అశ్రుమాల-ప్రథమసరము మద్వ్యథిత హృదయభంగమాలికల్ పూర్వసౌఖ్యవాసనాభూములన్ ఘట్టితంబులై యేల కరుణపూ ర్ణారవంబె నించు నే డాశలన్? కడగి పాలకడలిలోన నాడు దేలు నళినవైరి దుఃఖమలినతోయనిధిని తేలిపోవు నేల నేడు? అత్యుజ్జ్వలంబౌ మదాశాప్రదీపంబు నాకగంగామగ్న నక్షత్రముంబోలె కాసారజలమగ్న కల్హారముంబోలె అగపించు నేలొకో అస్పష్టమై నేడు? నాయంగుళీనవపల్లవమ్ములు వీణెతీవల స్పృశియించి నప్పుడు వెడలు నేలొకొ విరహేతివృత్తక నిస్వనమ్ములె నే డక్కజమ్ముగ? నా కూజితంబేల నల్గడల బర్వుచు క్షితిజపరావర్తితం బై వినుచు వేదనాభర దైన్య గేయమాలికలె నా కీనాడు? నా చూపు లేలొకో నక్షత్రఖచితాభ్ర దర్పణపరావర్తితంబులై మటుమాయ మౌ నమావస్యాసమారూఢ గాఢాంధ కారాబ్ధి మొదలంటగా మునుంగుచు నేడు? మందారసుందరనందనం బౌ మన్మనంబున ప్రభసూపు నున్మాదసంజనకోన్మత్త జాలకములే నే డేలకో? ***** ఒకనాటి అకలంక సుఖమయక్రీడయే వికలమొనరించె మది వికృతమగు పీడయై ఒకనాటి ప్రణయోర్మికాడోలి కోల్లాసకాప్లవస్మరణంబె ప్లావితం బొనరించె దేహంబు వైక్లబ్యవాహినీవీచికల ఒకనాటి సితచంద్రికా దుకూలాచ్ఛాదనస్మృతియె ఉరగఫూత్కారఫేనచ్ఛటాం బరవృతం బొనరించె దేహంబు ఒకనాటి సమ్మద ప్రకటాశ్రు సంస్మృతియె చిందించె శోకాశ్రు బిందుసందోహంబు ఒకనాటి ప్రణయమం త్రోచ్చారణస్మృతియె పలికించె గళమందు ప్రవిలాపరాగంబు ఒకనాటి ప్రణయలౌ కికవిహారస్మృతియె నిండించె లోకాన నిబిడాంధకారంబు ***** అనిశమ్ము నీ స్మరణ మాదర్శమాయె అధ్యయన మెప్పుడో అడుగంటిపోయె ప్రాణమేనియు విడెద, పాయంగలేనె నిన్నహో చెలియ! నన్నెడజేయ దగునె? నీ విరహతాపాన నా వలపుసంద్రమ్ము చింతాభ్రమై మనస్సీమమ్ము గప్పంగ దుర్దమంబైన యీ దుర్దినమ్మున గురిసె అక్షిజలధారలే అవ్యాహతవిధాన! ప్రవ్యథాకర్షకప్రాప్త మద్దహరకేదారమున నీ స్మరణబీజంబె నిత్యమై నాటువడియెంగాని, కందళితమౌ నెట్లు? కాలకందంబు గర్జించునే కాని, వర్షింప దింతేని అమృత మ్మొక్కపరియేని. నీ స్నేహరసవార్ధి నింపారు నావయై భవ్యసౌఖ్యాంతరీపాల గన స్వాంత ముబలాటపడె, గర్జించె కాలమేఘము, రేగె నురుఝంఝ, తారసిలె భూరికులధారుణీధర మోడ వ్రీలిపడె. ***** నా హృదయవనధిలో నావవై సాగి నా హృదయవనిలోన నమలివై యాడి నా హృదయవల్లకీనాదమై పాడి నా హృదయము నగల్చి నళినాక్షి నేడు నీవేగెదే నన్ను నిర్దయత వీడి? నీ యందెలో రవళించు గజ్జియను నేనై నీ యాత్మలో కుసుమించు గొజ్జగిని నేనై నీ యక్షిలో చలియించు తారకను నేనై నీ యూర్పులో స్ఫురియించు సౌరభము నేనై మననెంచితే చెలియ! ననువీడి చన దగునె? నీ హాసమందొలుకు పీయూషమై పారి నీ లాసమందొలుకు