ప్రస్తావన

ఇది నా తొలియత్నము. దీని నాధునికు లవలంబించుచున్న గేయ(మాత్రా)చ్ఛందస్సులో వ్రాసితిని. గేయచ్ఛందస్సులో ననేకప్రశస్తకావ్యములు వ్రాసి నవీనమార్గప్రవర్తకులైన డాక్టరు సి. నారాయణరెడ్డిగారికి నా నమస్సులు. వారి నాగార్జునసాగరాన్ని పరిశీలనాత్మకంగా చదివిన పిమ్మట నాలో మాత్రాచ్ఛందముపై ప్రత్యేకాభిమాన మంకురించినది. ఆ రీతిలో రచనావ్యాసంగము చేయవలెనను అభిలాష నాలో నెక్కొన్నది. తత్ఫలితమే యీ చిన్నిపొత్తము.

రచన ప్రధానముగా ఖండగతిలోనే సాగినది. అటనట త్ర్యస్ర, చతురస్ర, మిశ్రగతులను కూడ స్పర్శించినాను. ఒకేగతిలో కొన్నియెడల మాత్రలను పెంచి, కొన్నియెడల తగ్గించి వ్రాసినాను. కొన్నిచోట్ల నిర్దిష్టమాత్రాగణ సంయుతములైన క్రొత్తపద్యములను వ్రాయ యత్నించినాను. ఉదాహరణకు ప్రథమసరమందలి ప్రథమపద్యము, ప్రతిపాదమందును వరుసగా రెండు త్రిమాత్రాగణములు, రెండు పంచమాత్రాగణములు గల్గి, చతుర్థగణప్రథమాక్షరము విశ్రామస్థానముగా గలట్టిది. ఇందు ప్రతిపాదమును దీర్ఘాంతమై యుండవలెను. ప్రతిచ్ఛందమందును నియతముగా యతియో, ప్రాసయో, లేకున్న నంత్యప్రాసయో పాటించినాను. బేసి సంఖ్యలో నున్న గణములు గల ఛందములందు యతివిషయములో కొంత స్వాతంత్ర్యము చూపినాను. ఉదాహరణకు పాదమున కైదేసి గణములున్న ఛందములలో, కొన్నియెడల తృతీయగణ ప్రథమాక్షరమునందును, కొన్నియెడల చతుర్థగణ ప్రథమాక్షరమునందును యతి నిల్పినాను. ఇందులో మొదటి పద్ధతి సి. నారాయణరెడ్డిగారు వారి "కర్పూరవసంతరాయ"ల్లో చూపిందే. రెండవపద్ధతిని నేనిట ప్రయోగాత్మకముగా ప్రవేశపెట్టినాను. త్రిగణపరిమితపాదులైన ఛందములలో తృతీయగణప్రథమాక్షరమును గాని, లేక ఉత్తరపాదప్రథమాక్షరమును గాని యత్యక్షరముగా గ్రహించినాను. ఇందు రెండవమార్గము నారాయణరెడ్డిగా రనుసరించినది. ప్రథమమార్గము నేను ప్రయోగాత్మకముగా ప్రవేశపెట్టినది. అన్వయోచ్చారణసౌలభ్యముల దృష్ట్యా కొన్నితావుల విసంధి చేసినాను.

నాపై నాధునికులకంటె ప్రబంధకవుల ముద్ర మెండు. అందును "వసుచరిత్ర" నాకు వసువుకంటె ప్రీతిపాత్రమైనది. అందుచే తత్ప్రభావ మటనట పొడసూపవచ్చును. వృత్తిరీత్యా నేను సాహితీనిర్మాణాని కింతైన పొంతన కుదురని ఖగోళశాస్త్రజ్ఞుణ్ణి. అందుచే మాత్రాచ్ఛందోరీతుల నాకళింపు చేసికొనడానికి నాకు ప్రత్యేకవ్యాసంగ మవసరమైంది. ఈవిషయంలో డాక్టరు పాటిబండ మాధవశర్మగారు నాకమూల్యమైన సాయము గావించిరి. వారు మాత్రాచ్ఛందమును గూర్చి నాకు వివరించుటయే కాక, కావ్యమునంతా కొండంత ఓపికతో విని పెక్కు చక్కని సలహా లొసంగిరి. తిలకరేఖాప్రాయమైన పీఠిక గూడ వారే వ్రాసి యిచ్చిరి. ఇన్నివిధాల నాపై వాత్సల్యము గనబఱచిన వారి ఋణము తీర్చుకొన శక్యముగానిది.

