్ణవప్లవనాప్తి మించున్, కాంచి నాయడు మంచుగుబ్బలి మించు ముద మెద నించి మించున్. ఈవిధి బ్రతిదివసావర్ధమాన గర్భాన్వితయై కాంతారత్నము వొలిచెన్ వర్షాభోగంబున బెం పారిన గోదావరి చందంబున. నిండునది బోలు నా నీరజేందునిభాస్య ఇందునీరజబంధు లిమ్ములొసగెడు వేళ ఉడురాశికూటంబు లుత్తమంబగు వేళ మాసములు నిండి యొక మగనిసుంగును గాంచె. ఫలియించిన పంటవలంతియొ యన మించిన యతివం గను పతి కృతియౌ భూపతి దలపించును, అతిసమ్మదసృతి బయనించును. ఆత డామెను జూచుచుండు, నామె యాతని జూచుచుండు, నిర్వురుం గూడి యానిసుగు నింపునింపుగ జూచుచుంద్రు. అటు గాంచుచు నాయర్భకు డెటు దేలునొ యని యెద నెంతురు; ఎటులేమిటి? సుజనేడిత పటుగుణుడౌనని భావింతురు. అటు జూచుచు నాయండను, "చెలి! నీ ముఖచంద్రాంశ మ్మూనుట గాదా సురుచిరమగు నీ చిఱుతని వదనము!" అన నగి యను నా యంగన "స్వామీ! మీ మృదుహాసపుగౌముదులే కద మన తనయుని మోమున మొలకెత్తెను!" ముద్దదాసానంపు ముద్దుచెండును బోలె మెత్తనౌ నా శిశువు నెత్తుకొందురు వారు; ఎత్తుకొని యెద గూర్మి హత్తుకొని యనుకొందు రనిలజాశీర్జనితమణియె సుమ్మితడంచు. హనుమత్కరుణాశీకర జనితాంకురమైన యాత్మజాతున కెలమిన్ హనుమప్పను నామంబిడి హనుమంతున కెరగి వార లనిరిటు భక్తిన్. "త్వత్కరుణారసబంధురతటాక భవతరుణాబ్జంబగు నీ తరుణుని తావక బహుతరధామార్కాంశ ప్రసాదకలనం బాలింపుము దేవా! కైరవాప్తు కిరణపాళి కైరవాళి కైన యటుల శ్రావణాంబుధరము సకలసస్యతతుల కైన యటుల అల వసంతు డఖిలతరులతాదివితతి కైన యటుల ఈ నిసుంగు జీవనగతి కీవె తరణివయ్య హనుమ! నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే సర్వము మాకున్ నీ విస్తృతకరుణావిలసనమున బ్రోవుము నిరతం బితనిన్. నిరతసాధురక్తి, నిష్ఠురవిభుభక్తి నీకు సొమ్ము లంట నీరజాప్తతేజ! నీదు భూష లొసగి మాదు సుతుని సుంత అలంకరింపవయ్య! అనిలకుమార!" హనుమప్ప కంటిచలువన్ హనుమప్ప గనియె క్రమక్రమాభ్యుదయంబున్ ఘనవర్షోదయజృంభిత వనసంస్థిత నవ్యనీపవల్లిక వోలెన్. ధర్మపథమందు నిరతంబు బదమూను మర్మ మెఱిగెనొ బాల్యమందే యనంగ హల్లకారుణపల్లవాంఘ్రుల ధరిత్రి నల్లనం బూన్చి నడయాడగా నేర్చె. కదలెడి పుత్తడిబొమ్మయొ మెదలెడి చివురుంగొమ్మయొ యని చూపఱు లబ్బురపడ ననువారసి యతడు గమించెన్. ఋతవాక్యంబుల బల్కెడు వితముం గన్గొనె నతిబాల్యంబుననే యన