లాలిత్యమై పారి నీ భావమందొలుకు మాధుర్యమై పారి నీ హావమందొలుకు నానందమై పారి మన నేను మనసైతి, నను వీడి చన దగునె? నా చూపుల న్నీకు నారతుల బట్టి నా బాసల న్నీకు నంకనల్వెట్టి నా హృదయసుమరథ్య నడువంగ బెట్టి నా ప్రణయపట్టంబు నాదృతిం గట్టి నిను గొల్వ నెంచితిన్, నను వీడ దగునె? నా జీవనాపగానాదంబవై మొరసి నా క్రాంతివర్తనీ నవకాంతివై విరిసి నా పూర్వకృతపుణ్యరూపంబవై వెలసి నీ వేగెదే నేడు? నిష్ఠురత నను బాసి. ***** నీ కలికిహాసాల వజ్రమ్ములం గూర్చి నీ కురుల భాసిల్లు నీలమ్ములం గూర్చి నీ మోవిలో మెఱయు విద్రుమంబుల గూర్చి నీ మేని లావణ్యమౌక్తికంబుల గూర్చి నీలోని సింగారపుం బంగరుం గూర్చి నాలోని రాసిక్యనైపుణ్యముం జేర్చి రుచిరాసనం బొకటి రచియింతునే! అందులో నిన్నుంచి యలరింతునే! నీ మోములో దోచు నీరజము లేరి నీ మోవిలో బూచు మంకెనల నేరి నీ చూపులో మలయు కైరవము లేరి నీ చెక్కులో జెలగు గొజ్జగుల నేరి నీ ముక్కులో నిక్కు చంపకము లేరి నీ మేనిలో విరియు దిరిసెనము లేరి లలి గూర్చి నా భావసూత్రమ్ములందు కలిగింప గనులకుం గడుక్రొత్త విందు అలరుటూయల గూర్తునే! ప్రియమార చెలియరో నిన్నూచి యలరింతునే! నీ మానినీత్వమ్ము నిల్పి మానినులందు నీ కామినీత్వమ్ము నిల్పి స్మరదర్పణములందు నీ శాలినీత్వమ్ము నిల్పి శాలినులందు నీదు ప్రమదాత్వమ్ము నిల్పి మత్తేభగతులందు ఇంపారు కృతులొప్ప గూర్తునే! పెంపార నీకు గృతి నిత్తునే! నీ కనులలో నాదు చాపల్యముం బాసి నీ కురులలో నాదు కౌటిల్యముం బాసి నీ కనీనుల నాదు మాలిన్యముం బాసి నీ కౌనులో సద్గ్రహణశూన్యతం బాసి పరిపూతగతి గాంచ వాంఛింతునే! కైవల్యపదమొంద గాంక్షింతునే! నైల్యమ్ము రూపైన నభ్రాట్టు నాశ్రయిం చిన రట్టు బాపికొన క్షీరాబ్ధిలో గ్రుంకి తోతెంచు శంపాలతల సేవికల జేసి, జిగిమించు నెమ్మేన చిగురాకు లంటించి చిఱుదీవకరములన్ విరిపిండు ఘటియించి వల్లరీసుందరుల వరుస గైసేయు వై శాఖవనదేవతల సైరంధ్రులుగ జేసి, స్తనయిత్నుమర్దలధ్వానసమ్మోహితము నాట్యమోహితదిశాంతము శిఖావళచయము, పల్లవాహారసంఫుల్లసుస్వరపేటి వ్యాఖ్యాతకుసుమాస్త్రవాక్కోటి పికకోటి, నాటపాటల నాత్మ నతివేలతరమోద కలశాబ్ధివీచితముగా జేయ నొనగూర్చి అనురాగనవరాగమణిరచిత మద్హృదయ శుద్ధాంతవీథికాసుఖవాస మొనగూర్చి పూవులం బెట్టి పూజింతునే! చెలి నిన్ను సేవల న్నిచ్చ దనియింతునే! నీ కన్బొమల నొనరు కార్ముకంబుల గొనుచు నీ కనుల నెలవైన బాణమ్ములం గొనుచు నీ కరవ్రతతికారజ్జువుల గైకొనుచు భేరి మ్రోగింతునే చెలీ! మారు నోడింతునే చెలీ! నీ నడకలో నడయాడు మత్తేభములతోడ నీ నడుములో నసియాడు సింహేంద్రములతోడ నీ కనులలో దులకించు సారంగములతోడ నీ కులుకులో హవణించు కలహంసములతోడ నెయ్య మొనరింతునే చెలీ! నే వానితో వసియింతునే చెలీ! ***** నీ భావ మేవేళ చివురాకు వేయు నీ మోవి యేవేళ విరివాన గురియు నీ మేన నేవేళ విరితావి విరియు నీ గాన మేవేళ కలకంఠి నొరయు నాడె యామని విరియు నా జీవితాన! ముగ్ధావిచేష్టితంబున నీదు ముఖనీరజాతమ్ము ముకుళించు నేవేళ మధ్యావిచేష్టితంబున నీదు మత్తాక్షికైరవము దులకించు నేవేళ ప్రౌఢావిచేష్టితంబున నీదు భావకౌముది నన్నుచుంబించు నేవేళ నీగాఢసంశ్లేషమున నాదు నేత్రమ్ము లఱమోడ్పు వడనెంచు నేవేళ పూర్ణచాంద్రీరమ్యరాత్రియై పొలుపారు మన్మనఃపథమందు నావేళ పృథ్వి నే గాంతు నీ ఘనజఘనపీఠమ్మునందు వారి నే గాంతు నీ వాక్సుధావారమ్మునందు వహ్ని నే గాంతు నీ గాత్రశంపావల్లియందు గాలి నే గాంతు నీ నిశ్వాసకశ్రేణియందు అభ్రంబు నే గాంతు నీ విశూన్యవలగ్నమందు నిన్ను నే గాంతు నాదర్శముగ నిఖిలసృష్టికిని విస్తారతరవిరహాతపాభీలమ్ములౌ గ్రీష్మర్తులన్ దుర్వారతరనైస్పృహ్యఝరదోహలములౌ వర్షర్తులన్ తవసంస్మితస్మృతికౌముదీధవళంబులైన శరత్తులన్ ఘనకందర్పసాధ్వసశైత్యకలితంబులౌ శిశిరర్తులన్ దృఢసంశ్లేషభవదుష్ణతాస్మృతిపంచాగ్నిమధ్యంబునన్ ఘనతపశ్చర్య నిను గాంచ గంటిని గాని వనధిలో నిడ్డ మధుకణ మయ్యె నదియెల్ల. చంద్రికాతపతైక్ష్ణ్యసాంద్రమౌ గ్రీష్మర్తువే యగుచు తతమామకాక్షివాస్తతటినియౌ వర్షర్తువే యగుచు పంచశరపంచమశరాంచితము హేమంతమే యగుచు నా మనోధైర్యపర్ణము లుల్చు శిశిరర్తువే యగుచు క్షణము క్షణ మొక్కగతి క్షణద నన్నెంతొ వేధించు నీ నిరీక్షాసక్తి నెవ్వేళ నే జాగరింతు. సురసాలభుజశాఖ విరజాజి నిదురించె అరవిందహృద్వాటి నళిరాజు శయనించె అబ్జాకరాబింబితాకాశమున నేను కూర్చుంటి గ్రహతారకోత్కరగతుల గనుచు. నీ కంకణారవస్పృహణంబు నిండు నాలో నెపుడు టంకార మొనరించు గొనమపుడె పంకేజబాణుండు నీ భ్రూలతాలాస్యసంస్ఫురణ నిండు నాలో నెపుడు వలయించు ధనువపుడె పార్వతీవరధైర్యహరణుండు నీ యపాంగాలోక మేయెపుడు స్మరియింతు విరితూపుజోదపుడె శరములం గురిపించు నీ తనూలావణ్య మేతరిన్ స్మరియింతు శంబరారియు నపుడె శాంబరిన్ రచియించు. అశ్రుసరములౌ మదక్షులందు వల్లి యేదొ యుల్లసిల్లు లీల యుల్లమందు దోప, త్వల్ల తాంగతటిద్బింబమౌనొ యంచు నరయు నాకు మరుని వింటిగొనమె మఱలమఱల గానుపించు. చలదరుణకిసలయమ్ముల, హసత్కుసుమనిచయమ్ములన్ స్ఫురదమలకుట్మలమ్ముల, నటల్లలితలతలందునన్ నా వంత దాచంగ భావింతు నెంతలో, చూతవే ల్లితమల్లి భూతచారిత్రమ్ము నెదజీల్చి కనజూచు. నీదు