అవతారిక-భారతస్తవము
మా భరతదేశం మంజులారామం
మా భరతదేశం మహికి మణిహారం
చతురాగమముల జగతికి నొసగిన
పావనకల్పకపాదప మదిగో
వాల్మీకిసుధీవల్లిక పూచిన
రామాయణసుమరాజం బిదిగో
ఇదిగో వ్యాసమునీశ్వరకల్పిత
పంచమవేదంబను పద్మవనం
అల్లదిగో కణ్వాత్మజ వాకిట
బెరిగిన లతికా-తరు-రురు-వారం
భరతుని అభినయపాఠము నేర్చిన
కలహంసల పదవిలసన మదిగో
జయదేవుని శిష్యత్వము గాంచిన
తీయని పాటల కోయిల లివిగో
ఆంధ్రసరస్వతి కారతి నెత్తిన
అభినవభోజుని ఆరామంబిది
అందలరిన కవిబృందము పల్కులు
విందొనరించును వీనుల నిరతము
మా భరతదేశం మంజులారామం
మా భరతదేశం మహికి మణిహారం
మా భరతదేశం మంజులారామం
మహికి మా దేశం మందారదామం.
*****
అవతారిక-భారతీస్తవము
వసవల్చు బాలకుల పసిడినాల్కల పైని
దొలియక్కరంబులం దొలిచి తొలిచి,
సంతృప్తిలేని జిజ్ఞాసువుల మెదడుగి
న్నెలలోన జ్ఞానసుధ నినిచి నినిచి,
వెలుగొంద నిరతంబు విజ్ఞానదీపంపు
సెమ్మెకుం జమురంద జేసి చేసి,
నిన్ను మతులందు బంధింపగానెంచు గు
ఱ్ఱలతోడ దోబూచు లాడి యాడి,
ఎంత యలసితొ మాయమ్మ! యీ యనంత
విశ్వమందున విజ్ఞానబీజవితతి
జల్లు వృత్తి నొక్కింత విశ్రాంతి గాంచ
రమ్ము మామకహృదయాంతరమ్మునందు!
ఆదికవి నన్నయ్య అక్షరంబులలోన
ప్రచురమై పాఱు రుచిరార్థధునివీవు,
తిక్కనకవిబ్రహ్మ తెన్గునుడికారమ్ము
లో దేజరిలు శక్తి వోదేవి నీవు,
భక్తపోతన్న పదబంధముల నందముగ
నందియలు సవరించు సుందరివి నీవు,
శ్రీనాథకవినాథశృంగారరసడోలి
కల దూగు రాయంచకలికివే నీవు,
అల్లసానికవీంద్రు నల్లికం బెనగొన్న
మధురసంబులు గాఱు మార్ద్వీక మీవు,
భట్టుమూర్తికవీంద్రుపద్యవసుహర్మ్యముల
నిల్చి వీణియ మీటు నెఱజాణ వీవు,
"విశ్వనాథ"కవీంద్ర విస్తారవిజ్ఞాన
కల్పలత పూచు లతికాంత మీవు,
ఇన్ని వేషాల ధరియించి సన్నుతాంధ్ర
సాహితీనాట్యరంగాన జాణవైన
నీవతిప్రసన్నాకృతి నావహిల్లి
రమ్ము నర్తింప నాయాస్యరంగమందు!
*****
అవతారిక- జోహారు
(సురవరం ప్రతాపరెడ్డికి)
కాలం బనియెడు కాండపటంబున
డాగిన యాంధ్రుల మూగచరిత్రపు
గలికికి ముద్దుల పలుకులు నేర్పీ
వెలుగున్ జూపిన విద్వన్మణికిన్
ఆంధ్రుల సాహిత్యాంబుధి నవలో
డన మొనరిచి యందున డాగిన సాం
ఘికధర్మపు మణినికరము దొలిగా
వెలికిం దోడిన విద్వన్మణికిన్
ఇవె నా జోహారులు!
ఇవె నాదు నమస్సులు!
ఇవె తత్పదసేవకు
నేనిడు సుమనస్సులు!
*****
అవతారిక- కృతిసమర్పణ
శ్రీహరితసగోత్రాంబుధి
జెలువొందిన హిమఘృణియై
దత్రిముడై శఠమర్షణ
గోత్రవియత్పథమణియై
చంద్రాంశము సత్కరుణన్
సౌరాంశము సత్పాండితి
గలిగిన సచ్చారిత్రుని
ఘనసుమనోగణమిత్రుని
వరబల్మూర్పురసరసీ
నిరతవికస్వరనళినుని
నిరతార్చితహరిచరణుని
తిరుమలవంశాభరణుని
రామతాతాచార్యరమణీయనామున్
రామచంద్రార్చనాలబ్ధసంక్షేమున్
కోమలాంతఃకరణు, గుణరత్నధామున్
శ్రీమహితు, మజ్జనకు, సితకీర్తిసోమున్
విలసజ్జ్యోతిషవిద్యానిధియై
వరమంత్రశాస్త్రపారంగతుడై
శాపురపురభూషణుడై పరగిన
సరసుడు శ్రీ శేషాచార్యునికిన్
శ్రీమత్తిరుమలజినకుంటాన్వయ
సురధుని బొడమిన సరసీజంబై
అతులితసౌందర్యరసాకృతియై
యలరిన సాధ్వికి నలవేలమ్మకు
తొలిగర్భముగా నిలలో మెట్టిన
సాక్షాల్లక్ష్మిన్ సతీమతల్లిన్
లక్ష్మమ్మాఖ్యన్ రమ్యగుణాఢ్యన్
మంగళచరితన్ మజ్జనయిత్రిన్
సానందుడనై భజించి
సరసవచోగుంభనమున
నీవిధి బ్రార్థించెద నా
జీవనమే తరియింపగ.
