హనుమప్పనాయకుడు-ప్రథమాశ్వాసము దూష్యయవనవ్రాత్యదుర్యశమ్మునుబోలె ధూమమయభయదజలదోత్కరమ్మునుబోలె ధరణి బర్విన యిరుల బరిమార్ప జనుదెంచు హరిదశ్వు విశదాశ్వమన బ్రాచి తెలుపారె. దుష్కరతురుష్కసేనా నిష్కర్తనచణనృపాసినివహము వోలెన్ పుష్కరమిత్త్రుని రోచులు పుష్కలమయ్యె నపుడుర్వి పొంపిరివోవన్. విజయుండై వేంచేసెడు విభు గన విప్పారిన వద నమ్ముల బోలెన్ శ్రీసద నమ్ములు సితనళినమ్ములు! విజయేందిరతో విచ్చేసెడు విభుమార్గములో వెలయించిన శుభహారతులన బ్రభసూపెన్ కెందమ్ముల బహుబృందమ్ములు! కాసారములలోని కంజసౌరభమింత, సంపెగలజొంపముల జను సౌరభమునింత, మల్లెపందిరులలో మలయు సౌరభమింత, మొగలిపూబొదలలో దగు సౌరభమునింత, మోచికొని తిరుగాడె మురువొప్ప జిఱుగాడ్పు అత్తరుల నమ్ముకొను వ్యాపారివలె నంత. కాసారకంజాలు కన్నుదెఱవక మున్నె పూర్వదిశ తెలిపట్టుపుట్టమూనక మున్నె తోటపొలముల జొచ్చి మోటగట్టిన కృషిక కూటముల కడు తేటపాటల రుతు లొకింత, బ్రహ్మసుముహూర్తమున వ్యాస, విద్యానాథ, భాస, కాళీదాస, భవభూతి, బాణాది బహుకావ్యపద్మవనవాహ్యాళిపరులైన బ్రహ్మచార్యాళి కావ్యాలాపములొకింత, తమ నీడముల వీడి తత్తరంబున జగ ద్బాంధవుం డేతెంచు తరుణమేతెంచెనని లోకమున కెరిగింప నాకమున జరియించు ఖగయూథముల తీవ్రకలరావములొకింత, తొగరంచుపంచెలం దొడలపై కెగగట్టి ముతకగొంగళు లెడమమూపులందున బెట్టి ముల్లుకోలల బట్టి గొల్లండ్రు దోల్కొంచు జను పశూత్కరకంఠజనితార్భటులొకింత, మట్టికుండలలోన మంచినీరెత్తుకొని పీయూషముం గొంచు బృథ్వికిం జనుదెంచు అచ్చెరలొ నాగ రాయంచనడల గమించు పల్లెతల యందియల ఘల్లుఘల్ధ్వనులింత, వహియించి పవనుండు వైతాళికుండయ్యె అభినవోద్యత్ ద్యుమణ్యంశుకోమలకర స్పర్శనస్పందితంబైన "బొచ్చెంగన్న పల్లికా"ప్రజల కా ప్రత్యూషకాలాన. ముంగిట్ల రంగారు రంగవల్లుల దీర్చు నంగనల నీలి ముంగురులతో గూర్మి చెంగలింపగ గొంతసేపాడియాడి, హరిసేవ కుదయాన విరుల గోయగ జేరు బిత్తరుల పైట చెఱగులన్ ముడివెట్టి తరులకుం గొంతతఱి సరసమ్ములాడి, రే నిదురవోరామి ఆ నవోదయవేళ నలసత న్నిదుర నూనిన నవోఢా న వీనాంశుకమ్ములం బ్రిదులంగ ద్రోచి, రేయెండకుం గుమిలి మే యుంచి పాన్పునన్ మిక్కిలిం బొరలు విర హాయతల నిట్టూర్పు వాయువులతో స్నేహభావంబు వహియించి, అలవోక జరియించె నపుడు గంధవహుండు ప్రథిత"బొచ్చెంగన్నపల్లికా" పద్మినీ విభ్రమాలోకనావిలులితస్వాంతుండు మంజులాహల్యాప్రమత్తమఘవసముండు! ఉదయాన నాగండ్ల నున్నతాంసమ్ములం బొదవి పొలములపొంత బోవువారు, అరుగులం