కావ్యరచనాకాలంలో డా. ముదిగొండ శివప్రసాదుగారు, ఉత్పల సత్యనారాయణాచార్యులుగారు నాకెంతో ప్రోత్సాహము నొసంగిరి. శ్రీమాన్ రాచర్ల రాఘవాచార్యులుగారు దీని నాసాంతము విని వారి సలహాల నొసంగిరి. ప్రియమిత్రులు అల్లంరాజు వెంకటరావుగారు ముఖపత్రమును తీర్చిదిద్దిరి. వీరందరికి నా కృతజ్ఞతలు. తమ యభిప్రాయాత్మకములైన యాశీస్సులను డాక్టరు దివాకర్ల వేంకటావధానిగారును, శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారును దయతో నొసంగిరి. వారిర్వురకు నా నమశ్శతములు. "లహరి" సాహిత్యసంస్థ యీ కావ్యప్రచురణమున కంగీకరించినది. ఈ సంస్థాధిపతులకు నా ధన్యవాదములు. శ్రీ దాసు నరసింహారావుగారు దీనిని చక్కగా ముద్రించి యిచ్చిరి. వారికి నా కృతజ్ఞతలు.

మునుముందు గేయచ్ఛందమునందు ఉత్తమకథాకావ్యముల నల్లవలెనను పేరాసతో నున్నాను. పరమాత్ముని కరుణ, పాఠకుల యాదరణ నా యుద్యమమును ఫలోన్ముఖ మొనరింపగలవని యాశించుచున్నాను.

-- తిరుమల దేశికాచార్య


మలిపలుకు

అశ్రుమాల 1971 నవంబరు 1వ తేదీన ఆంధ్రసారస్వతపరిషత్తు ప్రాచ్యకళాశాలలో డా. పాటిబండ మాధవశర్మగారి అధ్యక్షతలో, డా. జి.వి. సుబ్రహ్మణ్యంగారిచే ఆవిష్కృతమైంది. ఇది ఆవిష్కృతమైన మఱునాడే నేను కెనడాదేశానికి డాక్టరేటు విద్యార్థిగా బయలుదేరినాను. సాహితీరంగంలో నేను ప్రాథమికునిగా నున్నదశలో వ్రాసిన పుస్తకమిది. ఇది వ్రాస్తున్న రోజుల్లో డా. పాటిబండ మాధవశర్మగారి అంతేవాసిత్వం నాకబ్బడం నా అదృష్టం. వారితో మాట్లాడటమే సాహితీవిజ్ఞానసర్వస్వాన్నిఆకళించినట్లుగా ఉండేది. ఒకవిధంగా వారే నాకు కవితాగురువులని చెప్పుకోవాలి. ఇది నా మొదటి కావ్యమైనా, నాకు అత్యంతప్రీతిపాత్రమైనది. ఇందులోని భాష, భావాలు ఇప్పటికీ నన్ను ముగ్ధుణ్ణి జేస్తుంటాయి. సాహిత్యమంటే ఏమిటో తెలియని రోజుల్లో దీన్నిఈవిధంగా ఎట్లు వ్రాసినానో అని నేననుకొంటుంటాను. 30 ఏండ్లక్రిందట వ్రాసిన ఈ లఘుకావ్యాన్ని ఇప్పుడు వెబ్ పైకెక్కిస్తున్నాను. ఇందులో చాలా ఛందాలు ధ్వనిపూరితములూ, విశేషార్థసమన్వితములూ అగుటవల్ల త్వరలో అర్థతాత్పర్యములతో గూడిన అనుబంధాన్ని గూడ ఇక్కడ ఉంచబోతున్నాను. దీనిని పఠించిన పాఠకులు తమ అభిప్రాయాలను, విమర్శనలను నాకు ఎలక్ట్రానిక్ మేల్ ద్వారా తెలిపిన వారికి నేను మిక్కిలి కృతజ్ఞుడను.

-- తిరుమల దేశికాచార్యులు