కిలకించితము నింద్రచాపములోన నూహించి పైకెగయ నుంకించు ఆలోన కడగి నీ విరహాంధకారంబె యెటగన్న నాదు కౌతూహలము నంత జేయును సున్న. నీ మోముచందురుని నిద్దంపునీడ గన నేత్రవార్ధుల నాత్మ నిర్భంగతం గోరు - కాని నిట్టూర్పుసుడిగాడ్పు లబ్బురముగా వీచి భంగములె యొదవించు నిర్భంగముగ. నీదు విహృతంబె నా పల్కమికి గార్యమౌ ననలేక నీదు చకితంబె నా యుల్కునకు బీజమౌ ననలేక నీదు లలితంబె నా కుల్కునకు హేతువౌ ననలేక నీదు హేలయె నాదు పుల్కలకు మూలమౌ ననలేక ఎంచె నన్నున్మత్తుడంచు నామయహారి, మందులకె మందులీమరిగె మఱిమఱి నూరి. నీ కురులచంద మళికులమునందు నీ కనుల తరళ ముత్కళికలందు నీ నడల సౌరు హంసకములందు నీ నుడుల తీరు శారికలయందు కాంచనెంచితి గాని, కాదయ్యె నొకటైన తుల్యంబు, నీ వియోగాతపమె నిబిడమై నన్నేచె నిత్యంబు. తారానిలాత్రస్తతరళదీపాల వెలిగించి తెన్నులన్ వేచితినొ యెన్ని సంతమసయామినుల శయనమ్ము దొఱగి అక్షిరాగమె సాక్షి! అతివ! కన్గొనవె! నీ మోవి నొరసి తావుల గొన్న గంధానిలునివలన నీ మేని నొరసి కాంతుల గొన్న శంపాలతలవలన నీ వేణి నొరసి నీలిమ గొన్న నీలాభ్రములవలన నీ రక్తి నరసి రక్తిమ గన్న సాంధ్యరాగమువలన నే దెలియనెంతునే చెలియ! నీదు సేమ మ్మనుక్షణము! తేటిరాయని తీయతీయని యెలుంగు చాటుగా విని మోము చేటంత జేసి తావులం బంపి యాతని దరికి బిలుచు నీరజిని నాదు గుండియ నవియజేయు. ఉజ్జ్వలరసపరిపూర్ణాంతరముల్, ఉన్మిషితాననపద్మాంచితముల్, వేల్లితషట్పదవేణీభరముల్, వేధించు న్నను శారదహ్రదముల్. విమలజ్యోత్స్నాహాసోదయముల్, వికచోత్పలదృక్కేళీవహముల్, గంధానిలనిశ్వాసోత్కరముల్, కాఱించు న్నను శారదరజనుల్. ఉజ్జ్వలరసంబూని ఊరించు ఘను లేగ నతితాపకృశలైన ఆపగాకామినుల, నెఱికప్పుమెయి గప్పు వరపద్మినీనిశాం కము గాంచి అళిరాజు గనలు భృంగీతతుల, కావిపావడ గట్టి, తావిమల్లెలు వెట్టి, తలిరాకుతల్పమ్ము తారాధ్వమున నిల్పి, నెలవంకకై వేచు నెఱసంజెనెఱజాణ, "ఎంతదుర్దిన మిసీ! యిను డెంతకున్ రాడ" టంచు ముఖపద్మముల డించు యువపద్మినుల, అల వశీకృతమాధవాంచితములై యెలమి నలరారు మాధవోద్యానవల్లీందిరల, వలపు వెల్లువవోవ వనధిరాజును జేర సంభ్రమంబున సాగు జలదవేళాఝరుల, పొడగాంచి నపుడెల్ల బొడసూపి యెడలోన తొంటి స్మృతు లెయ్యవో తోరంపువగ గూర్చు. ***** నీ మాట మాణిక్యమైపోయె నా మనోవని నెట్లు నగు కర్ణికారంబు? నీ గానమే గగనమైపోయె నా హృదయవని నెట్లు ననుపారు ప్రేంకణము? నీ ముఖాలోకంబె కఱవయ్యె నా మనోవని నెట్లు ననలూను కాంచనము? నీ కరస్పర్శయే కలయయ్యె నా హృదయవని నెట్లు ననలీను నామ్రమ్ము? నీ యధరశీథువే