గూర్చుండి హరినామకీర్తనసు ధారసాస్వాదులై తనియువారు, పంచాంగసంశ్రుతిప్రవణులై బ్రాహ్మణుల నంచితంబుగ సత్కరించువారు, రంగుటెద్దుల గట్టి రయమునన్ బండ్లను వి హంగములవలె దోలునట్టివారు, రచ్చకట్టల జేరి, ప్రాడ్వివాకత మీరి చెచ్చెరం దీర్పులం జెప్పువారు, అంజలుల్ ఘటియించి ఆంజనేయుని మ్రోల కంజమ్ములిడి మ్రొక్కగడగువారు, చెంగుచెంగున లేచు చిన్నిలేగల చుంచు లం గూర్మి దువ్వంగ లాచువారు, పాలకుండల జూచి ప్రక్కకుం జనకున్న చీలులకు నామెతల్ సేయువారు, పులులట్లు జృంభించు పోతులం బట్టంగ పలుపులం గొని వెంటబాఱువారు, కోరాడి కుప్పించు కోడెలన్ వారింప దరటులం గొని వెంటనురుకువారు, బహువిధవ్యాపారపరచిత్తు లాపల్లి కాహృదయచైతన్యకరవృత్తు లెదురైరి ప్రత్యుషఃప్రాలేయభారమందీభూత గామికిం బూతసౌగంధ్యభృత్స్వామికిన్. సాలభిత్తుల నొనరు జాజుసున్నపుబట్టె లల రజస్సత్త్వగుణముల లీల బోల, ముంగిట్ల ననుపారు మొల్లపూవుల డా ల భంగురప్రమదానుభావగతి మీర, ద్వారమ్ములం దనరు తోరణమ్ముల కాంతి స్థిరభావచైతన్యగరిమంబు జూప, బహుళోన్నతము గాని గృహ మాలయీభూత మహితోత్తమాంగంబుమాడ్కి నింపార, సాకారవరమనస్సంకాశమగు నొక్క యకలంకగృహ మప్పు డనిలుండు పొడగాంచె. ఆయింటికి బతియౌ ప్రతి భాయుతు డంచితకులవి ద్యాయుతు డతివిక్రమబా హాయుతుడగు నొక బోయడు. ఆతం డన్నమ యనియెడు గరితన్ ఆతతసౌశీల్యదయాభరితన్ సీతోపమపతిసేవానిరతన్ జేతోమోదన్ జేకొని యుండన్... రథచక్రంబుల క్రమమున రాత్రులుపవళులు రయమున దిరిగెన్ పరిణయమాదిగ బదివ త్సరములు కాలోదధిలో గలసెన్. ఈయేడొదవెడు సంతతి ఆయేడొదవెడునని వారాశాయతి దశ హాయనముల్ వేచిరి; కా నీ యది నీఱున నిడు పన్నీరే యయ్యెన్. దాంపత్యవల్లరిం దళుకొత్తు చిన్నారిపూవు పున్నామనరకంపు బులివాతి దప్పించు జోదు దుస్తార్యవార్ధక్యతోయధిం దాటించు నావ ఇహపరంబులలోన నిద్ధసౌఖ్యం బొసగు సురభి పావనాన్వవాయపుణ్యభూమి స్ఫూర్తి గొన్న పూర్వపుణ్యమూర్తి పుత్త్రు, డట్టి పుత్త్రు డొదవకున్న జీవితమ్ము చేదుగాదె తాల్ప! అని యెంచుచు నానావిత రణ, పావనతీర్థనిషేవణముల్, ఇనచంద్రాదినవగ్రహ వినయసమాహితవిపులార్చనముల్ ఎన్నో సలిపిరి కానీ అన్నియు నంబుధి జిలికిన క్రొన్ననతేనియ లయ్యెన్. ఎంతో వేచిరి కానీ యెంత కమావాస్యాని శ్యంతం బొదవకపోయెన్. ఇది వారల మనముల నెంతో దారించెన్, ఇది వారల మనముల కింగలమే యయ్యెన్. వారికన్నను వారి పితరుల పాలికియ్యది శూలమయ్యెను పిన్నవారల పెంపుతెంపులు కన్నవారికె కావలెంగద! అంతట నొకనా డావృద్ధులు, అంచితవిజ్ఞానసమృద్ధులు, ఆత్మజు, స్నుషనుం గనుగొని మది నంటిన ప్రేముడి ననిరిటులన్. "నాయనలారా! పాయక సల్పితి రెన్నో వేల్పుల కింపగు సేవలు; కానీ కల్గదొకంతయు జిఱుతని దరహాససుధం దనిసెడు భాగ్యము! మృగతృష్ణలకై యింతటి యగచాట్లం బడనేలా? అందని మ్రాకుల పండుల కఱ్ఱులు సాచగ నేలా? చెంగట సురఝరి యనదగు చెరువుండగ నింకేలా తివురుట దవ్వుల సంద్రపు తిక్తజలమ్ములకొఱకై? మఱచితిరే మది? ఘనతర కరుణాపరిపోషితభ క్తమనోరథతరునిన్, మన గ్రామాంచితునిం బావని? భక్తజనావను పరమోదారున్, నక్తంచరపవి, ననిలకుమారున్, త్యక్తమనశ్శంకాయతి నింకన్ భక్తిం గొల్వుడు, పడయుడు కోర్కెల్." ఆ ఉక్తు లత్యంతక ల్యాణదాయకయుక్తులే యయ్యె; కాఱడవిలో పూల దారులే వారికిం గననయ్యె. అంత నొక కల్యాణయామినీముఖమందు సంతసమ్మున శిరఃస్నానమ్ము గావించి, కాంతతరశుభ్రాంశుకమ్ములం ధరియించి, కుంతలమ్ములు ముడిచి, కుంకుమంబును దాల్చి, వివిధఫలంబులు, వికచసుమంబులు, నవగంధమ్ములు, నారికెడంబులు, కపురపుతావుల గను వీడ్యంబులు, వెంటం గొని మది నంటిన కూర్మిన్. అపుడే ఉదయంబందిన అమృతాంశు కళాద్వయమో యన క్షిప్రగతి న్నవమో దాభియుతాంతరులై చని హనుమన్మందిరముం గని యందున నెలవౌ సారద యాభిష్యందికటాక్షున్ యాచకసాత్కృతమోక్షున్ ఘోరతరాఘాపద్విని వారణకారణకరుణా సరసీ విహరత్ సజ్జన సారసుహృష్టమనోహంసున్ పావనసూర్యకులార్ణవ జైవాతృకనిరతస్మృతి వేలాడోలాందోళన లీలోత్సుకచేతోహంసున్ దుర్వారాసురసేనా గర్వోజ్జృంభణకీలా నిర్వాపణపర్వోత్సుక దోర్వీర్యాతివిలాసున్ సుగ్రీవాధిపకుశల వ్యగ్రమనీషాన్వితునిన్ ఆ గ్రామంబున భాసిలు విగ్రహరూపాన్వితునిన్ ఆంజనేయుం గాంచి అధికతరభక్తి నంజలుల్ ఘటియించి అలికమ్ములందు కంజమృదులోష్ఠరాగంబు గ్రాలంగ మంజుభాషల నిట్లు మారుతికి ననిరి. "కామరూప! కామగమన! కామితార్థదాత హనుమ! రామచరణనళినభృంగ! స్వామి! నీవె శరణు! శరణు! అయ్య! ఇంతకాలమయ్యె! కలుగ దయ్యె సంతు మాకు! వట్టిపోయి కొయ్యబాఱినట్టి మ్రాకులట్టు లయ్యె మాదు జీవితమ్ము లిలను! అసితపక్షకృశంబైన యబ్ధివోలె అసితభానుమంతమైన రజనివోలె మసృణకుసుమరహితమైన లతికవోలె అసుతమౌచు జీవనసృతి వెలితివోయె. బహుశాస్త్రపురాణంబులు మహి "ననపత్యస్యగతి ర్నహి" యనుగద! నీవెఱుగని దె హనుమ! ఈ శాస్త్రార్థము? కావున నొక బలపూషణు పావనగుణగణభూషణు మా వంశాంబుధితోషణు పావని యొసగవె మాకున్! త్వత్కరుణామృతధారా వర్ధిత మస్మజ్జీవనభూజము దారుణచింతాదావాऽ దగ్ధంబగుటోర్తువె భక్తావన! తొలి యిలువేలుపు రాముని నిలసుత గూరిచి