ఇలువేల్పులు పితరులటంచుం
బలుకుగదా శ్రుతిశాస్త్రంబుల్
తద్హృదయాహ్లాద మొనర్పం
దగునెది యని తలపోయునెడన్.
శతపత్త్రసుకుమారశయములే కందంగ
బరమేష్ఠి కంటకితపాదంబు లొత్తి యొత్తి,
అభ్రగంగానిలాహతి దక్కి మాటికిన్
శ్రుతిదప్పు వీణదుర్గతి కెంతొ విసివి విసివి,
స్వారికిన్ రమ్మన్న స్వర్ణదీషండముల
దాగికొను రాయంచ దంభమున కలిగి యలిగి,
కల్పద్రుఫలరాశి ఘనమాధురికి జొక్కి
చేతికిన్ రాకున్న చిల్కచెలి జీరి చీరి,
శాంతి సుంతయు గనలేక స్వాంతమందు
సురలలోకముకన్న మేల్నరుల లోక
మనుచు జయ్యనం దివినుండి యవతరిల్లి
నాదుముంగిట నిల్చెను నలువరాణి!
అట్లు నిల్చిన వాణికి నంజలించి
స్వాదుభాషల నామె క్లేశము హరించి
నవ్యసౌఖ్యదనిలయంబు నాదు స్వాంత
నీరజమ్మున నామెను నిల్పికొంటి.
ఆవాణీప్రేరితమగు
శ్రీవాక్యంబులె యివి; యివి శ్రీమద్గద్వా
లావిభుభటనిస్వార్థక
థావిషయసుగంధపరిణతాద్భుతసుమముల్.
ననలియ్యవి కొని కూర్చితి
హనుమన్నాయకమణివిభవాన్విత మీ శో
భనహారమ్మును; మీపద
వనజమ్ముల కడ నిలిపితి భక్తిం దీనిన్.
సుందరమగు నీ యుడుగర
నందుకొని దయాన్వితమతి నామోదలస
న్మందస్మితశీతసుధా
బిందుల నన్నుం దడుపుడు ప్రియ మేపారన్.
దవులం గల కెనడాదే
శవసతి నుండుట కతమున సాక్షాత్తుగ మి
మ్మవిరతము గొల్వనైతిని;
అవిరళమగు వెల్తివొడమె నాత్మను దానన్.
కానీ నేడది వీడెను
ఈ నవకావ్యంపు బౌత్రి నింపుదలిర్పన్
మీ నయసన్నిధి నునుచుట
నీ నెలతుక కూర్చు మీకు నిమ్ముల నెపుడున్.
సారప్రసాదగుణవి
స్తారయు, మాధుర్యవిలసితామృతభాషా
సారయు, మంజుగతిమనో
హారియు నగు నీవరాంగి యలరించు మిమున్.
కావున నీ చెలువకు మీ
సేవాభాగ్యము గలుగగ జేయుడు, దానం
బావనమొనరింపుడు నా
జీవనముం బితరులార! స్థిరసౌహృదులై."
షష్ఠ్యంతములు
అవనీసుపర్వమణికిన్
భవికాపస్తంబసూత్రవర్తితమతికిన్
సువిపశ్చిన్మణికిన్, సత
తవైష్ణవమతైకధర్మతత్పరమతికిన్.
చతురాగమార్థవేదికి
చతురపురాణార్థమనితసన్మార్గునకున్
చతురసుభాషామోదికి
సతతసువర్తనజితారిషడ్వర్గునకున్.
ప్రతిసంవత్సరసీతా
పతిపట్టోత్సవసమయసభాగతసత్పం
డితపరితోషణునకు, దత
వితరణచణునకు, ఘనునకు, బ్రియజనకునకున్.
పావనగుణచారిత్రకు
శ్రీవనజాక్షీసమానశివరూపిణికిన్
లావణ్యాంచితగాత్రకు
క్ష్మావనజాక్షీనిభక్షమాభూషణకున్.
ఆత్రేయసగోత్రజకున్
వృత్రారిసతీసమానవిభ్రమయుతకున్
పుత్రీపుత్రాష్టకకున్
మైత్రావరుణిప్రియాభమహిమాన్వితకున్.
కరుణోదారకు, కమలా
చరణాంబురుహార్పితాత్మసరసీరుహకున్
వరగుణమణిహారకు, శ్రీ
కరవాక్సారకును, మామకప్రసువునకున్.
కానుకగా నేనొసగెడు
కావ్యంబునకున్, హనుమ
ప్పనాయకాఖ్యంబునకున్
ప్రారంభంబగు నీగతి ...
******