యరుదయ్యె నా మనోవని నెట్లు ననలొత్తు కేసరము? నీ పరిష్వంగంబె మఱపయ్యె నా హృదయవని నెట్లు ననలెత్తు కురువకము? ***** పరభృతము నన్నిపుడు పరుషవాక్కుల బల్కె చలదామ్రకిసలశాఖ యేమయ్యెనని. క్రోధంబు సాంగమై ఘూర్ణిల్ల నెఱముక్కు పృచ్ఛించె కీరంబు బింబ మేమయ్యెనని. ఝంకృతుల బెదరించె సారసాసవభుక్కు నిక్కంబు నుడువు మే చక్కి సారస మంచు. ఆననం బెఱజేసి మానసౌకఃకాంత పూని పృచ్ఛించె నే పొంత పద్మిని యంచు. బెదరుచూపుల జూచె బిత్తరికురంగమ్ము ప్రిదిలె తొల్లింటి సంప్రేక్షణాశ్రయ మంచు. ఘనవాలము న్ముడిచె గర్జానుకూలనటి కనరావు తొల్లింటి కరతాళగతు లంచు. మాయమైపోయె నా మార్గణశ్రేష్ఠ మీ యెదనం దిదేమంచు నించువిల్దొర గుందె. లలితాంగలాస్యాల లత లేని బ్రతుకేల యని యెంతొ సంస్తబ్ధుడై సమీరణు డణగె. లత లేక యేరీతి లతికాంత ముల్లసిలు నంచు ఋతురాజు మోమైన జూపకపోయె. ***** నీదు సన్నిధానదివమునందు నాదు భావరాజి వేగవిజితవిహగరాజ మౌచు వింటి నాక్రమించె, నీ నితాంతవిప్రయోగతమములోన నేడు భీష ణవ్యథాదివాంధము నను వెంటనంటి వెక్కిరించె. నీ నవ్వువెన్నెలలు నివ్వటిలు నావేళ దినము సైతము శరత్క్షణదయై మురిపించె, నీ వియోగాతపమె నిండారు నీవేళ జ్యౌత్స్ని సైతము ప్రతప్తాహమై వెతనించె. నీ చెక్కుటద్దాల నాచాయ గను నాడు చారుతాతులితమై నారూప మగుపించె, నా చెక్కు లద్దాన జూచికొన నీనాడు ఆకుంచితంబులై నాకదరు గలిగించె. నీ వపుస్సంశ్లేషనిష్పన్నసుఖపూర్తి స్వేదపులకాంచితస్థితి జెందె మెయి నాడు, నీ విరహసంశ్లేషనిష్పన్నసంజూర్తి స్వేదపులకాంచితస్థితి జెందె మెయి నేడు. త్వత్తనూలావణ్యతరళోర్మికల దేలు నావేళ ముక్తామయపయస్సముద్రమై తోచె మజ్జీవితము, త్వద్వియోగోగ్రవైశ్వానరార్చుల గాలు నీవేళ పృథుబాడబాఘూర్ణవిషధియై తోచె మజ్జీవితము. నీచేతికంకణా ల్నినదించు నావేళ నవరాగసుషిరంబు రవళించె నాలోన, నాలోని యస్థికల్ నాదించు నీవేళ ప్రవిషాదభిదురంబె పలికె నా యెదలోన. సకి! నీదు మృదులాంగసంస్పర్శమున నాడు ప్రసవకిసలంబులే పరుషంబులై తోచె, తదభావమున నేడు మదనాశుగంబులై ప్రసవకిసలంబులే పరుషంబులై తోచె. ఏ కాష్ఠముల నీ పెంజిచ్చు రగిలించితో నా హృదయమండపమందునన్? కన్నీటివాకలు గదలివచ్చిన గాని శమి యింపంగబో దింతేనియున్? ఆక్షినీరమ యిద్ది? అటులైన సంతప్తహృదయంబు జల్లార్ప దిదియేమి? కాదుపో! యెద వేల్మి గావింప నతనురససిద్ధకృత కృతకాజ్య మగుగాని! ఏఱాత జేసెనో యీ గుండియన్ ధాత? విరహాగ్నికీలికల్ విన్ను నంటుచునుండ కాలనేర్చునె కాని, ఘనరావముల్ నిండ నఱవఱలుగాకుండె పొరపాటుచేనైన! ****** ఎలగాలి వీచె, తొలికోడి