వారల యిలు నిల్పితివట! యటువలె చిలికింపగరాదా నీ చలువన్ మాపై గొంచెము సులలితకరుణాసుందర!" ఈరీతి బ్రార్థించి హృత్తటాకోత్క్షిప్త ఘనభక్తిరసతరంగక్లిన్నబంధురా లోకమాలికలు క్రొంగ్రొత్త మందిరమునే నిర్మింప బావనికి నీక్షించి రద్దేవు. వారి యాలోకములు బంభరశ్రేణులై వాయుసుతు పదహృదయవదనాబ్జముల మూగె, అంతలో భూమీసురామ్నాయపాఠముల్ ఘంటికాఘణఘణంఘణనాదముల్ మ్రోగె. మరుదాత్మభవు ఫాలమండలి నపూర్వది వ్యాభమ్ము సద్యోభవంబయి పిసాళించె, అనిలాత్మభవు సుందరాపాంగములనుండి కారుణ్యరసఝరులె కారుచున్నటు దోచె. తద్ఘనశోభాతరళితసృతిలో మందిరమే యొక స్యందనమై వెలుగొందెన్, తత్కరుణామృతతరంగగతిలో మందిరమే యొక మరాళమై చెలువొందెన్. అవ్వారి ఘననిరాశాంధీకృతాత్మలకు బ్రతినవజ్యోతియై పరగె నా రుక్చయము, అవ్వారి ఘనదీనతాతప్తమనములకు బీయూషవర్షమై వెలసె నాదృక్చయము. గహనమ్ము గడచి రంగారు పురి జేరినటు, నీరాకరము గడచి తీరమ్ము జేరినటు, మరుభూమి గడచి పద్మాకరము జేరినటు, వారు నవమోదసంప్లావితాంతరు లైరి. చింతాభారము దీరగ నెంతో తేలికలై, శంకాపంకము జారగ జాల ప్రసన్నములై, వారల మనములు శారదవారిదసదృశములై నవ్యానందదివంబున నర్తింపగ సాగెను. ద్విగుణీకృతకౌతుకధీయుతులై దేవుని గొలువగ గడగిరి వారలు. తమ మనంబులయట్లు ధవళంబులౌ కుందసుమబృందములు గురిపించి రొకకొన్ని, తమ కోర్కియటు నిత్యతరుణంబులౌ లలితతులసీదళము లర్పించి రొకకొన్ని. సాంబ్రాణిధూపమ్ము, చందనవిలేపమ్ము, కాంచనీపంకమ్ము, కాంచనప్రసవమ్ము, సుఫలనైవేద్యమ్ము, చొక్కంపువీడ్యమ్ము, చేకూర మారుతిన్ సేవించి రవ్వారు. ఈరీతి సేవించి, హృత్ క్షేత్ర బంధురోద్యద్భక్తివల్లికా సంచలచ్ఛదననిస్వానమో యన మీరు నుడులార ననిరిట్లు. "దేవా! నీ కనుచలువయె మావాంఛితదమ్మగు కల్పద్రువు! దేవా! నీ వాత్సల్యమె మా వంధ్యత్వము మాపు మహౌషధి! నీవె శరణంబంటిమయ్యా! నీకె దాసుల మంటిమయ్యా! నీటముంచిన, పాలముంచిన నీదుచలువే నంటిమయ్యా! వందనము నీ కమరవందితచరణా! వందనము నీ కసురవారణచరణా! వందనము నీ కఘవిపాటనచరణా! వందనము నీ కర్థిపాలనచరణా!" అని ప్రార్థనము సేసి, అనిలాత్మభవు తీర్థ మాల్యగంధాక్షతామూల్యప్రసాదముల నాదృతిం గ్రహియించి, హనుమత్పదన్యస్త హృదయులే యయి వార లిలుజేర జనిరంత. ఆలయదర్శితశుభచి హ్నాంకితమతులై వారది యాదేవుని దీవనయే యని మెచ్చుచు గనుమోడ్చిరి. దుర్వారపాథోధి దుదముట్టగా నీది బిట్టలసి నిదురించు బెస్తరాయనిబోలె తక్షణమె నాయండు తంద్రాళువైపోయె, కాని యన్నమ కేమొ కన్నంట దెంతకును. ప్రసవము