నతని ముఖంబున వెల్వడె శ్రుతి కామెతలౌ సుందరమృదుభాషితముల్. చిఱుగాలుల రవళించెడు చివురాకుంబలె చిఱుదేటుల రవమూనిన విరిప్రోవుంబలె స్వరమూనిన హాటకపాంచాలికయుంబలె పరగెన్ బాలుడు వాక్సంభవశుభవేళన్. శ్రీకంఠచాపఖండన యన చీకంతచాపకందన యనుచున్ పాకారిప్రముఖవినుత యన పాకాలిప్పముకవినుత యనుచున్ ఆ కుఱ్ఱడు ప్రతివల్కుం జేకుర విధాత చేసిన శ్రీకరనినదంకరాతి లోకధ్వనియంత్రమనన్. పలుకులు నేర్చిన దాదిగ బొలుపుగ భారతగాథాపూరమె, దశకం ఠలవిత్రు కథాసారమె పలికించి రతనిచేతన్ వారక పితరుల్. అఱపదేండులు దాటని యలతినాడె ఏకలవ్యుని చారిత్ర మెక్కె మదికి కరతలామలకంబయ్యె గర్ణగాథ ఆంజనేయుని విక్రమం బాత్మ నాటె. ఆనాడే యతడా వీరుల ప్రథ మీరెడు నాశోన్మీలనమున దేలెన్ జనియింపగనే శర్వుని తలకే పూవగు తహతహ బూనిన నెల వోలెన్. పక్షి యట్టుల నంతరిక్షమున కెగయంగ నెంచు, మత్తగజమట్టులన్ మల్లాడగా నుత్సహించు, తురగమ్ము రీతిగా దూకంగ గుతుకమ్ము నించు, ఆబాలు డాఱేండులైన నిండని యలతినాడె. తోడిబాలుర గూడి యాడెడు వేళలందున విజయ మతనిదె, వారు డాగిన వారి ద్రుటిలో నరయు నాతడు; అతడు డాగును; మాఱుమూలల వార లరయుదు రైన గానక నాన దాల్తురు. లేడిపిల్లల లీల బాలకు లోలి గట్టుక నుఱుక నేర్చెద, రట్టివారలయందు నెప్పుడు నతనిదే యగు నగ్రగమనము. కఱ్ఱతున్కల గేల గిఱ్ఱునం ద్రిప్పుచున్ కుఱ్ఱలం గూడి రణకుర్దనమ్మున మించు; గుఱ్ఱంపుగూనపై గుప్పించి కూర్చుండి అఱ్ఱు కేలం దిగిచి యద్దాని నుఱికించు. బాలురందఱు భారతక్రీ డాత్ములైనపు డాత డర్జును డౌను; వారు రాఘవవీరగాథా నటకులగుచో నత డనిలజుం డౌను. వేళలందున నొక్క పూలవేళయుబోలె, పూలయందున నొక్క పుష్కరమ్మును బోలె, రాలయందున నొక్క రత్నాంకురము వోలె బాలురందున మేటిబాలుడై యతడొప్పె. బాలార్కతరుణాంశుజాలంబు మధ్యాహ్న కాలోద్ధురాతపక్రమము దెల్పెడి రీతి బాలకుని శైశవప్రారంభవర్తనమె పోలంగ నాగామి భూరివిక్రమదీప్తి. బోయనాయడు పుత్త్రరత్నము జేయనెంచెను సిద్ధహస్తుని అస్త్రవిద్యల, శస్త్రవిద్యల మల్లవిద్యల, నెల్లవిద్యల. ఒక భరతునిగా, నొక పార్థునిగా, నొక భీష్మునిగా, నొక భీమునిగా నకలంకస్థితి నాత్మజు మలచన్ బ్రకటంబై తగు వాంఛన్ బోయడు. మేటి ధానుష్కకోటిలో మేలుబంతి ఊర్జితాహవాభిజ్ఞుల కొజ్జబంతి అలఘు నైస్త్రింశికాళుల తలకు బంతి కాగ నొనరించె బాలుని