కూసె, ఇనరోచి తోచె, హిమరోచి మాసె, అక్కజం బిదిగాదె? అహ మెట్టు లొనగూడె నీ నేత్రనీరజోన్మేష మొదవక నేడు? సంధ్యాముఖం బెఱ్ఱవాఱె, సారసాప్తుడు వెలవెలంబాఱె, రాత్రీముఖంబు హసియించె, రాజులో కళలెల్ల కుసుమించె, మిథ్య యంతయు సుమీ! మీరె ఱేయెటు నేడు? నీ నమీలితనేత్రనీరజద్వయి లేక? ఔను! నీ కనుమోడ్పులో నగును చీకటియె, నీదు కనువిప్పులో నెగడు వెల్తురె నాకు, కాని యేగితి నన్ను గడచేసి నడిస్వప్న మందెట్టు లుదయించు మదియం దుదయమింక? ****** అనురాగమధువెల్ల మనసార పూరించి మత్తతం దూలు న న్మధులోలుడని యెంచి ఎడబాసి పోయితో యిపుడీవు జవరాల? గాఢసంశ్లేషమున గాత్రమ్ము వేడెక్క అత్యతనుసంజ్వరార్తాకారు డితడంచు నెడబాసి పోయితో యిపుడీవు జవరాల? నీ రుచిరచికురమధుపాళి నా కరము నెనరార లాలింపగా కరము మధుపాళి లాలించితని తొరగిపోయితొ నన్ను జవరాల? తతరాగసంచలత్ త్వద్రాగపల్లవో ష్ఠములతో నామోవి సన్మైత్రి బచరింప పచరించితని పల్లవాళికిం బ్రణయంబు నెడబాసి పోయితో యిపుడీవు జవరాల? సకలపుణ్యావనీమకుటాయమానమౌ కాశ్మీరజన్మంబు గననైతి నాకేల లభియించు దన్వంగి లలితాంగవాసంబు? వనసీమ వసియించి, ఫలభిక్ష భుజియించి, పెనుతపమ్మున మించి కననైతి వరవాణి కలవాణి మృదువాణి గననేర్తు నింకెట్లు? హరి గాంచి సొంపారు నాకారముం గాంచి, సిరి గాంచి భవ్యవసుగరిమోన్నతిం గాంచి, పరగంగ లేనైతి ప్రాప్తించు నాకెట్లు సరిలేని జవరాలి సద్వక్త్రసఖ్యంబు? అవహిత్థ దనరారి, యత్యంత వినివృత్త వక్త్రవౌ నీ మనోభావం బెఱింగియును పొలయల్క దీర్పంగబోకున్న యలసతయె హేతువౌనేమొ ఈ యెడబాటు కీనాడు? ఎలసిబ్బితిం బుల్క లివురొత్త నీషన్న తాస్యవై, మతినంత నతివేలమౌ రక్తి మై విసర్గోష్ఠవౌ నీ విలాసం బలతి గావించుటగునొ కత మీ వియోగానకున్? విప్పార గండమ్ము, విఱియ లోలాక్షులున్, వేగిరింపగ మనము, వీక్షింప దలకొంటి నన్నేక్షణం బాక్షణం బేను గల్గమియె హేతువౌనేమొ ఈ యెడబాటు కీనాడు? ఉరుసంభ్రమస్ఫురణ గరపద్మినుల జేరు హంసకమ్ముల బాపి ఆచరింపక ప్రియము నుసిలియుండుట పెద్ద దొసగుగా జేయుటే హేతువౌనేమొ ఈ యెడబాటు కీనాడు? ***** దోష మొదవిన నేమి? దోషాకరమె జగము దోషాకరుని రాత్రి శ్లేషింప దమి గొనదె? కాకోలగళు నార్య కౌగిట న్వలగొనదె? నాకేల యీశిక్ష? నాళీకదళనేత్ర! ఒకసారి కనులెత్తి సకి! నన్ను జూడవే! నవరాగదీపికల నాలోన నిల్పవే! ఒకసారి గళమెత్తి సకి! నన్ను బిల్వవే! నవరాగవేణువుల నాలోన నూదవే! ఒకసారి దరహాస మొలికింపరావే! విరివాన నాలోన గురిపింప రావే! ఒకసారి భ్రూలాస మొనరింప రావే! విరిబాట నాలోన విరచింప రావే! మకరందమేఘంబవై