దొలగిన వెనుకను విసృమరమగు తావింబలె శ్వసనజు సన్నిధి ఘటనమె మెసలెను మదిలో నామెకు. "అగునా యది మాప్రార్థన కనిలజు డొసగిన యభయము? అగునా యది మానోము ఫ లాస్పదమగు శుభశకునము? మున్నుగ గొల్చితి మెన్నో మూర్తుల గానీ యిట్టి మ హానుభవం బెందుం బొడ గానము; అద్భుత మియ్యది! ఐనన్ సూనుడు, సద్గుణసూనుడు, అన్వయదుగ్ధాంబుధిహిమభానుడు, ఘనతేజోవిధినిర్జితభానుడు కల్గున మఱి? నెమ్మది కల్గున మది? పసిపాపని చిఱునగవుల నెసలారెడు వెన్నెలతర గల దేలుట యెన్నడు? మై పులకల నూనుట యెన్నడు? ఏమో కావుగదా యివి యెల్లయు నలలన్ వ్రాసిన వ్రాలే? మృగతృష్ణంబ్రతి భాసించెడు నీరములే?" ఓహరిసాహరిగా నిటు లూహలు చెలరేగగ నా యమ మానస మంబుధి నూ గాడెడు నోడం బోలెను. పలుతెఱంగుల నిట్లు దలపోసి తలపోసి తరళాక్షి క్రమముగా దంద్రాళువైపోయె, సంక్షోభముం గడచి శమియించు సాగరము చందాన నామెమది శాంతించె నొకయింత. ****** భువనంబు రంగారు పూదోటయై పొలిచె పవనుండు మందుడై పరిమళించుచు నడచె. భువినందిన నందనవనమై పువుగొమ్మల యిమ్ముల కిమ్మై నవజాలకజాలకమయమై పువుదోటొనరె న్నిరుపమమై. సుడిగొంచు జరియించు సుమరజమె కండ్లుగా పొలుపారు చూతాగ్రములచివురు డెక్కెముగ పుడమి కానతమైన బోదెలే నొగలుగా తగుబారులౌ తేటిదళములే త్రాళ్లుగా చిల్కతండములె మేల్గుల్కు తురగమ్ములుగ కోకిలమ్ములె పరాక్కులు వల్కు జనముగా తనరంగ జైత్రయాత్రాశీలి చైత్రుండు దివినుండి దిగివచ్చు తేరునా వనమొనరె. అలరుల యక్షత, లివురుల హారతు, లళిరవగానము, లలరగ స్వాగతమొసగిరి ఆమనికి లతాకాంతలు. తన కీర్తిసౌరభమె తావిగా సవరించి, తన స్ఫూర్తి గనకంపుదనువుగా నమరించి, తన మధుపలౌల్యంబు దనలోనె మిగిలించి ఒనరించె జైత్రుడన ననుపారె గాంచనము. కమ్రవనకామినీగండముల ననురాగ నమ్రాంతరంగుండు నవచైత్రు డొదవించు ఆమ్రశరకీర్తిచిహ్నాయమానార్ధేందు కమ్రాంకముల బోలె గలికిమోదుగుపూలు. బాలసహకారమృదుపల్లవమ్ములు మెసవి పంచమంబున బాడు పరభృతప్రకరమ్ము లామెతల్ భుజియించి ఆరామలక్ష్మిపై దీవెనల్ గురిపించు ద్విజరాజియే సుమ్ము! చివురుగొమ్మల డాగి యెవరికిం గనరాక భువినెల్ల మృదుగానవివశత్వమున ముంచె బరభృతము భువనైకగీతపరిపూతమూర్తుల కేల అవసరంబిల భౌతికాకారలీలాప్రదర్శనము? మకరందమధుపానమత్తతం దేలియున్ ఝంకారసంగీతసర్వజ్ఞత న్మీరె మధుపకుల మయ్యారె! మాధ్వీకలోలుపుల్ గళితసంస్కారులను కథన మనృతము గాదె! చలదూర్మికాసంఘసంఘట్టనోదితమృదంగ లలితసంరావానులాస్యన్మయూరంబు విచలవీచీలుఠద్విస్తారతరపృషత్తార