గడక మీర. తండ్రిపనుపున నేర్చెను తనయుడంత గంధవారణవారణకఠినవృత్తి, నతులజవనాశ్వచాలనచతురవృత్తి, బహువిధశకటచోదనప్రథితవృత్తి. అవిరళశరజాలంబులు, ప్రవిభీలగుణస్తనితవిరావంబులు, చా పవృషేష్వాసంబులు దగ బ్రవిభాసిలె శ్రావణాంబువహమటు లతడున్. తఱుగని శరధుల శరముల నొనరుచు నా చిఱుతని కార్ముకశరధర మేర్పడ గురియున్ శరములు తద్వరచాతుర్యవృషాజ్ఞా పరిలక్షితమౌ ప్రాంతంబుల సాంద్రముగన్. అతడు ఖడ్గవిద్యాభ్యాసి యైన వేళ చంద్రహాసాంచలస్ఫురత్ చంచలాళి తత్ప్రగాఢతేజోభవద్భావికీర్తి రేఖికాస్ఫోరక నిమిత్తరేఖ లగును. కాపురుషోదయఖండనచణముల్ శ్రీపూర్ణాంధ్రధరిత్రీసౌభా గ్యాపహరణచణయావనదోర్గ ర్వాపధ్వంసనపర్వోత్సుకముల్ ఆ పాపని ఖడ్గాశీవిషముల్. పుట్టువొందిన నేమి బోయకులమునయందు రాణించె నాతండు రాజవిద్యలయందు గర్హ్యమౌ పంకమున గననేమి జననంబు ఆమోదయుతి నర్హమౌగాదె నళినంబు! అతడెట్టి యశ్వంబునైన నవలీల బట్టి మారుతమట్లు బర్వు వెట్టించు; అతడెట్టి యశ్వశిక్షాభ్యుచితవిద్య నైన నిష్ణాతుడై యలరు ద్రుటిలోన. క్షీరసాగరమథనంబు సేయు వేళ నొనరు నావర్తముల దగుల్కొనిన వేల్పు వార్వమే సుమ్మతం డతిత్వరితగతిని సారెవలె ద్రిప్పు నాత్మీయసైంధవంబు. అవరోధ మొదవుచో నశ్వంబు దాటించు ఖగమట్టు లెగిరించి గగనంబు నంట, మడుగు లెదురైనచో మత్స్యమటు లీదించి సైంధవము దాటించు జాతుర్య మెసగ, సమయ మరుదైనచో శ్వసనోపమజవాప్తి దురగమ్ము నుఱికించు దూర్ణమ్ముగాను. సమయమ్ము గల్గుచో సామజోపమలీల వాజి నడిపించు బహురాజసముగాను, ఘోటకస్వభావవిశేషకోవిదుండు, సప్తిపాలనవిద్యావిశారదుండు, తురగచాలనచాతురీపరిణతుండు, ఆశ్వికవరుం డతడు హనుమాభిదుండు. మొగ్గ కుసుమితమైన మురువొప్ప నతనిలో నగ్గలంబయ్యె నవయౌవనోదయము మ్రుగ్గువెట్టిన రీతి ముఖచంద్రమండలిన్ నిగ్గుదేరెను శ్మశ్రునీలరేఖికలు. నూనూగుమీసాల నూత్నయౌవనము నాటికే వీరులన్ మేటియై యతడొప్పె బాలుడయ్యును మున్ను వాసుదేవుండు వాసవాశక్యమౌ వరశక్తి మనకున్నె? పసిడిం గూడిన వాసనవోలెన్ కుసుమారామము గూడిన చైత్రమువోలెన్ నిసి గూడిన వెన్నెలపసవోలెన్ పొసగెన్ యౌవనపూర్ణోదయ మాతనిలోన్. మిసమిసలారెడు మీసంబుల ముసరెన్ నవదరహసితపు రోచిస్సులె, వసివాడని ముఖపద్మంబున హసించె బురుషార్హంబగు వర్చస్సులె. శైశవంబున బేశలంబయి పొనరు తనువున కొనరె దార్ఢ్యము; కండ నిండెను కాయయష్టిం