నా హృదయతాపంబు నపనయింపగ రావె! మధుపూర్ణపాత్రంబవై నా మదిన్ సుంత శాంతమ్మొనర్పగ రావె! నెత్తావితీవవై మత్తనువు వలయింపగా రావె! ముత్తెములవాకవై మత్తనువు ముంచెత్తగా రావె! గగనగంగాతరంగంబవై నాబ్రతుకు నతులచైతన్యభంగితముగా జేయవే! ప్రవిమలానందసౌవర్ణపంకంబునన్ పంకేజముల నాత్మ పొంకముగ నిల్పవే! కౌముదీలహరికాకల్లోలమాలవై మద్హృదయనైరాశ్యమాలిన్యముం గడుగవే! కందర్పలహరికాకల్లోలమాలవై అభినవాశాహల్లకావళిన్ మది నిల్పవే! సాయంసమారంభసంఫుల్లమల్లివై అళికీటకన్యాయ మాచరింపగ రావె! ప్రాతస్సముత్ఫుల్లపద్మినీవల్లివై అళికీటకన్యాయ మాచరింపగ రావె! తెలివన్నియల కలహంసివై నా మానసమ్మున వాహ్యాళి నలరగ రావె! నులివేడియిమ్ముల యిమ్మువై నా కౌగిళుల చిరవాసమ్మునందగ రావె! * * * * నిష్ఠురాత్మవు ప్రమద! నీవేల పల్కెదవు? విజనాటవి న్మొరయు వేణునాదమువోలె, విస్తృతాంబుధి గుఱియు వృష్టిపాతమువోలె వ్యర్థమై చనె మద్దురంతపరిదేవనము! నీ హృచ్ఛిరీషంబె నా హృదయప్రస్తర మ్మును దలిర్పంజేసె నని బ్రమసితిని యిన్నినాళ్లు, కాని, నీ హృద్గ్రావమే నాదు మృదుహృచ్ఛి రీషమున్ ధ్వస్తమొనరించె నని తెలిసితిని నేడు! చాంచల్య మూనదగు శఫరాక్షులం గాని, కౌటిల్య మూనదగు కచపంక్తులం గాని, ఉరురీఢ నూనదగు నుపమానముల గాని, నాయందు నూనదగునటె? యీ గుణగణంబు? హిమరోచి యేవేళ ద్యుమణి నవగుంఠనమ్మొనరించు - జగమెల్ల సాద్రాంధ కారాన్వితం బౌచు గనుపించు. కాలావగుంఠనము గైసేసి యేవేళ యామినీతన్వంగి అతివిరక్తిం జూపు, పాసి ఉన్మేషంబు, రోసి కళలన్నియున్ కడకజెడి ద్విజరాజు కాలాంబుధిం బ్రుంగు. ఏపారు రాజీవహృదయంబు జేరి సూనాసవం బెల్ల జొక్కుచుం గ్రోలి సంతృప్తమై వేడు సారంగి కాని పద్మంబె నీరసంబయి ప్రభ దొఱంగు. పద్మినీముఖ మెపుడు వికసించు భాను డపుడే కాంతి నించున్ పద్మినీముఖ మెపుడు ముకుళించు భాను డపుడే కాంతి డించున్. తటిత్తు మెఱిసిన తరుణంబందున వెలుంగు కన్నుల వెయి దీపంబులె, తటిత్తు మాసిన తక్షణమందున దొఱంగు గన్నుల దొలిగల కాంతులె. నాలోన గల్గు తేజోలవ మణగిపోయి, నాభావఖగపక్షమే భంగపడిపోయి, నారాగవల్లకియె నీరవంబయిపోయి, నాజీవవని దావభాజనంబయిపోయి, ప్రళయ మాభీలమై వలయించుటకు మున్నె నా ప్రణయదేవతా! నను జేరగా రావె! ఏనాటి బంధమో హృదయేశ్వరీ! నిన్ను నన్నొకటిగా గూర్చె ననల దారమువోలె, అది దైవికము; దాని నదటునం ద్రుంచంగ నీవెవరు? నేనెవెడ? నిజమెంచి చూడంగ! హాలాహలమ్ముననె యమృత మ్మొదవినట్లు ఈ విషాదములోనె యెనలేని సౌఖ్యమ్ము జనియించి మునుముందు మన జీవితమ్ములన్ వరసుధాఝరులుగా బరగించు గాబోలు! ******