నిచయభాసురరమ్యనీరేజపర్ణంబు అనుచలద్భంగనివహాందోళికావిహరమాణ మానసౌకఃకదంబానందనిలయంబు ఉరుతరంగాకస్మికోడ్డీయమానశిశుమీన చౌరికావహసవిధజలపక్షినివహంబు కూలమాలూరగాలవక్రోడవాసి బహువిధాండజసంగీతపరిణతంబు కమలినీవృద్ధికారకఘనరసంబు నగుచు జెలువొందె వనియందు నబ్జసరసి. కిసలారుణవసనములున్ గుసుమాలంకృతులును గొని కూలలతాంగీ విసరము గైసేయగ వని పొసగించిన దర్పణమన బూసరసొనరెన్. మొదట దావుల జల్లి దెసలందు మోహార్తులం జేసి, పైని రుచిరాస్యాబ్జముల జూపి పరవశింపం జేసి, ఉపరి ముఖసీథువుం జవిచూపి ఉన్మత్తులం జేసి, భ్రమరులం జొక్కించె పద్మినీప్రౌఢాంగనాకులము. చెలువునన్ శతపత్రములకోడి మునిగెనో చలినీట నన దోచె జలజాకరస్థగిత కూలాంతకుందసుమకులమౌర! విభ్రమర మాలయుల గెలువంగ నగు నేరికిం దరము? సంచరన్మధుపాళి జయజయారావముల్, సంపతచ్ఛదనాళి సన్మానపత్రముల్, ఉల్లసన్నవకాంచనోపాయనంబులున్, సమకూడ వని గాడ్పుకొమరు నాహ్వానించె. కన్నెమావుల తావి కమనీయమౌనంచు క్షణమాత్ర మవ్వాని సరసనం జరియించు, కన్నెమావికి మిన్న పున్నాగమని యంత పున్నాగముం గాంచ బొరిపొరిం గమియించు, కన్నెమావిని, బొన్న గాల్దన్ను గాంచనం బని దాని జేరంగ బడిబడిం బ్రసరించు తాలిమిం దూలి గంధానిలుం డీపగిది చంచలాత్ముల కెందు జరణంబు లాగునే? ముందుగా మృదుకిసలసుందరాంగము లంటి, తదుపరిన్ మంజరీస్తనకందుకము లంటి, పిమ్మటన్ నిలువెల్ల బిమ్మటిగొనం బెనగి మంజరుల గామించె మలయానిలవిటుండు. ఈదృశసుందరవనమున నెసగెడు విహరణరతి ని ల్చిన దన్నమ సురవని బొ ల్చిన యింద్రాణీవిధమున. చూతము జూచుచు, గుసుమ వ్రాతము గోయుచు, గోకిల రవములకుం బ్రతివల్కుచు, బువుటూయలలం దూగుచు, ముఖపద్మముపై విసవిస ముసరెడు దేటుల కలుగుచు, బింబోష్ఠము గాట సమీ పించెడు చిల్కల కులుకుచు, పుప్పొడికుప్పల బ్రాకుచు,. బూదేనియనదు లీగుచు, నలినమ్ముల మొగిడించుచు, దెలికల్వల బొదరింపుచు, సారంగంబుల వాల్గను సన్నల బాఱంద్రోలుచు, చక్రాంగంబుల బదహం సకరవముల నులికించుచు, మాటల గోగుల, పాటల మహిళల, కవుగిట గ్రోవుల, నవులం బొన్నల, ముఖరుచి మావుల, ముఖసుర బొగడల, ననిపించుచు, జిగి నంతట నించుచు, మది దొట్రిలు సమ్మదపుంఝరమున బ్రసవోత్కటరసవాహిని మించుచు, ధర మెట్టిన యచ్చర బురుడించుచు జరియించె వనాంతరమం దన్నమ. ఈరీతిం జరియించుచు నారీమణి యెదుటం గనె నిరతమరందాసారము, పరిమళవివశీకృతమా రుతసంచారము, వ్రతతీ భృతవివిధసుమాలంకా రము, బంభరమృదుఝంకా రము, నొక పువుటీరము. ఆవృతాగమకల్పితాంధకారము బాప బంధూకమణిదీపవర్గముల