జివురుగొమ్మయె చేవ యయ్యెను. ఆయతంబగు నతని వక్షము గవనివాకిటి గర్వ మడచెను, అతిధృఢంబగు నతని బాహువు లయోర్గళముల నపహసించెను. మొలకగడ్డపుముసుగు దొడిగిన అతని చెక్కిళు లందగించెను జలదశకలము సగము గప్పిన పూర్ణచంద్రుని పొలుపు దెగడుచు. ఫుల్లనీరజపూర్ణముఖమున బారుదీరిన బంభరమ్ములె అతని మీసము, లందు దవిలిన వారిపర్ణియె బవిరిగడ్డము! ఈవిధి ననుదినవర్ధిత యౌవనవిభ్రమపరుడగు నాత్మజు గని రా కావిధుదర్శనతృప్తప యోవార్నిధిభంగి పొంగి రాతని పితరుల్. పరివర్ణింపగ వారల సుఖముం దరమా వాక్కుల కది విధిదత్తేక్షణముల్ బరవశమొందగ బ్రత్యక్షంబుగ నరయన్వలె; మెచ్చుచు దల లాడింపవలెన్. వారొకనా డాత్మజు గని స్మేరాననులౌచు సుతుని సేమమె మదిలో తోరంబై చన బల్కిరి సారామృతమయహితోక్తిసంతతి నిటులన్. "నాయన! యెన్నో రాజ శ్రేయస్కరమౌ విద్యల గడిదేరితి విది సరి! ఈ గ్రామంబున నేకరణిన్ రాణించును నీ పాండితి? అడవిం బూచిన యలరుల యందం బేరికి దెలియున్? అడవిం గాచిన వెన్నెల లలరించెడు నెవ్వారిని? రాణించును గాదా మణి రాజము భర్మాశ్రయమున రంజిలుటన్, రాణించును గాదా ఫణి రాజు మురారికి జాజుల పాన్పగుటన్. కావున పాండితి గౌరవమందున విజ్ఞుల కడ, వినవే "విద్వానే వ విజానాతి విపశ్చిత్కృతకృషి రూప"మ్మను నార్యోక్తిని ధాత్రిన్? తన యర్హతకుం దగునెడ గానీ మనుజుడు గానడు మాన్యత; అందున్ రణవిద్యాపారగులకు బరమము మనుజాధిపసేవన, మట్లగుటన్. మన గద్వాలపురీశుడు మన యేలిక సోమనాద్రిమహివల్లభు వా హినిలోనం గల రెందఱొ ఘనవీరు లనూనధామఖరకరమూర్తుల్. నీవా వీరుల జేరం బోవుట తావక భవిష్యపూర్ణాభ్యుదయ శ్రీవిధిమూలంబగు; మా కీవిధి మోదావహంబు, హితమనిపించున్. నీ కడిమిన్, నీ నిస్తులరణపాం డితిగని పరీక్ష నిర్వర్తింపం దగు నా ధాత్రీధవసంస్థాన స్థమహావీరవతంసమ్ములకే." ఆ నయవాక్యము లమృతపు సోనల పొందై, యపూర్వశుభదములౌ స్వ ర్ధేనుపయోధారల క్రం దై నవమోదాంకురముల నాత్మం గూర్పన్. హనుమప్ప యుప్పొంగె పెనువెల్లువై పాఱు ఘనవాహినింబోలె, హనుమప్ప యుప్పొంగె పెనునుర్గులం బొంగు పీయూషముంబోలె. హనుమప్ప కన్గొనల తొలుకారు మెఱపులే తొనకారె, హనుమప్ప మెయినెల్ల లలితంపు బులకలే మొలుపారె. గద్వాలసంస్థానగరిమంబె మైరేయమై యతని మైన్ మత్తునం దేల్చె; బహుభావబంధురంబౌ నతని వక్త్రంబు రక్తశతపత్త్రంబునే గెల్చె. ******