మిత్రులు దేశికాచార్యులుగారు యువకుడు, భావుకుడు, వృత్తిచే ఖగోళశాస్త్రాధ్యాపకుడయ్యు ప్రవృత్తిచే కవితాప్రియుడు. ఆంధ్రసంస్కృతభాషాసాహిత్యములందు చక్కని వైదుష్యము గల వాడయ్యు వినయసంపన్నుడు, శాంతస్వభావుడు, మృదుశీలి, మధురవర్తనుడు. సంప్రదాయమును వీడని నవ్యత ఆయనకు ఉపాదేయము.
కవికి కావలసిన నిసర్గప్రతిభ కలిగి, కావ్యశాస్త్రాద్యవేక్షణమువల్ల చక్కని వ్యుత్పత్తిని సంపాదించి దేశికాచార్యులుగారు కవితారచనాభ్యాసమునకు బూనుకొన్నాడు. ఆ యభ్యాసమునకు తొలిఫలము ఈ "అశ్రుమాల" అను ఖండకావ్యము. ఇందలి వస్తువు ప్రణయము. ప్రియావిముక్తుడైన కవి సంయోగదశయం దనుభవించిన సుఖానుభూతులను స్మరించుచు వర్తమానవిరహతాపమువల్ల గలిగిన యశ్రువులను పద్యములుగా మార్చి యీ యశ్రుమాలను కూర్చెను. ఇందు రెండు సరములున్నవి. మొదటిసరములో విరహసమనంతర సంతాపజనితమైన నిరాశ యున్నది. రెండవదానిలో పునస్సంయోగప్రత్యాశ యున్నది. అయోగ, సంయోగ, వియోగ, పునస్సంయోగములనెడు దశలన్నియు వర్ణింపబడినచో నిది మహాకావ్యమై యుండెడిది. వియోగదశమాత్రమే వర్ణితమైనందున ఖండకావ్యమైనది. రసము శృంగారము - విప్రలంభరూపము.
"నీ విరహతాపాన నా వలపుసంద్రమ్ము చింతాభ్రమై మనస్సీమమ్ము గప్పంగ దుర్దమంబైన యీ దుర్దినమ్మున గురిసె అక్షిజలధారలే యవ్యాహతవిధాన."కురిసిన యశ్రుధారలలో ఒక్కబిందువుకూడ నేలపాలగుట కవికి సమ్మతముకాలేదు. అవి అంతవిలువ గలవి. వానిని తన హృదయశుక్తిపుటమున భద్రపరచి, ప్రోదిచేసి, ముత్తెములుగా రూపొందించి, వానితో ద్విసరమైన ప్రణయమాలను గూర్చి ప్రియురాలి నలంకరించుటకు కవి యుత్సహించినాడు.తన విరహాశ్రుమాలచే అలంకృతయై సౌభాగ్యపదకోటి నధిష్ఠించిన ప్రియురాలిని దర్శించి యారాధింపవలెనని యుబలాటపడినాడు. ఉత్సాహము తొలికావ్యమున చరితార్థమైనది. ఉబలాటము చరితార్థము కాగలదనుకొందును.
ఈ కావ్యమున ఉక్తిచమత్కారము, వ్యంగ్యవైభవము పుష్కలముగా నున్నవి.
"నీ కనులలో నాదు చాపల్యముం బాసి, నీ కురులలో నాదు కౌటిల్యముం బాసి, నీ కనీనుల నాదు మాలిన్యముం బాసి, నీ కౌనులో సద్గ్రహణశూన్యతం బాసి, పరిపూతగతి గాంచ వాంఛింతునే కైవల్యపదమొంద గాంక్షింతునే!"
తన ప్రియురాలి దృక్కుల చాంచల్యమును, ఆమె కుంతలముల కుటిలత్వమును, కనీనికల నీలత్వమును, మధ్యముయొక్క కృశత్వమును భంగ్యంతరమున స్మరించు ఉక్తివైచిత్ర్యమిది. విరహాగ్నితప్తమైన ప్రణయము లౌకికమాలిన్యములు తొలగి శుద్ధమై లోకోత్తరానందజనకమగునన్న లోకశాస్త్రప్రసిద్ధమైన యర్థమిందు వ్యంగ్యము.
"పృథ్వి నే గాంతు నీ ఘనజఘనపీఠమ్మునందు వారి నే గాంతు నీ వాక్సుధావారమ్మునందు వహ్ని నే గాంతు నీ గాత్రశంపావల్లియందు గాలి నే గాంతు నీ నిశ్వాసకశ్రేణియందు అభ్రంబు నే గాంతు నీ విశూన్యవలగ్నమందు నిన్ను నే గాంతు నాదర్శముగ నిఖిలసృష్టికిని
పాంచభౌతికమైన ప్రియురాలి ఇంద్రియగోచరస్వరూపమును వ్యష్టిగా పంచభూతములందును సౌందర్యమయమైన ఆమె హృదయైకగోచర స్వరూపమును సమష్టిగా సర్వసృష్టియందును దర్శింతుననుట వ్యక్తిగా ఆయన ప్రణయముయొక్కయు, కవిగా ఆయన భావనయొక్కయు మహోదాత్తతను వ్యక్తము చేయుచున్నది. ఇందలి పద్యములన్నియు నిట్టివే. కనుకనే ఆయన వీనిని వెలకట్టరాని ముత్యములుగా నిరూపించెను.