వెలిగించి, పరజనాహూతి దెలుపంగ శుకపికచార నివహాల నుండంగ నెల్లెడల నియమించి, మధుపతేజోబలము,మాధవు కృపాబలము, వెలయ బాలింత్రు దీవియకన్నె లీరమ్ము. ఈదృశమేదురకుతుకో త్పాదకకుంజాంతమునం గదలుచు దోచెన్ విశదా కారం బొక్కటి యంతట. నడయాడు రజతంపు బుడమితాలుపొ నాగ బెడగారు పాల్కడలి ఫేనపుంజమొ నాగ కడలి వెడలిన సురల కంఖాణమో నాగ పుడమి నిల్చిన వేలుపుందొర గజమొ నాగ బెడగై, దంతద్వయరుచి కడలన్ వెన్నెల నింపగ, తొండము హరిసేవక కర మండిత కలధౌతోజ్జ్వల దండంబును బురుడింపగ, నిండగు నాకృతి నీరజ వైరిన్ స్ఫర్థించెడు నవ భాపుంజము లొలికింపగ, ఖండితవృక్షకకాండాంచితమై, క్రందననినదంకరదిక్తటమై, శారదనీరద, చందన సుందర సితసింధురమై చెలువొందిన దది. ధరపై బ్రాకెడు బృహదవ దాతాంబుద మా గజ మా కుంచింపగ సాగెన్ హరి యించుక పోయెడు కపురపు సంచయమన నంతంతకు. ఏమిటి? ఈ కుంజం బేమిటి? ఈ మత్తద్విరదం బేమిటి? కొండ కరంగిన విధమున నది కుంచించుట యిది యేమిటి? అని విస్మయవివశీకృత మనోంబురుహయై, అనిమీ లితనేత్రద్వయియై, వ్రే లిడి నాసం, దిలకించెడు నన్నమ నా ద్విరదం బల నల్లన జేరంజని, యణు మాత్రంబై త్రుటిలో న మ్మానిని గర్భము జొచ్చెను. అననుభూతపూర్వ మతులవిస్మయావహంబునై ఆ ఘటనము మేన వే ఘటింపగాను బుల్కలన్ మనము వడక, స్వేదకణము లురలగాను డిగ్గునన్ చెంతనున్న మ్రాని జెలువ కౌగిలించె బిగ్గరన్. అంతలో నా దృశ్య మంతర్హితంబయ్యె సుంత మేల్కాంచి చెలి ప్రాంతంబు నీక్షించె, కాంతారభూజమ్ము గలచోట గాంతునిన్ వింతగా గని కాంత వ్రీడ నాకుంచించె. "అన్నమ! అన్నమ! నా బ్రతుకున పున్నమ! యేమిది? యేమిది? కల యో, కాంక్షయొ, వెఱపో, వెరగో యే కారణ మీ కలవర మో చెలి?" అను నాయని సాంత్వనములచే నాయమ పూర్తిగ నందెను జాగృతి. మఱునాడు జోస్యు లా తెఱగెల్ల నాలించి శిరము పంకించుచుం, జెక్కునం జెయి చేర్చు చున్, భ్రుకుటి ముడివెట్టుచున్, యోజ గావించి అనిరిట్టు లమృతధారానుకారోక్తులన్. "ఆరామదర్శనం బతిశుభవ్యంజకము, సితగజము సత్త్వమున కతిమాన్యతకు జిన్నె, అది గర్భముం జొచ్చు టగు భూరిసత్త్వుండు నతులమాన్యుండునౌ సుతుడొదవు చిహ్నమ్ము. సుపవిత్రుడు, స్మరసుందరగాత్రుడు, సజ్జనమిత్రుడు, జ్ఞానకళత్రుడు, విక్రమమిత్రుడు, విమతిలవిత్రుడు, కల్గును పుత్రుడు, ఘనచారిత్రుడు." ఆ మాటల నా మిథునము మోములు వికసిల్లెం దొలి వెలుగున్ రేకల విచ్చిన వెయిఱేకుల తమ్ములవలె. ఆ మిథునము కనుగొలకుల నానందాశ్రులు గురిసెన్, అందున శంపానిభమున ఆభ యెదో వెలివిరిసెన్. ******