మీరు దయతో నిచ్చిన అశ్రుమాలయందలి రెండుసరములు పరిశీలించితిని. అవి రెండును రెండు కరుణరసప్రవాహములు. ఆంధ్రవాఙ్మయమున నిట్టి విషాదకావ్యములు మూఁడునాల్గుకంటె నెక్కువ లేవు. వానిలో ప్రణయనైర్మల్యముచేతను, కరుణరసనిర్భరతచేతను మీ కావ్య ముత్తమస్థానము నందుననుటలో నతిశయోక్తి యుండదు. ఏవో కొన్ని మాత్రలతో గూడిన ఛందమును, 'యతిర్వా ప్రాసోవా' అను నియమమును మృదుమధురమును నిర్దుష్టమునునైన భాషయు మీ కావ్యమునకు వైశిష్ట్యము చేకూర్చుచున్నవి. మీ భావములు నిర్భరములు, సువ్యక్తములునై యింపునింపుచున్నవి. మీరు ముందు రచింపబోవు గేయమహాకావ్యబీజము లశ్రుమాలలో నెడనెడ తొంగిచూచుచున్నవి. భగవంతుడు మీకట్టి యవకాశము జేకూర్చుఁగాక!
-- దివాకర్ల వేంకటావధాని
శ్రీ తిరుమల దేశికాచార్యులుగారు రచించిన నీ లఘుకావ్యమును స్థాలీపులాకముగా నటనటఁ జూచి యానందించితిని. ఈ కవి హృదయమిందు బాగుగా గోచరించునట్లు సరళశైలిలో రచన సాగినది. నియతమగు నొక మాత్రాచ్ఛందస్సును గొని మున్ముందు చక్కని కావ్యసృష్టి చేయదగిన భాషాబీజములు, కవితాబీజములు నిందు సర్వత్ర గోచరించుచున్నవి. కవితావర్ధిష్ణువగు నీకవికిశోరము భావికాలమునందుఁ బెక్కు కావ్యములను సుందరముగా రచించి యాంధ్రసరస్వతిని కావ్యసరములచే నలంకరించుగాక యని భగవంతుని బ్రార్థించుచున్నాను. విద్వద్వంశజుడు గావున స్వయంప్రవృద్ధమగు భావనాసంపత్తిని, అభ్యాసలబ్ధమగు నిర్దుష్టరచనాసంపత్తితో మేళవించి తన ప్రతిభాసూత్రమునఁ గూర్చి యీ కావ్యసరమును విజ్ఞుల కంఠహారముగా నొనర్చిన యీ కవి కడు ధన్యుఁడు.
-- కప్పగంతుల లక్ష్మణశాస్త్రి