"తేటిరాయని తీయతీయని యెలుంగు చాటుగా విని మోము చేటంత జేసి తావులం బంపి యాతని దరికి బిలుచు నీరజిని నాదు గుండియ నవియజేయు.
ఇట్టి తీయని తేటతెనుగు పలుకుబడులు ఈ కావ్యమున కొల్లలు. విరహవర్ణనమున ప్రబంధకవులు వాడిన సామగ్రిని, కవిసమయములను ఈయన ధారాళముగ వాడుకొనెను. కాని ఆ వాడుకొనుటలో వానికొక వింత క్రొత్తదనము సంతరించెను.
ఆయన సంప్రదాయభక్తి, నవీకరణాసక్తి, ఉభయభాషారచనాశక్తి అడుగడుగునను ప్రత్యక్షమగుచునే యున్నవి. ఆయన వాక్యముల నడకకు ఛందములు ఒదిగిపోయినవిగాని ఛందములకు ఆయన వాక్యములు ఒదుగలేదు. ఇదియొక వింతశక్తి.
తనయందు పంచభూతములు, పంచభూతములందు తాను నై హృదయము నావేశించియున్న ప్రియురాలికి తన యశ్రుమాలను అందజేయుటకు కవి పంచభూతములనే దూతలుగా వరించెను. వానికి ఆవాహనార్ఘ్యాద్యుపచారములు గావించి, అవి ప్రసన్నము లగుటయు, సర్వత్ర శోభనచిహ్నములు ఆవిష్కృతము లగుటయు గుర్తించి, తన ప్రియురాలి రూపురేఖలు వానికిగుర్తు తెలియునట్లు తీరుతీరుల తనివిదీర వర్ణించి చెప్పి --
"తరళతారోపమమదశ్రుబిందూత్కరము గ్రథియించి శోకసూత్రాల రచియించితిం దీని, నీ యశ్రుసందృబ్ధమాలను జెలికి నాచిన్నెగా నర్పణముసేయ గైకొనుడు! ఓ పంచభూతములార! ఓ మాధవీ! ఓ పయోదాన్వయవరా! ఓ కౌముదీ!
అని తన దుస్సహవిరహావస్థకు సాక్షులైనవారి నందఱను పిలిచి --
"ఏగిరండింక మీరేగి రారండు నానాతియల్క పోనడచి మఱిరండు వచ్చునప్పటిదనుక వపువెల్ల వేయి కనులుగా నే తెన్నులను గాంచుచుందు.
అని వారిని ప్రియాప్రసాదనదూతలనుగా పంపెను. ఇట్లిది దూతకావ్యలక్షణము సంతరించుకొని కాళిదాసాదుల దూతకావ్యశ్రేణిలో చోటు కల్పించుకొన్నది. వానిలో తన వ్యక్తిత్వమునుగూడ నిల్పుకొన్నది. ఇందరిని దూతలుగా పంపిన కావ్య మిదియొక్కటే.
"శోకసూత్రాల రచియించితిం దీని" అని కవి యిందలి పద్యములను సూత్రములనుట మిక్కిలి యుచితముగా నున్నది. నిజముగా నిందలి పద్యములు విపులార్థగర్భములై "అల్పాక్షరముల ననల్పార్థరచన" యను మాటకు లక్ష్యములుగా నున్నవి.
ప్రణయకలహమువలన గలిగిన వియోగదశయందు విరహతప్తుడగుచుండియు కవి పునస్సమాగమ ప్రత్యాశాపరిపూర్ణుడే యయి యుండుటవల్ల ఇందలి రసము విప్రలంభశృంగారము. దానిని ఇన్ని పద్యములలో ఒక చిన్న కావ్యముగా సంతరించుటకు కవికి సంపన్నమైన భావన ఉండవలయును. అట్టిది ఈ కవికి కలదనుటకు ఈ చిన్న కావ్యమునందలి ప్రతిపంక్తియు సాక్ష్యమిచ్చుచున్నది.
ఛందోవ్యాకరణాలంకారాదిశాస్త్రములు విధించిన నియమములను ఉల్లంఘింప నవసరములేకుండ, కవితాసంప్రదాయములను తిరస్కరింపకుండ ప్రతిభా పాండిత్యములు గల యువకులు ఈనాడును రసవత్కావ్యముల నిర్మింపవచ్చునని నిరూపించిన ఈ యువకవిని హృదయపూర్వకముగా అభినందించుచు, ఈ మార్గమున ఇంకను పరిణతి సాధించి, ప్రౌఢతరకావ్యములు రచింపుమని ఆశీర్వదింతును.
-- పాటిబండ మాధవశర్మ